Nandyal Crime : హిజ్రాలతో కలిసి ఉంటానని ఇంట్లోంచి వెళ్లిపోయిన కొడుకు, ఆత్మహత్యాయత్నం చేసిన తల్లిదండ్రులు
Nandyal Crime : నంద్యాల జిల్లాలో హిజ్రాల వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. డబ్బు కోసం హిజ్రాల వేధింపులు, హిజ్రాలతో కలిసి ఉంటానని కొడుకు ఇంట్లోంచి వెళ్లిపోవడంతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
Nandyal Crime : నంద్యాల జిల్లాలో హిజ్రాలు డబ్బుల కోసం వేధించారు. డబ్బులు లేవనందుకు అసభ్యపదజాలంతో దూషించారు. మరోవైపు హిజ్రాతో కలిసి జీవించేందుకు కొడుకు సిద్ధపడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఈ ఘటన నంద్యాల పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీలో సరస్వతి, సుబ్బారాయుడు దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో ఒకరు ఏడేళ్ల క్రితమే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మరో కుమారుడు సునీల్ ఆటో నడుపుతూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఈ క్రమంలో సునీల్‌కు మున్నీ అనే హిజ్రాతో పరిచయం ఏర్పడింది. దీంతో రోజూ హిజ్రాలతో తిరుగుతూ అర్ధరాత్రిళ్లు ఇంటికి వచ్చేవాడు. దీన్ని గమనించిన తల్లిదండ్రులు సునీల్‌ను మందలించారు.
హిజ్రాలతో సునీల్‌ను కలవకుండా చూసుకున్నారు. దాదాపు రెండు నెలల నుంచి హిజ్రాలకు సునీల్‌ను దూరంగా ఉంచారు. దీన్ని సహించలేక హిజ్రా మున్నీ, మిగతా హిజ్రాలతో కలిసి వేధింపులకు దిగింది. తరచూ సునీల్ తల్లిదండ్రులు నిర్వహించే షాప్ వద్దకు హిజ్రాలతో వెళ్లి అసభ్యంగా ప్రవర్తించేది. సహచర హిజ్రాలు కూడా మున్నీతో కలిసి అసభ్యకరంగా వ్యవహరించేవారు. ఆదివారం సాయంత్రం షాప్‌లో ఉన్న సుబ్బారాయుడుతో మున్నీ గొడవపడింది. సునీల్ తమ దగ్గర రూ.1.50 లక్షలు తీసుకున్నాడని, ఆ మొత్తాన్ని ఇవ్వాలని డిమాండ్ చేసింది.
తమ వద్ద ఇప్పుడు అంత డబ్బు లేదని చెప్పాడు. దీనికి ఆగ్రహించిన హిజ్రాలు సభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు దూషించారు. దీనిపై సుబ్బారాయుడు నంద్యాల టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో గత్యంతరం లేక జనవరి 10న రూ.1.10 లక్షలు చెల్లిస్తామని హిజ్రాలతో సుబ్బారాయుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. మరోవైపు కుమారుడు సునీల్ హిజ్రా మున్నీ ఇంటికి వెళ్లి, అక్కడే ఉంటానని తల్లిదండ్రులకు స్పష్టం చేశాడు. దీంతో మళ్లీ సునీల్ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
వెంటనే సునీల్‌ను పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. అక్కడ పోలీసులు తల్లిదండ్రులు, సునీల్‌తో కలిసి మాట్లాడారు. తనకు తల్లిదండ్రులు అక్కర్లేదని, తనకు హిజ్రానే కావాలని, తాను హిజ్రాతోనే ఉంటానని పేర్కొన్నాడు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపం చెందారు. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. వారిని స్థానికులు గమనించి, నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే సుబ్బారాయుడు పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం