Co Working Space: ఏపీలో 2025నాటికి లక్షన్నర సీట్ల కో వర్కింగ్ స్పేస్.. అందుబాటులో 22లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాలు
Co Working Space: ఆంధ్రప్రదేశ్‌లో 2025 డిసెంబర్ నాటికి లక్షన్నర అడుగుల కో వర్కింగ్ స్పేస్ అందుబాటులోకి తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కో వర్కింగ్ స్పేస్, నైబర్ హుడ్ వర్కింగ్ స్థలాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు.
Co Working Space: ఏపీలో కో-వర్కింగ్ స్పేస్, నైబర్ హుడ్ వర్కింగ్ స్పేస్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో సమీక్షించారు. కో-వర్కింగ్ స్పేస్, వర్క్ ఫ్రం హోమ్‌తో మానవ వనరుల సమర్థ వినియోగం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు దీనికోసం. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో ఉన్న వారికి ట్రైనింగ్ ఇచ్చి అవకాశాలు కల్పించాలని... అలాంటి వారి కోసం వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేయాలని సీఎం అన్నారు.
చదువుకున్న మహిళలు గృహిణిలుగా మిగిలిపోకూడదు, వారికి అవకాశాలు కల్పించాలని సీఎం అభిప్రాయపడ్డారు. వర్క్ ఫ్రం హోమ్, కో-వర్కింగ్ సెంటర్‌లతో మహిళలకు విస్తృతంగా అవకాశాలు లభిస్తాయన్నారు. మహిళలను ఇంటికి, ఇంటి పనికి పరిమితం చేయడం సరికాదని సీఎం అన్నారు. ఇప్పటికీ చదువుకున్న మహిళలు ఇళ్లల్లో ఉంటున్నారని... వారికి వర్క్ ఫ్రం హోమ్ అందుబాటులోకి తెస్తే ఆన్లైన్ విధానంలో పనిచేసి ఉపాధి పొందుతారని అభిప్రాయపడ్డారు.
మహిళల్లో ఎంతో సమర్థత, నైపుణ్యం ఉందని, కుటుంబ వ్యవహారాలు, బాధ్యత కారణంగా చాలా మంది ఇళ్లకే పరిమితం అవుతున్నారన్నారు. ఇలాంటి వారికి అవకాశాలు కల్పిస్తే... ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ల ఏర్పాటులో 2025 డిసెంబర్ చివరినాటికి 1.50 లక్షల సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు.
ఒక్కో సీటుకు 50-60 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరమని.. ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో ఈ వర్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ప్రైవేటు, ప్రభుత్వ భవనాల్లో 22 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతమంది వర్క్ ఫ్రం హోమ్‌లో పనిచేస్తున్నారు, వారి అవసరాలు ఏంటనే సమాచారం సేకరించాలని అధికారులకు సీఎం సూచించారు. అదే విధంగా ఇప్పటికే నిర్ణయించినట్లు రతన్ టాటా ఇన్నో వేషన్ హబ్‌ల ఏర్పాటుకు రాష్ట్రంలో 5 చోట్ల భవనాలను గుర్తించాలని సీఎం ఆదేశించారు. ఆ ప్రాంతంలోని పరిశ్రమలను, విద్యా సంస్థలను ఇన్నోవేషన్ హబ్‌లకు అనుసంధానం చేయాలని సీఎం నిర్దేశించారు.
ఇదే ప్రభుత్వ ఆలోచన..!
ప్రైవేట్ సంస్థలు కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి పెద్ద పెద్ద ఆఫీస్ లు అవసరం లేకుండా …షేరింగ్ వర్క్ స్పేస్, ప్లగ్ అండ్ ప్లే విధానంలో తక్కువ ఆఫీస్ స్పేస్‌లో ఎక్కువ కంపెనీ లు తమ ఉద్యోగులతో వర్క్ చేయించే కాన్సెప్ట్ కో వర్కింగ్ లేదా షేరింగ్ ఆఫీస్ స్పేస్ కాన్సెప్ట్.. దేశంలో కరోనా తర్వాత ఈ తరహా విధానం విస్తరిస్తోంది. హైబ్రిడ్ విధానానికి అలవాటు పడిన ఉద్యోగులు కార్యాలయాలకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. అదే సమయంలో అయా సంస్థలను మూన్ లైటింగ్ వెంటాడుతోంది. దీంతో ఉద్యోగులకు ఎక్కడ వీలు కుదిరితే అక్కడే పనిచేసేలా కోవర్కింగ్ అందుబాటులో తీసుకు రావాలని భావిస్తున్నాయి. దీనికి అవసరమైన ఎన్విరాన్మెంట్ కోసం కో వర్కింగ్ స్పేస్ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
కరోనా తర్వాత చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఏర్పాట్లు చేశాయి. అదే టైం లో ఉద్యోగులు వేర్వేరు పేర్లతో ఇతర కంపెనీ లకు కూడా వర్క్ చేస్తున్నట్లు తేలింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా వారు నివాసం ఉండే ప్రదేశాల్లోనే కార్యాలయాలను ఏర్పాటు చేయడంపై దృష్టి సారిస్తున్నాయి.
భారీ వ్యవస్థలు , ఆఫీస్ స్పేస్ , వాటర్ , పవర్ , విద్యుత్, ఇతర సదుపాయాలు, వసతులు..లేకుండా ఆఫీస్ స్పేస్ ని కో వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసి అక్కడ నుంచి ఉద్యోగులతో పని చేయించుకోవడంకాన్సెప్ట్ ఇటీవల బాగా పెరుగుతోంది. ఏపీలో దీనిని కూడా అందిపుచ్చుకుంటే బహుళ జాతి సంస్థలు వాటిని ఉపయోగించుకుంటాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.