Sankranti Special Buses : సంక్రాంతికి స్పెషల్ బస్సులు.. కడప జిల్లా నుంచి ప్రధాన నగరాలకు 294 సర్వీసులు
Sankranti Special Buses : రాష్ట్రంలోని ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండగకు ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు.. 294 స్పెషల్ సర్వీసులను ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. కడప జిల్లా నుంచి వివిధ నగరాలకు ఈ బస్సులు నడవనున్నాయి.
కడప జిల్లా నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతోపాటు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 294 స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ స్పెషల్ సర్వీసులు జనవరి 9 నుంచి 13 వరకు నడపనున్నాయి. కడప జిల్లా పరిధిలోని వివిధ డిపో నుంచి హైదరాబాద్ 111, బెంగళూరుకు 81, చెన్నైకు 12, విజయవాడకు 30, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, అనంతపురానికి 60 బస్సులను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. సాధారణ ఛార్జీలతోనే ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
సప్త శ్రీనివాస దర్శనం..
సప్త శ్రీనివాస దర్శన భాగ్యం, పంచ వైష్ణవ క్షేత్ర దర్శనం, త్రిముఖ వైష్ణ దర్శన భాగ్యం పేరుతో పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మచిలీపట్నం నుంచి రాష్ట్రంలోని ఏడు శ్రీనివాస ఆలయాల దర్శనం, ఐదు వైష్ణవ ఆలయాల దర్శనం, మూడు వైష్ణవ ఆలయాల దర్శనానికి ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్‌లు వేసింది. ఈ సర్వీస్‌లను యాత్రికులు వినియోగించుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ కోరుతోంది.
ఈ రోజుల్లో..
మార్గశిర మాసంలో సప్త శ్రీనివాస దర్శనం, పంచ వైష్ణవ క్షేత్ర దర్శనం, త్రిముఖ వైష్ణవ దర్శనం పేరుతో ప్రతి శుక్ర, శనివారం ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి శుక్ర, శనివారాల్లో రాత్రి బస్సు మచీలిపట్నం ఆర్టీసీ డీపో నుంచి బయలుదేరుతోంది. సప్త శ్రీనివాస దర్శనంలో భాగంగా అప్పనపల్లి, యానం, మండపేట, వాడపల్లి, అన్నవరప్పాడు, కొడమంచిలి, అబ్బిరాజు పాలెం దర్శనం అనంతరం తిరిగి మచిలీపట్నం చేరుకుంటాయి.
పంచ వైష్ణవ క్షేత్ర దర్శనంలో భాగంగా అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి, అప్పనపల్లి శ్రీబాల బాలజీ స్వామివారి ఆలయం, గొల్లలమామిడాడ కోదండరామ స్వామివారి ఆలయం, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం, ద్వారకా తిరుమలలో వెంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం తిరిగి మచిలీపట్నం చేరుకుంటాయి. త్రిముఖ వైష్ణవ దర్శనంలో భాగంగా ద్వారకా తిరుమలలో వెంకటేశ్వరస్వామి దర్శనం, వాడపల్లి వెంకటేశ్వరస్వామి దర్శనం, అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం అనంతరం తిరిగి మచిలీపట్నం చేరుకుంటాయి.
ప్యాకేజీలు..
సప్త శ్రీనివాస దర్శన ప్యాకేజీ సూపర్ లగ్జరీ సర్వీసుకు ఒక్కొక్కరికి టికెట్ ధర రూ.900 లుగా నిర్ణయించారు. పంచ వైష్ణవ ఆలయాల దర్శన ప్యాకేజీ సూపర్ లగ్జరీ సర్వీసుకు ఒక్కొక్కరికి టికెట్ ధర రూ.1,300లుగా నిర్ణయించారు. త్రిముఖ వైష్ణవ దర్శన ప్యాకేజీ సూపర్ లగ్జరీ సర్వీసుకు ఒక్కొక్కరికి టికెట్ ధర రూ.1,050లుగా నిర్ణయించారు.
టిక్కెట్లు ఇలా పొందాలి..
టిక్కెట్లను ఆన్‌లైన్‌లో https://www.apsrtconline.in/oprs-web/services/packagetours.do బుక్ చేసుకోవచ్చు. లేకపోతే మచిలీపట్నం బస్‌స్టేషన్‌లో పొందవచ్చు. ఇతర వివరాల కోసం 7382902034, 7382903240, 7382903142, 9963284363 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని మచిలీపట్నం డిపో మేనేజర్ తెలిపారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)