OTT Kannada Action Thriller: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి కన్నడ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Kannada Action Thriller: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో హిట్ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ నటించిన ఈ మూవీ 40 రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
OTT Kannada Action Thriller: కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరతి రణగల్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. నవంబర్ 15న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. బుధవారం (డిసెంబర్ 25) నుంచి క్రిస్మస్ సందర్భంగా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. బాక్సాఫీస్ దగ్గర రూ.21 కోట్లు వసూలు చేసి ఓ మోస్తరు హిట్ కొట్టిన ఈ సినిమా.. 2017లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ మఫ్తీకి ప్రీక్వెల్ కావడం విశేషం. క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది.
భైరతి రణగల్ ఓటీటీ రిలీజ్
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన మూవీ భైరతి రణగల్. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నవంబర్ 15న థియేటర్లలో రిలీజ్ కాగా.. బుధవారం (డిసెంబర్ 25) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవనుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ వెల్లడించింది. నార్తన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను శివ రాజ్ కుమార్ భార్య గీతా శివరాజ్ కుమార్ నిర్మించింది.
ఈ భైరతి రణగల్ మూవీ కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళంలలోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఇందులో రుక్మిణి వసంత్ ఫిమేల్ లీడ్ గా నటించింది. రూ.18 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.21 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించాడు.
భైరతి రణగల్ మూవీ స్టోరీ ఇదీ
ఓ బాధ్యత గల, చట్టాన్ని గౌరవించే లాయర్ ఓ డాన్ గా ఎలా ఎదిగాడన్నదే మూవీ స్టోరీ. ఇందులో భైరతి పాత్రలో శివ రాజ్ కుమార్ నటించాడు. రోనాపురం ఊరి ప్రజలు పడుతోన్న కష్టాలను పరిష్కరించే క్రమంలో భైరతి (శివరాజ్‌కుమార్) జైలుపాలవుతాడు. అక్కడే కష్టపడి చదివి లాయర్ అవుతాడు. రోనాపురం భూముల్లో కోట్ల విలువైన ఖనిజాలు బయటపడతాయి. మైనింగ్ బిజినెస్ పేరుతో ఊరిలోని భూములను బిజినెస్‌మెన్ పరండే (రాహుల్ బోస్) ఆక్రమించుకోవడం మొదలుపెడతాడు.
పరండే అక్రమాలను కోర్టు ద్వారా అడ్డుకోవాలని చూస్తాడు. కానీ పరండే అధికారం, డబ్బు ముందు భైరతి ఓడిపోతాడు. ఆ తర్వాత ఏమైంది. రోనాపురాన్ని పరండే బారి నుంచి భైరతి ఎలా కాపాడాడు? ఈ పోరాటంలో అతడికి అండగా నిలిచిన వైశాలి (రుక్మిణి వసంత్) ఎవరు అనే అంశాలతో యాక్షన్, క్రైమ్ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తూ దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు.
ఈ సినిమా కన్నడతోపాటు తెలుగులోనూ రిలీజైనా ఇక్కడి ప్రేక్షకులు అసలు ఈ మూవీని పట్టించుకోలేదు. ఇక ప్రస్తుతం శివరాజ్‌కుమార్ తెలుగులో ఓ మూవీ చేస్తోన్నాడు. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో రూపొందుతోన్న ఆర్‌సీ 16 మూవీలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.