Pod Taxi : త్వరలో పాడ్ ట్యాక్సీలు.. హైదరాబాద్‌కు చెందిన కంపెనీకి టెండర్
Pod Taxi : పాడ్ ట్యాక్సీల గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. నోయిడాలాంటి నగరంలో ప్రతిపాదనలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ముంబయిలోనూ పాడ్ ట్కాక్సీలు ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. దీని కోసం హైదరాబాద్‌కు చెందిన సంస్థకు టెండర్ వచ్చింది.
లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం తరహాలో ముంబైలో పాడ్ టాక్సీ వ్యవస్థను ప్లాన్ చేశారు. పాడ్ టాక్సీలు ముంబైలో ప్రారంభమైతే.. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో నివసిస్తున్న లేదా పని చేసే ప్రయాణికులకు చాలా ఉపశమనాన్ని అందిస్తుంది.
ఈ ప్రాజెక్టు కోసం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA).. ఆటోమేటెడ్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పాడ్ టాక్సీ)ని నిర్వహించడానికి హైదరాబాద్ ఆధారిత సాయి గ్రీన్ మొబిలిటీని నియమించింది. ముంబయి నగరంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించే లక్ష్యంతో పాడ్ ట్యాక్సీని ప్రారంభించనున్నారు. చీఫ్ సెక్రటరీ సుజాతా సౌనిక్ నేతృత్వంలో జరిగిన ఎంఎంఆర్‌డీఏ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్‌కు చెందిన సంస్థకు టెండర్
ఈ ఏడాది మార్చిలో ఈ ప్రాజెక్టుకు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరికొద్ది వారాల్లో సీఎం ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఆగస్టులో ముంబైలో ప్రాజెక్ట్‌ను నిర్వహించేందుకు రెండు కంపెనీలు MMRDAకి ప్రతిపాదనలు పంపాయి. ఆ రెండు సంస్థలు హైదరాబాద్‌కు చెందిన సాయి గ్రీన్ మొబిలిటీ, చెన్నైకి చెందిన రిఫెక్స్ ఇండస్ట్రీస్.
హైదరాబాద్‌కు చెందిన సాయి గ్రీన్ మొబిలిటీకి ఈ టెండర్ ఇచ్చింది. పాడ్ టాక్సీల రూపకల్పన, ఇంజినీరింగ్, అభివృద్ధి, నిర్మాణం, టెస్టింగ్, కమీషన్, నిర్వహణ బాధ్యతలను కంపెనీ నిర్వహిస్తుంది. ఫైనాన్స్ బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (DFBOT) ప్రాతిపదికన టెండర్ అందించారు. ఈ ప్రాజెక్టుకు 30 ఏళ్ల రాయితీ వ్యవధిలో దాదాపు రూ.1,016.34 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. ప్రాజెక్ట్ అమలు దాదాపు మూడు సంవత్సరాలు పడుతుంది.
6 లక్షల మందికి ప్రయోజనం
ప్రారంభించిన తర్వాత బీకేసీలోని పాడ్ టాక్సీలు సుమారు ఆరు లక్షల మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చగలవని అంచనా. టాక్సీలు ప్రతి 15-30 సెకన్లకు పనిచేస్తాయి. బాంద్రా, కుర్లా సబర్బన్ స్టేషన్‌లు, బుల్లెట్ రైలు స్టేషన్, బీకేసీ మెట్రో స్టేషన్‌లలో కనెక్టివిటీని పెంచుతాయి. 8.8 కిలోమీటర్ల మార్గంలో 38 హాల్ట్‌లు ఉండే అవకాశం ఉంది.
పాడ్ ట్యాక్సీ అంటే
పాడ్ ట్యాక్సీ అంటే కారులా కనిపించే ట్యాక్సీ. ఇది డ్రైవర్ లేకుండా వెళ్తుంది. స్టీల్ ట్రాక్‌పై నడుస్తుంది. పాడ్ టాక్సీలు చిన్న ఆటోమేటెడ్ ఎలక్ట్రిక్ వాహనాలు. భారతదేశంలో నోయిడాలో మెుదటి పాడ్ ట్యాక్సీ ప్రాజెక్టు అమలు కానుంది. ఇది జెవార్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫిల్మ్ సిటీ వరకూ 14.6 కిలోమీటర్ల మార్గంలో ప్రారంభం కానుంది.