బరువు పెరగడం అనేది ఈ రోజుల్లో చాలా మందికి సమస్యగా మారింది. ఇందుకోసం వ్యాయామం, జిమ్, డైట్ వంటి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే బరువు తక్కువగా ఉన్నవారు కూడా బరువు పెరగడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఏదేమైనా తమ బరువును ప్రతి రోజు చెక్ చేసుకోవడం ఈ రోజుల్లో చాలా మందికి కామన్ విషయంగా మారింది. అయితే రోజంతా ఏ సమయంలో అయినా బరువును తనిఖీ చేసుకోవచ్చా అంటే కచ్చితంగా వద్దనే చెబుతున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల మీ బరువు విషయంలో సరైన రిజల్ట్ తెలుసుకోవడం కుదరదు, పైగా పెరగడం, తగ్గడం విషయంలో అయోమయానికి గురవుతారని ప్రముఖ పోషకాహాల నిపుణురాలు, వెయిట్‌లాస్ కోచ్ రఖేజా చెబుతున్నారు.
వెయిట్ చెకింగ్ గురించి చాలా ఆసక్తికర విషయాలను రఖేజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించారు. వ్యక్తి బరువు రోజంతా రకరకాల హెచ్చుతగ్గులకు లోనవుతుందట. కనుక కచ్చితమైన బరువును, మీ ఫిట్నె్స్ లక్ష్యాలను తెలుసుకోవడానికి బరువును నిర్ధిష్ట సమయాల్లో మాత్రమే చెక్ చేసుకోవాలని ఆమె తెలిపారు. తప్పుడు సమయంలో బరువు చెక్ చేసుకోవడం వల్ల మీరు బరువు పెరిగారనే తప్పుడు సమాచారంమే మీకు అందుతుంది. అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ముఖ్యంగా మీరు నమ్మినా నమ్మకపోయినా, వ్యాయామం తర్వాత మీరు బరువును చెక్ చేసుకోవడం సరైన సమయం కాదని ఆమె చెబుతున్నారు. ఎందుకో తెలుసుకుందాం.
ఆహారం, నీరు తీసుకోవడం వల్ల మీ బరువు హెచ్చుతగ్గులకు లోనవుతుంది. కనుక ఏదైనా తిన్న తర్వాత లేదా తాగిన తర్వాత వెయిట్ చెక్ చేసుకోవడం వేస్ట్.
రాత్రివేళలో మీ శరీరం నీటిని నిలుపుకుంటుంది. ఈ సమయంలో మీరు బరువును తనిఖీ చేయడం వల్ల సరైన వెయిట్ ను తెలుసుకోలేరు.
నిర్జలీకరణం తాత్కాలిక బరువు తగ్గడానికి కారణమవుతుంది. కనుక వ్యాయామం తర్వాత బరువు చెక్ చేసుకుంటే నిజమైన బరువు తెలియదు.
పాస్తా, రొట్టె, బియ్యం, స్వీట్లు వంటి అధిక కార్బోహైడ్రేట్లు కలిగిన భోజనం శరీరంలో నీటిని నిలుపుకోవటానికి కారణమవుతుంది. వీటిని తిన్న రోజూ, మరుసటి రోజూ బరువును చెక్ చేసుకోవడం వల్ల మీరు ఎక్కువ బరువు కనిపిస్తారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బరువును తనిఖీ చేయడానికి సరైన సమయాలు కొన్ని ఉన్నాయి. మీరు ఏదైనా తినడానికి లేదా త్రాగడానికి ముందు అంటే ఉదయం మీరు మేల్కొన్న వెంటనే, బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత వెయిట్ చెక్ చేసుకోవడం వల్ల చాలా స్థిరమైన, ఖచ్చితమైన బరువును తెలుసుకోవచ్చు.
ప్రతిరోజూ ఒకే సమయంలో బరువును చెక్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే.. ఇది సరిగ్గా మీ బరువును ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఆహారం లేదా ఇతర అంశాలు ప్రభావం చూపకుండా మీ బరువు తెలుసుకోవచ్చు. బరువును ప్రతి రోజూ చెక్ చేయడం కన్నా, వారానికి 2-3 సార్లు చెక్ చేయడం ఉత్తమం.
సంబంధిత కథనం