AP Students Death: జమ్మూకశ్మీర్‌లో అదుపు తప్పి లోయలో పడ్డ కారు - ఇద్దరు ఏపీ విద్యార్థులు మృతి
AP Students Death: జమ్మూ కశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లోయలో దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లాకు చెందిన ఆనందరెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన కావ్యారెడ్డిని మృతులుగా గుర్తించారు. మృతదేహాలు స్వస్థలాలకు చేరుకున్నాయి.
జమ్మూ కశ్మీర్‌లో అదుపు తప్పి లోయలోకి కారు దూసుకెళ్లింది. ఈ రోడ్డు ప్రమాదంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం శనివారం ఉదయం ఇద్దరు మృతి దేహాలు స్వగ్రామాలకు చేరుకున్నాయి. విహార యాత్రకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కర్నూలు జిల్లా పత్తికొండలో స్థిర నివాసముంటున్న తుగ్గలి మండలం పెండేకల్లుకు చెందిన పాటిల్ ప్రతాప్ రెడ్డి, అనిత దంపతుల పెద్ద కుమారుడు వెంకట ఆనంద రెడ్డి (21), ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీరాంనగర్‌కు చెందిన ఆర్మీ జవాన్ రమణారెడ్డి కుమార్తె కావ్యారెడ్డి (19) ప్రమాదంలో దుర్మరణం పొందారు. వీరు పంజాబ్‌లోని లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీలో బీటెక్ చదువుతున్నారు. అయితే కావ్యారెడ్డి చెల్లెలు మనీషా (19) కూడా అదే కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది.
దీపావళికి వరుస సెలవులు రావడంతో అక్టోబర్ 28వ తేదీన జమ్మూకాశ్మీర్‌కు 30 మంది స్నేహితులతో కలిసి ఆరు కార్లలో విహార యాత్రకు వెళ్లారు. పర్యటక ప్రదేశాలు సందర్శించి, గురువారం తిరిగి ప్రయాణం అయ్యారు. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిలో రామబన్ జిల్లా మగర్‌కూట్ వద్ద పర్వతాల మధ్య కారు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆనందరెడ్డి, కావ్యారెడ్డి, మరో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.
అయితే అదే కారులో కావ్యా రెడ్డి చెల్లెలు మనీషా కూడా ఉంది. కారు లోయలో పడటాన్ని గమనించి మనీషా వెంటనే కారు డోరు తీసుకుని రోడ్డుపైకి దూకేసింది. దీంతో మనీషా చెయ్యి విరిగి తల పగలింది. పరిస్థితి కొంత విషమంగా ఉంది. దీంతో స్థానికులు, స్నేహితులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో… నలుగురు మృతదేహాల గురించి గాలింపు చర్యలు చేపట్టారు. వాటిని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు రోడ్డు ప్రమాదం సమాచారం అందుకున్న మృతుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శనివారం ఉదయం మృతదేహాలను స్వస్థలాలకు చేరుకున్నాయి.
కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురు మృతి
కర్నూలు జిల్లాలోని నందవరం మండలం ధర్మపురం గ్రామం వద్ద జాతీయ రహదారి-167పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం అతివేగంతో వెళ్తున్న కారు, ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వీర నాగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలతో ఉన్న మరో ఇద్దరు కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచారు. ప్రమాదంలో ఇద్దరికి గాయాలవ్వగా, గాయపడిన వారిలో చాన్నిరి రిజియా పరిస్థితి విషమంగా ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించి, ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతులు కుటుంబాలు రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించడంతో మృతుల కుటుంబ సభ్యలు, బంధువులు అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరు అయ్యారు.