Terrorist Attack : జమ్ముకశ్మీర్‌లో మరో ఉగ్రదాడి.. సండే మార్కెట్‌లో గ్రెనేడ్ విసిరిన ఉగ్రవాదులు
Terrorist Attack : జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఆదివారం ఉగ్రదాడి జరిగింది. సండే మార్కెట్‌లో గ్రెనేడ్ విసిరిన ఘటనలో 9 మంది గాయపడ్డారు. ఉగ్రదాడిని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు.
జమ్ముకశ్మీర్‌లో ఆదివారం ఉగ్రదాడి జరిగింది. శ్రీనగర్‌లోని సండే మార్కెట్‌లో ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. ఈ దాడిలో 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను శ్రీ మహారాజా హరిసింగ్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం ప్రకారం దాడి జరిగిన సమయంలో సండే మార్కెట్ లో జనసమూహం ఎక్కువగానే ఉంది. జనం షాపింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గ్రెనేడ్ విసిరిన వెంటనే అక్కడున్న ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అటూ ఇటూ పరిగెత్తారు. టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ సమీపంలోని సండే మార్కెట్‌లో ఈ దాడి జరిగింది.
క్షతగాత్రుల్లో ఎనిమిది మంది పురుషులు, ఒక మహిళ ఉన్నారని ఆసుపత్రిలోని డాక్టర్ తన్సీన్ షౌకత్ తెలిపారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉంది. ఉగ్రదాడి జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి.. క్లోజ్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'కొన్ని రోజులుగా కశ్మీర్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో దాడులు, ఎన్ కౌంటర్ల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. శ్రీనగర్ సండే మార్కెట్ లో అమాయక దుకాణదారులపై గ్రెనేడ్ దాడి వార్త చాలా కలవరపెడుతోంది. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని సమర్థించలేం. ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమ జీవితాలను గడిపేందుకు వీలుగా ఈ దాడులను వీలైనంత త్వరగా ఆపేందుకు భద్రతా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాలి.' అని ఒమర్ అబ్దుల్లా అన్నారు.
జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్, అనంతనాగ్ జిల్లాల్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన టాప్ పాక్ కమాండర్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. లష్కరే తోయిబా కమాండర్ ఉస్మాన్ కొన్నేళ్లుగా లోయలో క్రియాశీలకంగా ఉన్నాడని, ఇన్స్‌పెక్టర్ మస్రూర్ వనీ హత్యలో కూడా పాల్గొన్నాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 2023 అక్టోబర్‌లో ఈద్గా మైదానంలో క్రికెట్ ఆడుతుండగా వనీని అత్యంత సమీపం నుంచి కాల్చి చంపారు. శ్రీనగర్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.