AP Universities: ఏపీలో వర్శిటీల ప్రక్షాళన దిశగా అడుగులు, వర్శిటీల్లో 3300 పోస్టుల భర్తీకి రూట్ మ్యాప్…
AP Universities: ఆంధ్రప్రదేశ్‌లో విశ్వవిద్యాలయాల ప్రక్షాళనకు అడుగులు పడుతున్నాయి.రాజకీయాలకు నిలయాలుగా తయారైన యూనివర్సిటీలను సమూలంగా మార్చేందుకు కీలక సంస్కరణలు చేపట్టారు.రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాల్లో వైస్-చాన్స్‌లర్ల నియామకానికి నోటిఫికేషన్లతో పాటుసెర్చ్ కమిటీలు నియమించారు.
AP Universities: ఆంధ్రప్రదేశ్‌లో విశ్వవిద్యాలయాలను సరస్వతీ నిలయాలుగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా చర్యలు చేపడుతన్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఏకీకృత చట్టం అమలుకు కసరత్తు ప్రారంభించారు. విశ్వవిద్యాలయాల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న సుమారు 3,300 పోస్టుల భర్తీకి రూట్ మ్యాప్ రూపొందించారు. అనుసంధన్ ప్రాజెక్ట్ కింద పరిశోధనల ప్రోత్సాహానికి ఐదు విశ్వవిద్యాలయాలను గుర్తించారు.
యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం పూర్తిచేసి, బయటకు వచ్చే ఏ విద్యార్థి నిరుద్యోగిగా ఉండరాదన్న లక్ష్యంతో సరికొత్త విద్యావ్యవస్థకు నడుంకట్టారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి పరిశ్రమల అవసరాలు, సామాజిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాల్లో మార్పులు చేసేందుకు వేగవంతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
వీసీల నియామకానికి కసరత్తు..
విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకానికి ముమ్మర కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలోని వివిధ డిగ్రీకోర్సుల్లో అన్ని సెమిస్టర్లకు ఈ విధానం అమలు చేయనున్నారు. దీనిద్వారా విద్యతోపాటు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యశిక్షణ కూడా ఇస్తారు. రాష్ట్రంలోని ప్రముఖ పరిశ్రమల సహకారంతో విశ్వవిద్యాలయాల్లో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఐదు అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
రాబోయే 6 నెలల్లో అకడమిక్ రికార్డులను 85% డిజిటలైజేషన్‌ను సాధించడం, సమర్థ్ యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అన్ని యూనివర్సటీల్లో అమలు చేసేలా ఆదేశాలిచ్చారు.
ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్ మెరుగుదలకు కృషి
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ మెరుగుదలకు వ్యూహాత్మక ఫ్రేమ్‌వర్క్, మెంటర్‌షిప్ కమిటీలు ఏర్పాటు చేశారు. సమగ్ర పరీక్షల నిర్వహణ వ్యవస్థ ద్వారా పరీక్ష ప్రక్రియల ఆటోమేషన్ కోసం దశలవారీ ప్రణాళిక రూపొందించారు. మెరుగైన యూనివర్సిటీ మేనేజ్ మెంట్ సిస్టమ్ అమలుకోసం డిల్లీ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతోపాటు ఈ-సమర్థ్ వ్యవస్థ ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పురోగతిలో ఉంది.
అన్ని రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలు, ఇంజినీరింగ్ II & IV సెమిస్టర్ విద్యార్థుల కోసం స్వయం + కోర్సులను ఆన్‌బోర్డ్ చేసి అమలు చేస్తున్నారు. ఇందుకోసం 1,800+ నైపుణ్య కోర్సులను అకడమిక్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్‌లలోకి చేర్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22% కళాశాలలు న్యాక్ గుర్తింపు పొందగా, 2028 నాటికి నూరుశాతం NAAC అక్రిడిటేషన్ సాధించేందుకు చురుకైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. మూడు కొత్త కాలేజిలతో సహా 22 ప్రభుత్వ కళాశాలలకు స్వయంప్రతిపత్తి హోదా కల్పించారు.
ఉపాధి కల్పనే లక్ష్యంగా డిజిటలైజేషన్ పై దృష్టి
రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించిన విద్యార్థులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా డిజిటలైజేషన్ ను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా రికార్డు సమయంలో ఇప్పటివరకు 98శాతం మంది విద్యార్థులకు అపార్ ఐడిలు ఇచ్చారు. డిజిటల్ కార్యక్రమాలపై వర్క్ షాపులు నిర్వహించారు. 62.2% అకడమిక్ సర్టిఫికెట్లు డిజిలాకర్‌కి అప్‌లోడ్ చేయగా, నూరుశాతం పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టారు.
యూనివర్సిటీల్లో పరిశోధనను ప్రోత్సహించడానికి ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేశారు. PM-USHA పథకం కింద ప్రారంభించిన 277.74 కోట్ల పనులైన త్వరగా పూర్తిచేసేలా ఆదేశాలు ఇచ్చారు. పూర్వోదయ పథకం కింద రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అకడమిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేసేందుకు 3,324 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూసా కింద కడప, విశాఖపట్నం జిల్లాల్లో గత ప్రభుత్వంలో అసంపూర్తిగా నిలిపివేసిన మోడల్ డిగ్రీ కళాశాలల నిర్మాణ పనులు పూర్తిచేయగా, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి.