Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై బిగ్ అప్డేట్- తొలిదశలో వీరికి కేటాయింపు, రేషన్ కార్డు లేకపోయినా
Indiramma Housing Scheme : సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తొలివిడతలో దివ్యాంగులు, వితంతవులకు అవకాశం కల్పిస్తామన్నారు. నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మిస్తామన్నారు.
Indiramma Housing Scheme : రాష్ట్రంలో ఇప్పటికి 32 లక్షల మంది యాప్ ద్వారా ఇందిరమ్మ ఇండ్లకు రిజిస్టర్ చేసుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మొదటి విడతలో దివ్యాంగులు, వితంతవులు, బహు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. మంగళవారం ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం నిర్వహించారు.
"నిన్నటి వరకు సుమారు 32 లక్షల మంది ఇందిరమ్మ యాప్ లో నమోదు చేసుకున్నారు. ఈ నెలాఖరుకి 70-75 శాతం పూర్తి అవుతుంది. ప్రజాపాలనలో 80 లక్షల మంది ఇల్లు ఆప్షన్ ను టిక్ పెట్టారు. కాబట్టి ఏదో నాలుగు లక్షల ఇళ్లు ఇచ్చి చేతులు దులుపుకోకుండా...కేంద్ర ప్రభుత్వం సహకారంలో అర్హత ఉన్నవారందరికీ ఇళ్లు నిర్మిస్తాము"- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు
నూతన సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల సర్వే క్రమంగా పెరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు 32 లక్షల కుటుంబాల సర్వే పూర్తి చేసి ఇందిరమ్మ మొబైల్ యాప్‌లో నమోదు చేసినట్లు వెల్లడించారు. త్వరలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వెబ్‌సైట్, టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినప్పటికీ నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి తీరుతామన్నారు. 33 జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించామన్నారు. రేషన్ కార్డులతో సంబంధం లేకుండా సొంత స్థలం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఇందిరమ్మ కమిటీలు అర్హులను ఎంపిక చేస్తాయన్నారు.
త్వరలో విధివిధానాలు ప్రకటన
ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలన జనవరి మొదటి వారానికి పూర్తవుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. వివిధ విభాగాల్లో ఉన్న కార్పొరేషన్ ఉద్యోగులను 95 శాతం వెనక్కి తీసుకొచ్చామన్నారు. నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించేందుకు అవసరమైన సిబ్బందిని సమకూర్చుకుంటున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై త్వరలో విధివిధానాలు ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
సంబంధిత కథనం