Budget Cars : తక్కువ ధరలోనే కొనుక్కోవాలంటే ఈ 5 చౌకైన కార్లు బెస్ట్.. ప్రారంభ ధర రూ.3.99 లక్షలు!
Budget Cars : మార్కెట్‌లో చాలా రకాల బడ్జెట్ కార్లు ఉన్నాయి. మిడిల్ క్లాస్ వాళ్లకు ఈ కార్లు బాగా సూట్ అవుతాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో వచ్చే కార్లు ఏమున్నాయో చూద్దాం..
త్వరలో తక్కువ ధరలో కారు కొనాలని ఆలోచిస్తుంటే.. మీకోసం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. భారతీయ ఆటోమెుబైల్ రంగం చాలా పెద్దది. ఇక్కడ కోట్ల విలువ చేసే కార్ల నుంచి మధ్యతరగతివారు కొనుగోలు చేసేలా లక్షల్లో కూడా కార్లు దొరుకుతాయి. ఫీచర్లు కూడా బాగుంటాయి. ఇప్పటికీ మార్కెట్లో దాదాపు రూ.5 లక్షల ఎక్స్ షోరూమ్ వరకు ధర కలిగిన మోడళ్లు చాలానే ఉన్నాయి. దేశంలోని 5 చౌకైన కార్ల గురించి తెలుసుకుందాం..
మారుతి సుజుకి ఆల్టో కె10
మారుతి సుజుకి ఆల్టో కూడా ఇప్పటివరకు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఆల్టో 800 గత ఏడాది నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వినియోగదారులకు ఆల్టో కె10 మాత్రమే లభిస్తుంది. మారుతి ఆల్టో కె10 ప్రారంభ (ఎక్స్-షోరూమ్) ధర రూ.3.99 లక్షలు. ఇందులోని 1.0-లీటర్ కె10సి పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 67బిహెచ్‌పీ పవర్, 89ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో
బడ్జెట్ సెగ్మెంట్లో కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటే మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కూడా ఉంది. మారుతి సుజుకి నుండి వచ్చిన మరొక సరసమైన మోడల్ ఎస్-ప్రెస్సో. దీని ప్రారంభ ధర రూ .4.26 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఎస్-ప్రెస్సో ఆల్టో కె10 మాదిరిగానే పనిచేస్తుంది. అలాగే కారు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉన్న బేస్ వేరియంట్ మాత్రమే రూ .5 లక్షల కంటే తక్కువ (ఎక్స్-షోరూమ్)లో లభిస్తుంది.
మారుతి సుజుకి సెలెరియో
మారుతి సుజుకి సెలెరియో కూడా సరసమైన కారుగా చెప్పవచ్చు. మారుతి సెలెరియోలో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 67బిహెచ్‌పీ పవర్, 89ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మారుతి సెలెరియో ప్రస్తుతం 4 వేరియంట్లలో లభ్యమవుతోంది. భారత మార్కెట్లో మారుతి సెలెరియో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ .5.36 లక్షలు.
రెనాల్ట్ క్విడ్
0.8-లీటర్, 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో ఈ కారు అందుబాటులో ఉంది. అయితే గత ఏడాది కారు నుంచి చిన్న ఇంజిన్‌ను తొలగించారు. రెనో క్విడ్ ప్రారంభ (ఎక్స్-షోరూమ్) ధర రూ .4.69 లక్షలు. క్విడ్ లో 1.0-లీటర్ ఎస్‌సీ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 68బిహెచ్‌పీ పవర్, 91ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
టాటా టియాగో
బడ్జెట్ సెగ్మెంట్లో కొత్త కారు కొనాలనుకుంటే టాటా టియాగో కూడా మీకు బెటర్ ఆప్షన్. బేస్ వేరియంట్ తక్కువ ధరకే వస్తుంది. టాటా టియాగోలో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 86బిహెచ్‌పీ పవర్, 113ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు సీఎన్జీ పవర్ట్రెయిన్ ఆప్షన్ కూడా పొందుతుంది. భారత మార్కెట్లో టాటా టియాగో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ .4.99 లక్షలు.