300 అడుగుల లోతులో పడిపోయిన వాహనం.. ఐదుగురు జవాన్లు మృతి!
Jammu Kashmir జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం బల్‌నోయ్ ప్రాంతంలో 300 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు మరణించారు.
జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ ట్రక్కు 300 అడుగుల లోతైన లోయలో పడిపోవడంతో ఐదుగురు సైనికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, గాయపడిన సైనికులకు చికిత్స అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పూంఛ్ సెక్టార్‌లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు వీర జవాన్లు దుర్మరణం చెందడంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
పూంఛ్ జిల్లాలో మంగళవారం సాయంత్రం సైనికులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. జిల్లాలోని బనోయ్‌కు ఆర్మీ ట్రక్కు వెళ్తుండగా ఘరోవా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సుమారు 300-350 అడుగుల లోతులో ఉన్న లోయలో వాహనం పడింది. ఆర్మీ, పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మరణించిన సైనికుల సంఖ్య ఐదుగురిగా ఉందని, మరికొందరు వారు చికిత్స పొందుతున్నారని అధికారులు చెబుతున్నారు. మరణించిన జవాన్ల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఐదుగురు జవాన్ల మృతి పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సంతాపం తెలిపారు. 'జమ్ముకశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలో జరిగిన వాహన ప్రమాదంలో ఐదుగురు వీర జవాన్లు వీరమరణం పొందిన భయంకరమైన వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. వీర జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. వారి త్యాగానికి, నిస్వార్థ సేవకు సెల్యూట్ చేస్తున్నాం. క్షతగాత్రులు త్వరగా, సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం.' అని తెలిపారు.
కొద్ది రోజుల క్రితం జమ్ముకశ్మీర్ లోని బందిపోరా జిల్లాలో మంచుతో కప్పబడిన గురేజ్ రోడ్డుపై వాహనం అదుపుతప్పి గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులకు గాయాలయ్యాయి. మంచుతో నిండిన జడికుషి-గురేజ్ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. జవాన్లను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.