Kolkata Yellow Taxis : కోల్‌కతా ఐకానిక్ ఎల్లో ట్యాక్సీల్లో సగానికి పైగా 2025లో ఇక రోడ్లపై కనిపించవు!
Kolkata Iconic Yellow Taxis : పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా పేరు చెప్పగానే మెుదటగా గుర్తొచ్చే విషయాల్లో అక్కడి ఎల్లో ట్యాక్సీలు ఒకటి. ఇక్కడ పసుపు ట్యాక్సీలు ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. అయితే ఇందులో కొన్ని ఇకపై కనిపించవు.
కోల్‌కతాలో ఎల్లో ట్యాక్సీలు చాలా ఫేమస్. చాలా తెలుగు సినిమాల్లోనూ కోల్‌కతాకు సంబంధించిన సీన్లలో ఈ పసుపు రంగు ట్యాక్సీలు కనిపిస్తాయి. నిజానికి కోల్‌కతాకు ఈ ట్యాక్సీలు ఐకానిక్. అయితే వీటికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. అది ఏంటంటే.. 2025లో ఈ ఐకానిక్ ఎల్లో ట్యాక్సీలు రోడ్ల మీద కనపడవు. దీనికి ఓ కారణం ఉంది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రవాణా శాఖ విధించిన 15 సంవత్సరాల సర్వీస్ లిమిట్ కారణంగా కోల్‌కతాలోని 64 శాతానికి పైగా ఐకానిక్ పసుపు ట్యాక్సీలు మార్చి 2025 నాటికి రోడ్లపైకి రావు. రాష్ట్ర రవాణా శాఖ రికార్డుల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 7,000 పసుపు ట్యాక్సీలు నమోదయ్యాయి. 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ టైమ్ పీరియడ్ ఉన్న వాహనాలను రోడ్లపై రాకుండా అడ్డుకునే కాలుష్య నిబంధనల ప్రకారం వాటిలో దాదాపు 4,500 కనపడవు.
ఈ పసుపు ట్యాక్సీలు అన్ని అంబాసిడర్లు. గతంలో పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఉన్న కంపెనీ తయారీ యూనిట్ హిందుస్థాన్ మోటార్స్ లిమిటెడ్(HML) ద్వారా ఉత్పత్తి అయ్యాయి. అయితే కంపెనీ ఈ ప్రత్యేకమైన బ్రాండ్‌ను తయారు చేయడాన్ని నిలిపివేసినందున అవి మళ్లీ రోడ్ల మీద కనిపించే అవకాశం లేదు.
కోల్‌కతా రోడ్లపై మొదటిసారి పసుపు ట్యాక్సీలను ప్రవేశపెట్టిన కచ్చితమైన సంవత్సరం గురించి గందరగోళం ఉంది. రాష్ట్ర రవాణాకు సంబంధించిన కొన్ని రికార్డులు బహుశా 1908లో కోల్‌కతా వీధుల్లో మొట్టమొదటి పసుపు ట్యాక్సీని ప్రారంభించినట్టుగా అంటున్నారు. అప్పుడు ఒక మైలు ధరను 50 పైసలుగా నిర్ణయించారు.
అయితే కలకత్తా టాక్స్ అసోసియేషన్ 1962లో అంబాసిడర్‌ని స్టాండర్డ్ ట్యాక్స్ మోడల్‌గా స్వీకరించింది. సూర్యాస్తమయం తర్వాత కూడా ఎల్లో రంగు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారణంగా పసుపు రంగును ఎంచుకున్నారని తెలుస్తోంది.
మెరుగైన సౌకర్యవంతమైన రైడ్‌లను అందించే యాప్ క్యాబ్‌లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ కారణంగా పసుపు ట్యాక్సీల ప్రజాదరణ కొన్ని సంవత్సరాలుగా తగ్గిపోయిందనే చెప్పాలి. ఏదేమైనా కోల్‌కతా ప్రజలకు పసుపు ట్యాక్సీలతో మంచి అనుబంధం ఉందనే చెప్పాలి. ఒక వేళ రాష్ట్ర రవాణా శాఖ ఆ జ్ఞాపకాలను కొంతవరకు ఉంచడానికి ఏదైనా ఫార్ములా పాటిస్తుందో చూడాలి.
అంబాసిడర్ మోడల్‌లను తిరిగి వీధుల్లోకి తీసుకురావడం కష్టమేమీ కాదు. కానీ ఈ బ్రాండ్‌ను తయారు చేస్తున్న కంపెనీ ఇప్పుడు ఉత్పత్తిని నిలిపివేసింది. అయితే పాత పసుపు ట్యాక్సీల పర్మిట్‌లను కలిగి ఉన్న యజమానులు కొత్త వాణిజ్య రవాణా అనుమతులను పొందగలుగుతారు. ఆ తర్వాత ఏ యజమాని అయినా కొత్త వాహనాన్ని పసుపు రంగుకు మార్చాలని ఎంచుకోవచ్చు. దీనికోసం రాష్ట్ర రవాణా శాఖ నుండి ప్రత్యేక అనుమతి పొందాలి. దానికి తగ్గ నిబంధనలు పాటించాలి.
టాపిక్