TG Govt Landless Poor Scheme : భూమిలేని పేదల ఖాతాల్లో రూ.12 వేలు, ఉపాధి హామీ జాబ్ కార్డు ఆధారంగానే!
TG Govt Landless Poor Scheme : తెలంగాణ ప్రభుత్వం భూమి నిరుపేదలకు ఏటా రెండు విడతల్లో రూ.12 వేల ఆర్థిక సాయం ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ నెల 28న తొలి విడతలో రూ.6 వేలు అకౌంట్లలో జమ చేయనున్నారు. ఈ పథకానికి ఉపాధి హామీ జాబ్ కార్డును ప్రాతిపదికంగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
TG Govt Landless Poor Scheme : రాష్ట్రంలో భూమిలేని వ్యసాయ కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో మొదటి విడత రూ.6 వేలు డిసెంబర్ 28న లబ్దిదారుల ఖాతాల్లో జమకానున్నాయి. ఈ పథకంపై మార్గదర్శకాలు విడుదల కాకపోయినా...క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ పథకానికి లబ్ధిదారులను ఉపాధి హామీ ఆధారంగా ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి హామీ జాబ్ కార్డు ప్రాతిపదికంగా తీసుకుని భూమి లేని పేదల సమాచారాన్ని ఫీల్డ్ అసిస్టెంట్లు నుంచి సేకరిస్తున్నారు. కాంగ్రెస్ వ్యవస్థాపక దినం అయిన ఈ నెల 28న లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
100 రోజుల పని పూర్తి చేసిన వారికి
ఈ పథకంలో తొలి విడతగా వంద రోజుల ఉపాధి హామీ పనిపూర్తి చేసిన వారికి అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. ఈ స్కీమ్ అమలుపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయకుండానే కసరత్తు చేస్తుండటంతో వ్యవసాయ కూలీలు, రైతు సంఘాలు కాస్త ఆందోళన చెందుతున్నాయి. వ్యవసాయ భూమి ఉన్న రైతులకు...రుణమాఫీ, రైతు భరోసా, పీఎం కిసాన్ ఇలా ఏదో ఒక పథకంలో ప్రభుత్వం నుంచి లబ్దిచేకూరుతోంది. భూమిలేని వ్యవసాయ కూలీలకు ఎలాంటి సాయం అందడంలేదు. వ్యవసాయ కూలీల కోసం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా నిరుపేద రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు లబ్ధి పొందుతున్నారు.
ఉపాధి హామీ జాబ్ కార్డుల వారీగా
వ్యవసాయ కూలీలకు లబ్దిచేకూర్చేలా ఏడాదికి రెండు విడతలల్లో రూ. 12 వేలు ఇస్తామని ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ పథకం అమలు కోసం బడ్జెట్ లో రూ.1,200 కోట్లు కేటాయించామన్నారు. ఈ పథకానికి లబ్ధిదారులను గ్రామీణాభివృద్ధి శాఖ ఎంపిక చేస్తుంది. ఉపాధి హామీ పథకంలోని జాబ్ కార్డులు, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డుల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. క్షేత్రస్థాయిలోని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల ద్వారా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఉపాధి హామీ జాబ్ కార్డుల వారీగా ఈ ఏడాది 100 రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు.
రైతులు సంఘాల అభ్యంతరాలు
ఉపాధి హామీ జాబ్ కార్డుల్లో భూమి ఉన్నవాళ్లు ఎవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పని పూర్తి చేసుకున్న వారి జాబితా తీస్తున్నారు. ఈ తరహాలోనే 90, 80, 70 రోజులు....ఇలా ఎక్కువ పని దినాలు పూర్తి చేసిన వారి లిస్టులను రూపొందిస్తున్నారు. వీరిలో లబ్దిదారులకు ఆర్థిక సాయం చేయనున్నారు. రాష్ట్రంలో 15 లక్షల మంది వ్యవసాయ కూలీలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరో నాలుగు రోజుల్లో అమలు చేసే ఈ పథకానికి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంపై రైతు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వ్యవసాయ కూలీల్లో వివిధ కారణాలతో 100 రోజుల పని దినాలు పూర్తి చేయని వారు ఉంటారని, వారికి ఎలా లబ్దిచేకూరుస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఒంటరి మహిళలకు ఇందులో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అతి తక్కువ భూమి ఉన్న చిన్న రైతులకు రైతు భరోసాలో పెద్దగా ఏం లబ్దిచేకూరదని, అలాంటి వారిని కూడా వ్యవసాయ కూలీలుగా పరిగణించాలని రైతులు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
సంబంధిత కథనం