flying taxi: 5 నిమిషాల్లోనే ఎయిర్ పోర్ట్ కు; బెంగళూరులో త్వరలో ఫ్లైయింగ్ ట్యాక్సీలు
బెంగళూరులో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లిన ప్రయాణికులకు ట్రాఫిక్ చిక్కులు చుక్కలు చూపిస్తుంటాయి. ఆ సమస్యను అధిగమించడానికి ఎయిర్ పోర్ట్ కు ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తున్నాయి. దీనివల్ల బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు ప్రయాణ సమయం గంటన్నర నుంచి 5 నిమిషాలకు తగ్గుతుంది.
బెంగళూరులో ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టడానికి సరికొత్త ప్లాన్ ను అమలు చేయనున్నారు. ముఖ్యంగా, నగర శివార్లలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళేవారికి ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించే లక్ష్యంతో ఫ్లైయింగ్ టాక్సీలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
5 నిమిషాల్లోనే ఎయిర్ పోర్ట్ కు..
ఈ మేరకు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (బిఐఎఎల్), సరళా ఏవియేషన్ మధ్య కొత్త ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందం ప్రకారం, బెంగళూరు లోని పలు ప్రాంతాల నుంచి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రాయినికి ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీలను ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల విమానాశ్రయానికి, బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీ వంటి కీలక ప్రాంతాలకు మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.
ఏడు సీట్ల ఎగిరే టాక్సీ
ఏడు సీట్ల ఈవీటీఓఎల్ (electric vertical take-off and landing - eVTOL) విమానాలను ఉపయోగించి అధునాతన ఎయిర్ మొబిలిటీ సొల్యూషన్లను అభివృద్ధి చేయడంపై ఈ భాగస్వామ్యం దృష్టి సారించింది. ఈ ఎగిరే ట్యాక్సీలు సంప్రదాయ హెలికాప్టర్ల కంటే వేగంగా, నిశ్శబ్దంగా ప్రయాణిస్తాయి. ఇవి పర్యావరణహితంగా ఉంటాయి. కర్బన ఉద్గారాలను తగ్గిస్తూ ప్రయాణ సమయాన్ని తగ్గించడం దీని లక్ష్యం. ఈ ఫ్లైయింగ్ టాక్సీ సేవలతో కెంపెగౌడ ఎయిర్ పోర్ట్ కు వెళ్లాలనుకునే బెంగళూరు (bengaluru)ప్రజల ట్రాఫిక్ చిక్కులు గణనీయంగా తగ్గుతాయి.
గంటన్నర కాదు.. ఐదే నిమిషాలు..
బెంగళూరులోని సెంట్రల్ జిల్లా ఇందిరానగర్ నుంచి విమానాశ్రయానికి 1.5 గంటల సమయం పట్టే ప్రయాణాన్ని ఈ ఎయిర్ ట్యాక్సీలతో కేవలం 5 నిమిషాలకు తగ్గించవచ్చు. సరళా ఏవియేషన్ సిఇఒ అడ్రియన్ ష్మిత్ మాట్లాడుతూ, ఈ ఫ్లైయింగ్ టాక్సీలు బెంగళూరు నగరానికి గేమ్ ఛేంజర్ లాంటి వని అభివర్ణించారు. ఉబర్ వంటి రైడ్-షేరింగ్ యాప్ (apps) ల మాదిరిగా చౌకైన విమాన ప్రయాణం దీనితో సాధ్యమవుతుందన్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ప్రోటోటైప్ ను ఇంకా రూపొందించలేదు, రెగ్యులేటరీ అనుమతులకు సంవత్సరాలు పట్టవచ్చు. ఈ సర్వీసు ప్రారంభానికి కనీసం రెండు నుంచి మూడేళ్ల సమయం పట్టొచ్చని బీఐఏఎల్ ఇన్ సైడర్లు సూచిస్తున్నారు.