TTD Board Decisions: కాలినడక భక్తులకు మెరుగైన వైద్య సౌకర్యం, స్విమ్స్ కు జాతీయ హోదా సిఫార్సు- టీటీడీ కీలక నిర్ణయాలు
TTD Board Decisions : తిరుమల శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన సేవలు కల్పించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. స్విమ్స్‌కు జాతీయ హోదాకు సిఫార్సు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాని విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది.
TTD Board Decisions : తిరుమల శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన సేవలు కల్పించేందుకు టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన, ఈవో జె.శ్యామలరావుతో కలిసి మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది.
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాలు, ఆస్తులు గ్లోబల్ ఎక్స్ ప్యాన్షన్ కోసం అవసరమైన సూచనల కోసం నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని పాలకమండలి నిర్ణయించింది. దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో వేంకటేశ్వర స్వామివారి ఆలయాలు నిర్మించేందుకు కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది. కాలినడకన వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించేందుకుగాను అవసరమైన సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఫీడ్ బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సహకారంతో భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.
అన్నప్రసాదాల నాణ్యత
తిరుమలలోని బిగ్ , జనతా క్యాంటిన్ ల నిర్వహణ, మరింత నాణ్యంగా ఆహార పదార్థాలు తయారు చేసేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలకు క్యాంటీన్ల నిర్వహణ లైసెన్సుల జారీలో నూతన విధానం అమలుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. తిరుమల అన్నప్రసాద విభాగంలో మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు అందించేందుకు SLSMPC ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాలలో 258 మంది సిబ్బందిని నియమించేందుకు ఆమోదించింది.
కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న సంప్రదాయ పాఠశాలకు ఎస్వీ విద్యాదాన ట్రస్టు నుంచి రూ.2 కోట్లు ఆర్థిక సాయం చేసేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు టీటీడీలో ఫుడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటుతో పాటు అందుకు అనుగుణంగా సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టును SLSMPC కార్పొరేషన్ ద్వారా భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపింది.
ఒంటిమిట్ట ఆలయానికి బంగారు కలశం
శ్రీవారి దర్శనానికి సర్వ దర్శనం క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం ఆల్వార్ ట్యాంక్ విశ్రాంతి భవనాల నుంచి బాట గంగమ్మ సర్కిల్ మధ్యలో రూ.3.36 కోట్లతో 6 టాయిలెట్ బ్లాక్స్ నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. ఒంటి మిట్ట కోదండ రామాలయంలో విమాన గోపురానికి రూ.43 లక్షలతో బంగారు కలశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముంబయిలో పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి స్థానిక సిడ్కో కేటాయించిన 3.60 ఎకరాల స్థలానికి నిర్ణయించిన రూ.20 కోట్లకు పైగా ఉన్న లీజు ధరను తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు.