Pushpa 2 Box Office Collection: పుష్ప 2 హిందీ@ రూ.700 కోట్లు.. బాలీవుడ్ చరిత్రలో తొలి సినిమాగా రికార్డు
Pushpa 2 Box Office Collection: పుష్ప 2 మూవీ హిందీలో సరికొత్త చరిత్ర సృష్టించింది. బాక్సాఫీస్ దగ్గర రూ.700 కోట్ల మార్క్ దాటిన తొలి హిందీ మూవీగా రికార్డు క్రియేట్ చేయడం విశేషం. అది కూడా కేవలం 19 రోజుల్లోనే ఈ ఘనత అందుకుంది.
Pushpa 2 Box Office Collection: అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన పుష్ప 2 మూవీ హిందీ మార్కెట్ లో అసలు అడ్డూ అదుపు లేకుండా దూసుకెళ్తోంది. తాజాగా 19వ రోజు ఈ మూవీ రూ.700 కోట్ల నెట్ కలెక్షన్ల మార్క్ అందుకుంది. గతంలో ఏ హిందీ సినిమా అందుకోని రికార్డు ఇది. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ ఏడాదే స్త్రీ2 మూవీ రూ.600 కోట్లు అందుకున్న తొలి హిందీ మూవీగా నిలవగా.. ఇప్పుడు పుష్ప 2 ఆ రికార్డును బ్రేక్ చేసింది.
పుష్ప 2 తిరుగులేని రికార్డు
మూడేళ్ల కిందట వచ్చిన పుష్ప తొలి పార్ట్ లాగే రెండో భాగం కూడా హిందీలో ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కంటే కూడా నార్త్ మార్కెట్ లో పుష్ప 2 బాక్సాఫీస్ కలెక్షన్లు రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. డిసెంబర్ 5న ఈ మూవీ రిలీజ్ కాగా.. 19 రోజుల్లో ఈ సినిమా హిందీ వెర్షన్ రూ.704.25 కోట్లు వసూలు చేసింది.
"700 నాటౌట్.. పుష్ప 2 చరిత్ర సృష్టించింది. రూ.700 కోట్ల మార్క్ అందుకొని కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇదొక అసాధారణ విషయం. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా వస్తుండటంతో పుష్ప 2 తన రికార్డు బ్రేకింగ్ రన్ కొనసాగించే అవకాశం ఉంది" అని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్ష్ ట్వీట్ చేశాడు.
హిందీలో రూ.100 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు..
హిందీలో తొలిసారి రూ.100 కోట్ల మార్క్ అందుకున్న మూవీ నుంచి రూ.700 కోట్లు అందుకున్న సినిమాలేవో ఒకసారి చూద్దాం. 2008లో వచ్చిన ఆమిర్ ఖాన్ గజినీ మూవీ హిందీ సినిమా చరిత్రలో రూ.100 కోట్ల కలెక్షన్ల మార్కు అందుకున్న తొలి మూవీగా నిలిచింది. అంతకుముందు ఏడాదే షారుక్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం మూవీ రూ.90 కోట్ల వరకు వచ్చి ఆగిపోయింది. ఇక తొలిసారి రూ.200 కోట్ల మార్క్ అందుకున్న మూవీ కూడా ఆమిర్ ఖాన్ దే కావడం విశేషం.
2010లో వచ్చిన 3 ఇడియట్స్ మూవీ రూ.200 కోట్ల మార్క్ తొలిసారి దాటిన హిందీ సినిమా. ఇక 2014లో వచ్చిన ఆమిర్ ఖాన్ కే చెందిన పీకే మూవీ రూ.300 కోట్ల మార్క్ అందుకున్న తొలి హిందీ మూవీ. తర్వాత రూ.400 కోట్లు, రూ.500 కోట్ల మార్క్ అందుకున్న సినిమాగా బాహుబలి 2 నిలిచింది. ఇక ఈ ఏడాదే వచ్చిన హారర్ కామెడీ మూవీ స్త్రీ 2 అయితే రూ.600 కోట్ల మార్క్ దాటిన తొలి హిందీ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు పుష్ప 2 మూవీ ఆ రికార్డును కూడా తిరగరాసి రూ.700 కోట్ల క్లబ్ లో చేరింది.