Machilipatnam : మచిలీపట్నం- రేపల్లె రైల్వే లైన్‌కు ఎంపీ బాలశౌరి విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి
Machilipatnam : మచిలీపట్నం- రేపల్లే రైల్వే లైన్‌పై ఎంపీ బాలశౌరి దృష్టి పెట్టారు. దీనిపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు వినతిపత్రం ఇవ్వగా.. ఆయన సానుకూలత వ్యక్తం చేశారు. దీంతో దివిసీమ ప్రజల కోరిక త్వరలో నెరవేరే అవకాశం ఉంది.
కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంత ప్రజల చిరకాల కోరిక మచిలీపట్నం- రేపల్లె రైల్వే లైన్. దీని నిర్మాణంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను శుక్రవారం ఢిల్లీ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కలిశారు. ఇప్పటికే గత నెలలో రైల్వే మంత్రితో భేటీ అయిన ఎంపి బాలశౌరి.. మరోసారి మంత్రిని కలిసి, రైల్వే లైన్ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. మచిలీపట్నం- రేపల్లె రైల్వే లైన్ నిర్మాణం ఆవశ్యకతను, ప్రాజెక్టుకు సంబంధించిన రూట్ మ్యాప్‌లను మంత్రికి వివరించారు.
మచిలీపట్నం- రేపల్లె లైనుకు సంబంధించి సర్వే పనులను త్వరతగతిన పూర్తి చేయాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. దీనిపై డీపీఆర్ తయారు చేసే విధంగా చొరవ తీసుకోవాలని.. అందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని మంత్రిని ఎంపీ కోరారు. మచిలీపట్నం నుంచి రేపల్లెకు రైల్వే లైన్ అంశం దశాబ్దాల నుంచి పెండింగ్‌లో ఉంది. ఈ లైను నిర్మిస్తే.. దివిసీమ ప్రజల చిరకాల కోరిక తీరుతుందని వివరించారు.
కొన్ని దశాబ్దాలుగా కృష్ణా జిల్లా ప్రజలు, దివిసీమ వాసులు ఈ రైల్వేలైన్ ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నారని ఎంపీ బాలశౌరి అన్నారు. వారి కలసాకారం అయ్యేలా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అధికారులకు అన్ని విధాలుగా సహకారం అందజేసి.. రైల్వే లైన్ ఏర్పాటు కోసం చర్యలు చేపడతానని తెలిపారు. మచిలీపట్నం నుంచి గుడివాడ, విజయవాడ, తెనాలి చేరుకోవాలంటే సుమారు 120 కిలో మీటర్లు ప్రయాణించాల్సి వస్తుందన్నారు.
అదే మచిలీపట్నం- రేపల్లె రైల్వే లైను ఏర్పాటు చేస్తే.. తెనాలి చేరుకోవాడానికి చాలా వరకు దూరం, సమయం తగ్గుతాయని ఎంపీ వివరించారు. అక్కడి నుంచి చెన్నై, తిరుపతి, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సులువుగా ఉంటుందని అన్నారు. ప్రధానంగా విజయవాడ జంక్షన్ మీద ట్రాఫిక్ భారం పడకుండా ఉంటుందని.. బాలశౌరి వివరించారు. ప్రయాణికులే కుకుండా మత్య్స సంపద చేపలు, రొయ్యలు రవాణా చేసేందుకు సులువుగా ఉంటుందన్నారు. త్వరలో పోర్టు నిర్మాణం కూడా పూర్తి కావస్తున్నందునా.. ఈ రైల్వే లైన్ సరకు రవాణాకు ఎంతగానో ఉపయోగడుతుందని వ్యాఖ్యానించారు.
తన విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని ఎంపీ బాలశౌరి తెలిపారు. మచిలీపట్నం- రేపల్లె రైల్వే లైన్ నిర్మాణం సాధ్యాసాధ్యాలను తెలుసుకుని.. కావల్సిన వనరులు, ఇతర వివరాలు సేకరిస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ గతంలోని ఎంపీ బాలశౌరికి లేఖ రూపంలో తెలిపారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చి.. రైల్వే లైన్ ఏర్పాటు అంశంపై స్టడీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో రైల్వేలైన్ నిర్మాణంపై అధ్యయనం చేసే పనులు ప్రారంభం అవుతాయని ఎంపీ బాలశౌరి ఆశాభావం వ్యక్తం చేశారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)