RGV Tweet: అల్లు అర్జున్‌కి రిటర్న్ గిఫ్ట్ అంటూ.. తెలంగాణ ప్రభుత్వంపై రాంగోపాల్ వర్మ సెటైర్-ram gopal varma makes controversial remarks on pushpa star allu arjun arrest ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rgv Tweet: అల్లు అర్జున్‌కి రిటర్న్ గిఫ్ట్ అంటూ.. తెలంగాణ ప్రభుత్వంపై రాంగోపాల్ వర్మ సెటైర్

RGV Tweet: అల్లు అర్జున్‌కి రిటర్న్ గిఫ్ట్ అంటూ.. తెలంగాణ ప్రభుత్వంపై రాంగోపాల్ వర్మ సెటైర్

Galeti Rajendra HT Telugu

Allu Arjun arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై రాంగోపాల్ వర్మ సెటైరికల్ ట్వీట్ వదిలాడు. పుష్ప 2 సృష్టించిన రికార్డులను ప్రస్తావిస్తూ.. తెలంగాణ ప్రభుత్వంపై సెటైర్ వేశాడు.

అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ వదిలాడు. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా.. ఈ కేసులో అల్లు అర్జున్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. శనివారం ఉదయం బెయిల్‌పై అల్లు అర్జున్ విడుదల అయ్యారు. దాంతో అల్లు అర్జున్ నివాసానికి ఉదయం నుంచి వరుసగా వెళ్తున్న టాలీవుడ్ హీరోలు, దర్శకులు, ప్రొడ్యూసర్లు.. తమ మద్దతు ప్రకటిస్తూ భరోసాగా నిలుస్తున్నారు.

పుష్ప 2కి వర్మ సపోర్ట్

‘పుష్ప 2 : ది రూల్ ’ మూవీ రిలీజ్ ముందు నుంచే ఈ సినిమాని సోషల్ మీడియాలో వరుస ట్వీట్స్‌తో ప్రమోట్ చేస్తున్న రాంగోపాల్ వర్మ.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై కూడా శుక్రవారం స్పందించాడు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని వర్మ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

అల్లు అర్జున్‌కి రిటర్న్ గిఫ్ట్

‘‘భారత్‌లోనే అతి పెద్ద స్టార్.. తెలంగాణ నివాసి అయిన అల్లు అర్జున్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ హిట్ కొట్టి తెలంగాణ రాష్ట్రానికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. కానీ.. తెలంగాణ రాష్ట్రం అతడ్ని జైలుకి పంపించి అతి పెద్ద రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది’’ అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను అల్లు అర్జున్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

వారంలోనే వెయ్యికోట్లు

డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో విడుదలైన పుష్ప 2 మూవీ.. వారం వ్యవధిలోనే రూ.1,000 కోట్లు వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత వేగంగా వెయ్యి కోట్లు వసూళ్లు రాబట్టి మొట్టమొదటి సినిమాగా పుష్ప 2 నిలిచింది. తెలుగులో కంటే.. హిందీలో పుష్ప2 కలెక్షన్లు ఎక్కువగా వస్తుండటం గమనార్హం.



పుష్ప 2లో అల్లు అర్జున్ సరసన రష్మిక మంధాన నటించగా.. సుకుమార్ దర్శకత్వం వహించాడు. శ్రీలీల ఐటెం సాంగ్ చేయగా.. ఫహాద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, అనసూయ, సునీల్ తదితరులు నటించారు.