Mulugu Tiger : ములుగు జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం.. ఆచూకీ కనుగొనే పనిలో అటవీ శాఖ అధికారులు-forest officials searching for tiger in mulugu district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mulugu Tiger : ములుగు జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం.. ఆచూకీ కనుగొనే పనిలో అటవీ శాఖ అధికారులు

Mulugu Tiger : ములుగు జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం.. ఆచూకీ కనుగొనే పనిలో అటవీ శాఖ అధికారులు

HT Telugu Desk HT Telugu

Mulugu Tiger : ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. దాదాపు మూడు నెలల కిందట ఏటూరునాగారం ఫారెస్ట్ ఏరియాలో పెద్దపులి అడుగులు కనిపించగా.. తాజాగా వెంకటాపురం మండలం అలుబాక శివారులో పెద్దపులి సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

పులి అడుగులు

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అలుబాక బోధాపురం సమీపంలో పెద్దపులి కలకలం సృష్టించింది. మిర్చి తోటలకు వెళ్లే దారిలోని గోదావరి పాయలో కొందరు స్థానికులు పెద్దపులి అడుగులను గుర్తించారు. భయపడిపోయి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు అలుబాక బోధాపురం శివారులోని అడుగులను పరిశీలించారు.

అవి పెద్దపులి అడుగులేనని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. గోదావరి తీర ప్రాంతంలో కొంతమంది రైతులు పుచ్చతోటలు సాగు చేస్తున్నారు. సోమవారం రాత్రి తోటల వద్ద పడుకున్న సమయంలో పెద్ద పులి అరుపులు వినిపించినట్లు స్థానిక రైతులు చెబుతున్నారు. పెద్దపులి జాడ దొరికే వరకు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ ఎలాంటి ఆనవాళ్లు కనిపించిన వెంటనే సమాచారం అందించాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఎటు వైపు వెళ్లింది?

వెంకటాపురం మండలం అలుబాక శివారు అటవీ ప్రాంతంలో కనిపించిన పెద్దపులి అడుగులను బట్టి.. అది ఎటువైపు వెళ్లి ఉంటుందోనని అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. పెద్దపులి ఆచూకీని కనుగొనే ప్రయత్నాలు మొదలు పెట్టారు. జనావాసాల్లోకి పులి ప్రవేశిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీంతో పులి ఆచూకీకి కనిపెట్టేందుకు శ్రమిస్తున్నారు.

గతంలో కూడా ములుగు జిల్లాలోని ములుగు, తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం మండలాల్లో పెద్దపులి సంచరించిన ఆనవాళ్లు ఉన్నాయి. అప్పట్లో తాడ్వాయి మండలంలోని కామారం అటవీ ప్రాంతంలో ఓ పెద్ద పులి పశువుల మందపై దాడికి ప్రయత్నించింది. ఆ తరువాత మంగపేట మండలంలో ఓ లేగ దూడపై దాడి చేసి, చంపేసింది. కొద్ది రోజులకు మంగపేట మండలంలోని శ్రీరాంనగర్ గొత్తికోయ గూడెం సమీపంలో మేత కోసం వెళ్లి ఆవుల మందపై కూడా పెద్ద పులి దాడికి దిగింది. ఈ దాడిలో ఓ లేగ దూడ మృత్యు వాత పడింది.

ఇలా పెద్దపులి సంచారం తరచూ కలకలం రేపుతుండగా.. ఇప్పుడు మరోసారి అదే భయం జనాలకు పట్టుకుంది. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అలుబాక బోధాపురం అటవీ ప్రాంతంలో సంచరించిన పెద్ద పులి ఎటువైపు వెళ్లిందో తెలుసుకునేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పులి ఆచూకీ కోసం ఆ చుట్టుపక్కల ప్రాంతాలను గాలిస్తున్నారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. అధికారులు పశువుల కాపరులతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులి అడుగు జాడలతో పాటు ఇతర ఏ సమాచారం ఉన్నా.. వెంటనే తమకు చేరవేయాల్సిందిగా స్థానికులకు సూచించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)