Telangana Floods : ఒకే హెలికాప్టర్లో భట్టి విక్రమార్క, బండి సంజయ్.. కేంద్రమంత్రితో కలిసి ఏరియల్ సర్వే!
Telangana Floods : ఇటీవల తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. వందలాది ఇళ్లను నేలమట్టం చేశాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు వెళ్లారు బండి సంజయ్, భట్టి విక్రమార్క.
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ నేపథ్యంలో.. కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌తో కలిసి ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఈ ఇద్దరూ కలిసి ఒకే హెలికాప్టర్‌లో వెళ్లారు.
ఖమ్మం నగరంపై ప్రభావం..
ఖమ్మం నగరంపై వరదల ప్రభావం ఎక్కువగా పడింది. అన్ని రంగాలు నష్టపోయాయి. రైతులు, చిరు వ్యాపారులు, మెకానిక్‌లు, కిరాణా వర్తకులు భారీ నష్టపోయారు. మున్నేరు వరదల కారణంగా షాపుల్లోకి నీరు వచ్చి వస్తువులు పాడయ్యాయి. అటు మెకానిక్ షాపుల వద్ద రిపేర్ కోసం తెచ్చిన వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. లారీలు, కార్లు, ఆటోలు, బైక్‌లు వరదల్లో కొట్టుకుపోయాయి. మరికొన్ని వాహనాల ఇంజిన్లలోకి నీరు చేరింది. ఇటు పంట నష్టం భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏపీలోనూ..
అటు ఏపీలోనూ కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ పర్యటించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 'నేను స్వయంగా రైతు కుటుంబం నుంచి వచ్చా. రైతులు ఎలా కష్టపడతారో నాకు తెలుసు. వారం రోజులుగా పంటలు నీటిలోనే ఉన్నాయి. వరి, మొక్కజొన్న, అరటి, కంద వంటి పంటలు దెబ్బతిన్నాయి. నాలుగైదు రోజుల్లో నీళ్లు పోతే వరి పంట చేతికొచ్చేది. రోజులతరబడి నీళ్లు ఉండటంతో పంట కుళ్లిపోయింది. ఈ వరదలు కౌలు రైతులకు మరింత నష్టాన్ని కలిగిస్తాయి. పంట నష్టం వచ్చినా కౌలు రైతులు కౌలు చెల్లించాలి. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో స్వయంగా చూశా. రైతులెవరూ ఆందోళన చెందవద్దు.. అండగా ఉంటాం' అని శివరాజ్‌సింగ్ చౌహాన్ భరోసా ఇచ్చారు.
హరీశ్ నేతృత్వంలో..
ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు బృందం పర్యటించారు. వరద బాధితులకు సహాయార్థం హరీశ్ రావు నేతృత్వంలో 200 క్వింటాళ్ల సన్న బియ్యం, రెండు వేల కిట్ల కిరాణా సామగ్రి, 500 దుప్పట్లు, రెండు వేల బ్రెడ్ ప్యాకెట్లు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు పంపించారు. వాటిని మూడు వ్యాన్లలో గురువారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఖమ్మం తరలించారు.