Jagityal Murder: సుపారీ హత్యకు ఒప్పందం కుదుర్చుకుని, హత్యకు గురైన గ్యాంగ్ స్టర్, భయంతో లొంగిపోయిన నిందితులు
Jagityal Murder: తన్నేందుకు వెళ్ళి తన్నించుకున్నట్టైంది... జగిత్యాల జిల్లాలో జరిగిన హత్యా ఘటన. హత్యకు ముంబై గ్యాంగ్ స్టర్ సుపారీ తీసుకుని చివరకు అతనే హత్యకు గురయ్యాడు. నామరూపాలు లేకుండా బూడిద కుప్ప అయ్యాడు.
Jagityal Murder: జగిత్యాల జిల్లాలో ముంబై గ్యాంగ్ స్టర్ రాహుల్ సూర్య ప్రకాష్ సింగ్ దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు స్వస్థలం ఉత్తర ప్రదేశ్. జగిత్యాల జిల్లా నేరెళ్ళకు చెందిన తోకల గంగాధర్ అనే వ్యక్తిని హత్య చేసేందుకు సుపారీ కుదుర్చుకున్నాడు. ఐదు లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. చివరి నిమిషంలో హత్య ప్లాన్ మారింది. హత్య అవసరం లేదన్నా ఒప్పందం ప్రకారం ఐదు లక్షలు ఇవ్వాల్సిందేనని గ్యాంగ్‌స్టర్ పట్టుబట్టాడు. లేకుంటే మీ అయ్యను చంపుతానని బెదిరించాడు. అనుకున్నంత పని చేస్తాడని భావించి సుపారీ తీసుకున్న వ్యక్తినే హత్య చేసి దహనం చేశాడు. చివరకు నిందితులు భయపడి పోలీసులకు లొంగిపోయడంతో హత్య దహనం వెలుగులోకి వచ్చింది.
ముంబై లో ప్లాన్.. తెలంగాణ లో అమలు..
ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన మెరుగు లక్ష్మణ్, కమలాపూర్ గ్రామానికి చెందిన నేరెళ్ళ గోపాల్ ఇద్దరు మంచి స్నేహితులు. వీరు ముంబైలో కల్లు బిజినెస్ చేస్తున్నారు. ఇటీవల కొంతకాలం నుంచి మెరుగు లక్ష్మణ్ మరదల్ని నేరెళ్లకు చెందిన తోకల గంగాధర్ అనే వ్యక్తి వేధిస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు హెచ్చరించినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో గంగాధర్ ను ఎలాగైనా చంపేసి తన మరదలకు ప్రశాంత జీవనం అందించాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడైన నేరెళ్ల గోపాల్ కు తెలిపి గంగాధర్ ను చంపడానికి ఎవరితోనైనా మాట్లాడాలని కోరాడు.
గోపాల్ తనకు తెలిసిన యుపికి చెందిన రాహుల్ సూర్య ప్రకాష్ సింగ్ ముంబైలో గ్యాంగ్ స్టర్ అని, అతడికి సుపారీ ఇస్తేనే హత్య చేయడానికి ఒప్పు కుంటాడని గోపాల్, లక్ష్మణ్ తో చెప్పాడు. రూ.5 లక్షల సుపారీ ఇవ్వడానికి లక్ష్మణ్ ఒప్పుకోగా గోపాల్ ఈ విషయాన్ని గ్యాంగ్ స్టర్ రాహుల్ ప్రకాష్ సింగ్ కు వివరించగా ఆయన డీల్ ఒకే చేశారు. ఇంకేముంది మర్డర్ చేయడానికి డేట్, టైం అన్ని సెట్ చేసుకున్నారు. కాగా, ఇంతలోనే కథ అడ్డం తిరిగింది.
గ్యాంగ్ స్టర్ సుపారీ డబ్బులు ఇవ్వాలని ఓ రోజు గోపాల్, లక్ష్మణ్ లకు ఫోన్ చేశాడు. ఎవరిని హత్య చేయాల్సిన అవసరం లేదు, డబ్బులు ఇవ్వాల్సిన పని లేదని ఇద్దరూ గ్యాంగ్ స్టర్ కు తేల్చి చెప్పారు. దీంతో గ్యాంగ్ స్టర్ రాహుల్ ప్రకాష్ సింగ్ సుపారీ మేరకు డబ్బులు ఇవ్వాలని గోపాల్ కు వార్నింగ్ ఇచ్చాడు. డబ్బులు ఇవ్వకపోతే మీ తండ్రి రమేష్ ను చంపుతా అంటూ బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన గోపాల్ డీల్ ప్రకారం నీ సుపారీ ఇచ్చేస్తానని ఈనెల 12న నేరెళ్లకు రావాలని కోరగా రాహుల్ వచ్చాడు.
ఈనెల 13న అర్థరాత్రి సమయంలో గోపాల్ నేరెళ్లకు చెందిన గండికోట శేఖర్ తో కలిసి రాహుల్ ప్రకాష్ సింగ్‌ను నేరెళ్ల సాంబశివ గుడి వద్దకు తీసుకెళ్లి అందరూ కలిసి మద్యం సేవించారు. ఈ సమయంలో రాహుల్ కు శేఖర్ మాటల్లో పెట్టగా గోపాల్ పెద్ద బండరాయితో రాహుల్ సూర్య ప్రకాష్ సింగ్ తలపై మోదీ హత్య చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావద్దనే ఆలోచనతో శవాన్ని సమీపంలో ఉన్న బట్టపెల్లి పోతారం అడవుల్లోకి తీసుకెళ్ళి, శవాన్ని పెట్రోల్ పోసి కాల్చి వేశారు. శవం పూర్తిగా కాలిందో, లేదోనని మరుసటి రోజు నిందితులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. సగం కాలిన శవాన్ని మళ్లీ కట్టెలు వేసి పూర్తిగా దగ్ధం అయ్యాక ఇంటికి వెళ్లారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటకు పొక్కి పోలీసులకు తెలిసింది.
భయంతో పోలీసులకు లొంగిపోయిన నిందితులు..
నేరెళ్ళలో ముంబాయి గ్యాంగ్ స్టర్ హత్యకు గురి కావడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. భయంతో నిందితులు ఇద్దరు నేరేళ్ళ గోపాల్, గండికోట శేఖర్ పోలీసులకు లొంగిపోయారు. రాహుల్ సూర్య ప్రకాష్ సింగ్ ను తామే హత్య చేశామని పోలీసులకు చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ణఘటన స్థలాన్ని సందర్శించి హత్యకు గురై దహనమైన రాహుల్ చితాభస్మాన్ని సేకరించి పొరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. డీఎస్పీ రఘుచందర్, సీఐ రాంనరసింహారెడ్డి ఆద్వర్యంలో హత్య సీన్ ను రీ కన్స్ట్రక్షన్ చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.
ప్రశాంతంగా ఉన్న పల్లెలో హత్యా అలజడి...
జగిత్యాల జిల్లాలో సుఫారీ ఇచ్చిన వారి చేతుల్లోనే గ్యాంగ్ స్టర్ హత్యకు గురి కావడం సంచలనం రేపింది. జరిగిన ఘటన గురించి తెలుసుకుని ఆందోళనకు గురయ్యారు. ప్రశాంతంగా పొలం పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్న పల్లె జనం సుఫారీ హత్య ఘటన వెలుగులోకి రావడంతో ఉలిక్కిపడ్డారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)