Ind W vs WI W: రెండో వన్డేలోనూ వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించిన ఇండియా వుమెన్ టీమ్.. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ సొంతం
Ind W vs WI W: వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలోనూ ఇండియా వుమెన్ టీమ్ ఘన విజయం సాధించింది. ఏకంగా 115 పరుగులతో గెలిచి మూడు వన్డేల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. హర్లీన్ డియోల్ సెంచరీతో చెలరేగింది.
Ind W vs WI W: ఇండియా వుమెన్స్ క్రికెట్ టీమ్ స్వదేశంలో మరో వన్డే సిరీస్ సొంతం చేసుకుంది. వెస్టిండీస్ తో మంగళవారం (డిసెంబర్ 24) జరిగిన రెండో వన్డేలోనూ గెలిచింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియన్ టీమ్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 358 రన్స్ చేయగా.. తర్వాత వెస్టిండీస్ 46.2 ఓవర్లలో 243 పరుగులకే ఆలౌటైంది. 115 పరుగుల తేడాతో విజయం సాధించిన ఇండియన్ టీమ్.. మూడు వన్డేల సిరీస్ లో 2-0 ఆధిక్యం సంపాదించింది.
సమష్టిగా రాణించిన బౌలర్లు
వెస్టిండీస్ వుమెన్ టీమ్ తో జరిగిన రెండో వన్డేలో ఇండియన్ బౌలర్లు సమష్టిగా రాణించారు. ఆ టీమ్ ముందు ఏకంగా 359 పరుగుల లక్ష్యాన్ని ఉంచగా.. అసలు ఏ దశలోనూ విండీస్ ఆ దిశగా వెళ్లలేదు. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 3 వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, టైటస్ సాధు, ప్రతీకా రావల్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. దీంతో వెస్టిండీస్ 46.2 ఓవర్లలో 243 పరుగులకే చేతులెత్తేసింది.
ఆ జట్టులో ఓపెనర్ హేలీ మాథ్యూస్ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. ఆమె 109 బంతుల్లోనే 13 ఫోర్లతో 106 పరుగులు చేసింది. మిడిలార్డర్ లో షిమైన్ క్యాంప్‌బెల్ 38 రన్స్ చేయగా.. మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఒక దశలో 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా.. ఈ ఇద్దరూ రాణించడంతో విండీస్ ఆ మాత్రం స్కోరైనా సాధించింది.
హర్లీన్ సెంచరీ.. జెమీమా మెరుపులు
వెస్టిండీస్ తో రెండో వన్డేలో ఇండియన్ టీమ్ టాస్ గెలిచిన మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు స్మృతి మంధానా, ప్రతీకా రావల్ హాఫ్ సెంచరీలు చేశారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు ఏకంగా 110 పరుగులు జోడించారు. స్మృతి 47 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్స్ లతో 53 పరుగులు చేసి ఔటైన తర్వాత హర్లీన్ డియోల్ క్రీజులోకి వచ్చింది. ఆమె మరింతగా చెలరేగింది. కేవలం 103 బంతుల్లోనే 16 ఫోర్లతో 115 రన్స్ చేసింది. అటు ప్రతీకా 86 బంతుల్లో 76 రన్స్ చేసి ఔటైంది.
అయితే చివర్లో జెమీమా రోడ్రిగ్స్ రెచ్చిపోయింది. మెరుపు హాఫ్ సెంచరీ చేయడంతో ఇండియన్ టీమ్ భారీ స్కోరు చేసింది. జెమీమా 36 బంతుల్లోనే 6 ఫోర్లు, ఒక సిక్స్ తో 52 రన్స్ చేసింది. విండీస్ బౌలర్లు ఏకంగా 23 అదనపు పరుగులు ఇవ్వడంతో ఇండియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 358 రన్స్ చేసింది.