Visakhapatnam : ఆంధ్రా ఆసుపత్రిలో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు
Visakhapatnam : గుండె సంబంధిత సమస్యలతో బాధపడే చిన్నారులకు విశాఖ ఆంధ్రా హాస్పిటల్ అండగా నిలుస్తోంది. ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తోంది. యూకే నుంచి వచ్చిన వైద్య బృందం ఆపరేషన్లు చేస్తోంది. ఈనెల 26వ తేదీతో ఈ శిబిరం ముగుస్తుందని.. ఆంధ్రా ఆసుపత్రి వైద్యులు చెప్పారు.
యూకేకు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్, మహేశ్ బాబు ఫౌండేషన్ సౌజన్యంతో 32వ ఉచిత పిల్లల గుండె శస్త్ర చికిత్సల శిబిరం నిర్వహిస్తున్నట్టు.. ఆంధ్రా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ పీవీ రామారావు వివరించారు. 'ఈ నెల 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 15 సంక్లిష్ట గుండె శస్త్ర చికిత్సలు ఉచితంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటివరకు 9 మందికి హార్ట్ ఆపరేషన్ పూర్తయ్యింది' అని పీవీ రామారావు వివరించారు.
'విశాఖలో రెండోసారి ఈ శిబిరం నిర్వహిస్తున్నాం. తొమ్మిదేళ్లలో విజయవాడ, విశాఖపట్నం ఆంధ్రా ఆసుపత్రుల్లో 4 వేల మందికి ఆపరేషన్లు చేశాం. వాటిలో అధిక శాతం ఎన్టీఆర్ వైద్య సేవ, మహేశ్ బాబు ఫౌండేషన్, ఇతర సంస్థల సహకారంతో ఉచితంగా చేశాం. ఆంధ్ర హాస్పిటల్ గుండె జబ్బుల వైద్య నిపుణులు డాక్టర్ విక్రమ్ ఆధ్వర్యంలో పీడియాట్రిక్, కార్డియాలజీ, నవజాత శిశువులు, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ బృందాలు కలిసిగట్టుగా పనిచేయడంతో ఇది సాధ్యమైంది. రాబోయే రోజుల్లో ప్రతీ రెండు, మూడు నెలలకు ఒకసారి ఈ శిబిరం నిర్వహిస్తాం' అని డాక్టర్ పీ వీ రామారావు వివరించారు.
పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు ఉన్న పిల్లల తల్లిదండ్రులు మరింత సమాచారం కోసం 8886679733 లేదా 0891-2724777 నంబర్‌లను సంప్రదించవచ్చు. ఈ శిబిరం రేపటి (శనివారం)తో ముగుస్తుంది. మళ్లీ త్వరలోనే మరో శిబిరం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ శిబిరాల ద్వారా ఎంతోమంది పేద పిల్లలకు నయం అయ్యిందని చెప్పారు.
కీలకంగా మహేశ్ బాబు ఫౌండేషన్..
హీరో మహేశ్ బాబు స్థాపించిన ఫౌండేషన్ పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే వందలాది మందికి ఈ ఫౌండేషన్ ద్వారా చికిత్స చేయించారు. కేవలం వైద్యం విషయంలోనే కాదు.. పేదల విద్య విషయంలోనూ మహేశ్ బాబు ఫౌండేషన్ చురుగ్గా ఉంటోంది. ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. ఆర్థిక సాయం చేస్తూ.. అండగా నిలుస్తోంది.