Ind vs Aus 4th Test: అశ్విన్ స్థానంలో తనూష్ కోటియన్ ఎందుకు.. కుల్దీప్‌కు వీసా దొరకలేదంటూ.. రోహిత్ కామెంట్స్ వైరల్
Ind vs Aus 4th Test: అశ్విన్ స్థానంలో తనూష్ కోటియన్ అనే 26 ఏళ్ల యువ స్పిన్నర్ జట్టులోకి ఎందుకు వచ్చాడు? ఇదే ప్రశ్న కెప్టెన్ రోహిత్ శర్మను అడిగితే కుల్దీప్ యాదవ్ కు వీసా దొరకలేదంటూ జోక్ చేశాడు. అతని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Ind vs Aus 4th Test: ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ లో జరగబోయే బాక్సింగ్ డే టెస్టు కోసం టీమిండియా సిద్ధమవుతోంది. అయితే సిరీస్ మధ్యలోనే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైరవడంతో అతని స్థానంలో 26 ఏళ్ల ముంబై స్పిన్నర్ తనూష్ కోటియన్ ను ఎంపిక చేశారు. అతడు మంగళవారం (డిసెంబర్ 24) హుటాహుటిన ఆస్ట్రేలియా వెళ్లాడు. మరి కుల్దీప్, అక్షర్ లాంటి సీనియర్లు ఉండగా.. ఇతన్ని ఎందుకు ఎంపిక చేశారన్నది పెద్ద ప్రశ్న. దీనికి కెప్టెన్ రోహిత్ ఏం సమాధానం చెప్పాడో చూడండి.
కుల్దీప్‌కు వీసా దొరకలేదా?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తన సెన్సాఫ్ హ్యూమర్ తో నవ్విస్తుంటాడు. ఇప్పుడు కూడా అదే చేశాడు. బాక్సింగ్ డే టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. కుల్దీప్ కు వీసా దొరకలేదని, అందుకే తనూష్ కోటియన్ ను ఎంపిక చేశామంటూ చెప్పి ఆశ్చర్యపరిచాడు. "తనూష్ నెల కిందట ఇక్కడ ఉన్నాడు.
కుల్దీప్ కు వీసా లేదు. ఎవరో ఒకరు చాలా త్వరగా ఇక్కడికి రావాలని భావించాం. తనూష్ రెడీగా ఉన్నాడు. ఇక్కడ బాగా ఆడాడు. జోక్స్ పక్కన పెడితే.. అతడు రెండేళ్లుగా బాగా ఆడుతున్నాడు. ఒకవేళ మేము సిడ్నీ లేదా మెల్‌బోర్న్ లలో ఇద్దరు స్పిన్నర్లను ఆడిస్తే ఓ బ్యాకప్ కావాలని అతన్ని రప్పించాం" అని రోహిత్ అన్నాడు.
కుల్దీప్, అక్షర్ ఎక్కడ?
సీనియర్ స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్ పటేల్ ఉండగా.. తనూష్ ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి కూడా రోహిత్ సమాధానమిచ్చాడు. "కుల్దీప్ కు హెర్నియా సర్జరీ జరిగింది. అతడు ఇంకా 100 శాతం ఫిట్ గా లేడు.
అక్షర్ ఈ మధ్యే తండ్రయ్యాడు. దీంతో అతడు అందుబాటులో లేడు. అందుకే తనూష్ మాకు బెస్ట్ ఆప్షన్ గా అనిపించాడు. గత సీజన్లో రంజీ ట్రోఫీ ముంబై గెలవడానికి అతడు కూడా ఒక కారణం" అని రోహిత్ అన్నాడు.
ఎవరీ తనూష్ కోటియన్?
తనూష్ కూడా మంచి ఆల్ రౌండరే. ఆస్ట్రేలియా ఎతో ఈ మధ్యే జరిగిన రెండు అనధికారిక టెస్టుల కోసం ఇండియా ఎలోనూ అతడు ఉన్నాడు. రెండో టెస్టులో ఆడి ఒక వికెట్ తీయడంతోపాటు 44 రన్స్ చేశాడు. అతడు ఇప్పటి వరకూ 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 1525 రన్స్ చేశాడు. సగటు 41.21 కావడం విశేషం. ఇక 25.7 సగటుతో 101 వికెట్లు కూడా తీశాడు.
రెండు సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కొన్నేళ్లుగా ముంబై తుది జట్టులో క్రమం తప్పకుండా ఉంటున్నాడు. 2023-24లో రంజీ ట్రోఫీని ముంబై గెలవగా.. తనూష్ మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు. ఆ సీజన్ లో అతడు 502 రన్స్ చేయడంతోపాటు 29 వికెట్లు కూడా తీశాడు. ఇక ఇరానీ కప్ లోనూ రెస్టాఫ్ ఇండియాపై సెంచరీ చేశాడు. దీంతో ముంబై టీమ్ 27 ఏళ్ల తర్వాత ఈ కప్ గెలిచింది. ఇండియా ఎ తరఫున దులీప్ ట్రోఫీలో ఆడి 10 వికెట్లు తీసుకున్నాడు.