Dil Raju Allu Arjun: సినిమా ఇండస్ట్రీలో భాస్కర్‌కు ఉద్యోగం ఇస్తాం.. సీఎంకి ఇదే విషయం చెప్పాను: దిల్ రాజు
Dil Raju Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్టు అంశాలపై మాట్లాడటానికి తెలంగాణ ముఖ్యమంత్రిని కలిశారు ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు. ఈ ఘటనలో మృతి చెందిన రేవతి భర్త భాస్కర్ కు సినిమా ఇండస్ట్రీలో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
Dil Raju Allu Arjun: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్ దిల్ రాజు మంగళవారం (డిసెంబర్ 24) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో గాయపడిన చిన్నారి శ్రీతేజ్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దిల్ రాజు.. మృతురాలు రేవతి భర్త భాస్కర్ కు సినిమా ఇండస్ట్రీలో ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అన్ని రకాలు ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.
దిల్ రాజు ఏమన్నారంటే?
మొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తర్వాత శ్రీతేజ్ ను పరామర్శించిన దిల్ రాజు.. ఆ చిన్నారి ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉందని చెప్పారు. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రేవతి భర్త భాస్కర్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడని, అతనికి ఫిల్మ్ ఇండస్ట్రీలో శాశ్వత ఉద్యోగం ఇస్తామని కూడా హామీ ఇచ్చారు.
ఇదే విషయం సీఎంకు కూడా చెప్పానని, సినిమా ఇండస్ట్రీ పెద్దలతో కలిసి మరోసారి రెండు రోజుల్లో సీఎంను కలవనున్నట్లు కూడా వెల్లడించారు. అల్లు అర్జున్ ను కూడా తాను కలుస్తానని, ఆయన చెప్పింది విన్న తర్వాత మరోసారి మీడియాతో మాట్లాడతానని స్పష్టం చేశారు. సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య తాను వారధిగా ఉంటానని తెలిపారు.
శ్రీతేజ్ ఆరోగ్యం గురించి స్పందిస్తూ.. రెండు రోజుల కిందట వెంటిలేటర్ తొలగించారని, ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని దిల్ రాజు చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ గురించి ప్రశ్న అడగడానికి ప్రయత్నించగా.. అవన్నీ ఇప్పుడు వద్దని వారించారు. ఈ సమస్య సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమని, ఎవరూ కావాలని చేయరు కదా అని అన్నారు.
శ్రీతేజ్ కుటుంబానికి సాయం
సంధ్య థియేటర్ ఘటనలో మృతి చెందిన రేవతి, తీవ్రంగా గాయపడిన చిన్నారి శ్రీతేజ్ కుటుంబానికి తాను అన్ని రకాలుగా అండగా ఉంటానని దిల్ రాజు స్పష్టం చేశారు. వాళ్ల కుటుంబ బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. అమెరికాలో ముఖ్యమైన ఈవెంట్ ఉన్నందు వల్ల తాను రాలేకపోయినట్లు తెలిపారు. ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కు అల్లు అర్జున్ రూ.25 లక్షలు ఇవ్వగా.. పుష్ప 2 మూవీ నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ కూడా రూ.50 లక్షలు ఇచ్చిన విషయం తెలిసిందే.