Mutton Gongura: మటన్ గోంగూర ఇలా వండితే కళాయి మొత్తం ఊడ్చేస్తారు, రెసిపీ ఇదిగోండి
Mutton Gongura: మటన్ తో వండే కూరలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడు మటన్ గోంగూర స్పైసీ కర్రీ రెసిపీ ఇచ్చాము. ఇది చాలా సులువు.
మటన్ గోంగూర కర్రీ పేరు చెబితేనే ఎంతో మందికి వెంటనే తినేయాలన్నంత నోరూరిపోతుంది.దీన్ని చేయడం కష్టం అనుకుంటారు కానీ దీన్ని చాలా సులువుగా టేస్టీగా వండేయచ్చు. మటన్, గోంగూర ఈ రెండింటి కాంబినేషన్ అదిరిపోతుంది. దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి. సింపుల్ రెసిపీ ఇక్కడ ఇచ్చాము.
మటన్ గోంగూర రెసిపీకి కావాల్సిన పదార్థాలు
మటన్ - అర కిలో
కారం - రెండు స్పూన్లు
గోంగూర - రెండు కట్టలు
పసుపు - ఒక స్పూను
ఉల్లిపాయలు పెద్దవి - రెండు
పచ్చిమిర్చి - మూడు
టమాటోలు - రెండు
ధనియాలు - రెండు స్పూన్లు
జీలకర్ర - ఒక స్పూను
మెంతులు - పావు స్పూన్లు
మిరియాలు - అర స్పూను
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - నాలుగు
నూనె - రెండు స్పూన్లు
కరివేపాకులు - గుప్పెడు
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - రెండు గ్లాసులు
గరం మసాలా - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
మటన్ గోంగూర రెసిపీ
1. గోంగూర ఆకులను ఏరి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. మటన్ ముక్కలను ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడిగి పసుపు, కారం, ఉప్పు వేసి మారినేట్చ చేయండి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి ధనియాలు, జీలకర్ర, మెంతులు, లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు వేసి వేయించాలి. వీటిని మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. మసాలా పొడి రెడీ అయినట్టే.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేయాలి.
5. అందులో పచ్చిమిర్చి, టమాటోలు, గోంగూర ఆకులు వేసి మెత్తగా ఉడికించాలి.
6. అవి మెత్తగా ఉడికాక మిక్సీ జార్లో వేసి రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.
7. స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె వేయాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి.
8. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.
9. గుప్పెడు కరివేపాకులు వేసి కలపాలి. అందులోనే మారినేట్ చేసుకున్న మటన్ ముక్కలను వేసి కలుపుకోవాలి.
10. మటన్ కలుపుకున్నాక ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి బాగా కలుపుకోవాలి.
11. రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి.
12. రెండు గ్లాసుల నీటిని వేసి కుక్కర్ పై మూత పెట్టి విజిల్ పెట్టాలి.
13. మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.
14. కుక్కర్ ఆవిరి పోయాక మూత తీసి ఓసారి కలిపి మళ్లీ స్టవ్ ఆన్ చేయాలి.
15. ఆ కూరలో ముందుగా చేసి పెట్టకున్న గోంగూర మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
16. ఈ మొత్తం మిశ్రమం దగ్గరగా అయ్యేవరకు ఉంచి ఉడికించాలి.
17. ఒక స్పూను గరం మసాలా, కొత్తిమీర తరుగు వేసి ఓసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ మటన్ గోంగూర కర్రీ రెడీ అయినట్టే.
వేడి వేడి అన్నంలో మటన్ గోంగూర కర్రీ కలిపి తిని చూడండి. మీకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. పైగా ఇందులో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి. మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి.