Ear pain in Flight: విమాన ప్రయాణంలో చెవి నొప్పికి కారణం, దాన్ని తగ్గించే చిట్కాలివే-tips and remedies to reduce ear pain in flight journey ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ear Pain In Flight: విమాన ప్రయాణంలో చెవి నొప్పికి కారణం, దాన్ని తగ్గించే చిట్కాలివే

Ear pain in Flight: విమాన ప్రయాణంలో చెవి నొప్పికి కారణం, దాన్ని తగ్గించే చిట్కాలివే

Koutik Pranaya Sree HT Telugu
Sep 22, 2024 05:06 PM IST

Ear pain in Flight: విమానంలో ప్రయాణించేటప్పుడు వచ్చే చెవి నొప్పిని కొన్ని సింపుల్ చిట్కాలతో తగ్గించుకోవచ్చు. అవేంటో, ఏ సమయంలో పాటించాలో తెల్సుకోండి.

విమాన ప్రయాణంలో చెవి నొప్పికి చిట్కాలు
విమాన ప్రయాణంలో చెవి నొప్పికి చిట్కాలు (freepik)

విమానంలో ప్రయాణం చేయడం ఇప్పుడు చాలా సాధారణం అయ్యింది. వృత్తి పరంగా కొందరు, చదువుల కోసం కొందరు.. విహార యాత్రల కోసం కొందరు.. ఎప్పుడో ఒకప్పుడు విమానం ఎక్కాల్సిందే. అయితే విమాన ప్రయాణంలో వచ్చే సమస్య చెవి నొప్పి. కొంత మందికి ఈ నొప్పి అంతగా తెలియకపోయినా.. కొందరు మాత్రం నొప్పిని భరించలేరు. ప్రయాణాన్ని ఆస్వాదించలేరు. కొన్ని చిట్కాలు పాటిస్తే ఏ నొప్పీ లేకుండా మీ ప్రయాణాన్ని, మీ చుట్టూ ఉన్న మేఘాల్ని, విమాన కదలికల్ని ఆస్వాదించొచ్చు. అవేంటో, ఇంతకీ చెవినొప్పి రావడానికి కారణాలేంటో చూసేయండి.

చెవి నొప్పి ఎందుకు వస్తుంది?

విమానంలో ప్రయాణించేటప్పుడు వచ్చే చెవి నొప్పిని ఎయిర్ ప్లేన్ ఇయర్ అంటారు. విమానం టేక్ ఆఫ్, ల్యాండింగ్ అయ్యేటప్పుడు వచ్చే పీడనం, ఎత్తు మార్పుల వల్ల నొప్పి మొదలవుతుంది. బయట పీడనానికి చెవి మధ్య భాగంలో ఉండే పీడనానికి సమతుల్యత లేక ఈ నొప్పి వస్తుంది. చెవిలో నొప్పి, శబ్దాలు సరిగ్గా వినిపించకపోవడం, చెవులు మూసుకుపోయినట్లుగా అనిపించడం ఎయిర్ ప్లేన్ ఇయర్ లక్షణాలు. దీన్ని కొన్ని చిట్కాలతో తగ్గించుకోవచ్చు. అయితే చెవి నొప్పి ప్రయాణం తర్వాత కూడా విపరీతంగా అనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.

చెవి నొప్పి తగ్గించుకోడానికి చిట్కాలు:

1. క్యాండీలు, చూయింగ్ గమ్:

చాలా విమానాల్లో చాకోలేట్లు, క్యాండీలు ఇవ్వడానికి కారణం ఇదే. టేక్ ఆఫ్, ల్యాండింగ్ సమయంలో నోట్లో క్యాండీలు, చాకోలేట్, లేదా చూయింగ్ గమ్ వేసుకుని నమలాలి. దాంతో మనం లాలాజలం మింగుతూ ఉంటాం. ఇలా నములుతూ, మింగుతూ ఉండటం ద్వారా చెవినొప్పి తక్కువవుతుంది.

2. ఆవలింతలు తీయడం:

అవును మీకు నిద్ర రాకున్నా, ఆవలింతలు రాకున్నా.. అలా వస్తున్నట్లు చేస్తే చెవి నొప్పి కాస్త నియంత్రణలో ఉంటుంది. ఒక్క ఆవలింత తీసి ఆపకుండా మీ నొప్పి తగ్గే వరకు అలా చేస్తూ ఉండాలి.

3. ఇయర్ ప్లగ్స్:

చెవిలో పెట్టుకునే ఇయర్ ప్లగ్స్ కొన్ని ఎయిర్ ప్లేన్ సంస్థలే ఉచితంగా ఇస్తాయి. లేదంటే మనమే కొనుక్కోవడం మంచిది. వాటిని పెట్టుకుంటే బయటి శబ్ధాలు ఎక్కువగా వినిపించవు. అలాగే పీడనంలో వచ్చే మార్పులని ఇవి సంతులనం చేసి చెవి నొప్పిని కాస్త తగ్గిస్తాయి.

4. చిన్న ప్రక్రియతో:

చిన్న ప్రక్రియ ఒకటి చేయడం ద్వారా చెవి నొప్పి అదుపులో ఉంటుంది. స్కూబా డైవింగ్ చేసేటప్పుడు కూడా చెవి నొప్పి వస్తే ఇదే చేయమని చెబుతారు. ముందుగా మీ వేళ్లతో ముక్కు మూసుకోవాలి. నోరు కూడా గట్టిగా మూసేయాలి. బెలూన్ ఊదుతున్నప్పుడు ఎలా పెడతామో అలా బుగ్గల్ని ఉబ్బించాలి. ఇప్పుడు ముక్కు ద్వారా గాలి బయటకు వదలుతున్నట్లు గట్టిగా ప్రయత్నించాలి. ఇలా చేస్తూ ఉంటే నొప్పి కాస్త తగ్గుతుంది.

5. నిద్ర పోకండి:

టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో నిద్రలోకి జారుకోకండి. దానివల్ల నొప్పిని మీరు నియంత్రించుకోలేరు. ఏవైనా ద్రవ పదార్థాలు తీసుకోండి. వేడి నీళ్లు, కాఫీ, టీ ఏదో ఒకటి తాగండి. మంచి నీళ్లు తీసుకోండి. దానివల్ల నొప్పి రాకుండా చూసుకోవచ్చు.

నెలల చిన్న పిల్లలతో విమాన ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్లకు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో పాలు పట్టాలి. కాస్త పెద్ద పిల్లలైతే టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో వాళ్లు నిద్రపోతే లేపాలి. జ్యూసులు, మంచి నీళ్లు తాగించాలి.

టాపిక్