Medigadda Barrage : బ్యారేజీ వద్దకు నో ఎంట్రీ - మేడిగడ్డ వద్ద అసలేం జరుగుతోంది...?-what is the current situation at medigadda project ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medigadda Barrage : బ్యారేజీ వద్దకు నో ఎంట్రీ - మేడిగడ్డ వద్ద అసలేం జరుగుతోంది...?

Medigadda Barrage : బ్యారేజీ వద్దకు నో ఎంట్రీ - మేడిగడ్డ వద్ద అసలేం జరుగుతోంది...?

HT Telugu Desk HT Telugu
May 26, 2024 11:28 AM IST

Medigadda Barrage Damage: మేడిగడ్డ బ్యారేజీ వద్ద అనుమతి లేకుండా వచ్చే వారికి ఎంట్రీ లేదు. ఈ మేరకు ఎల్ అండ్ టీ సంస్థ ప్రాజెక్ట్ వద్ద బోర్డును ఏర్పాటు చేసింది. మరోవైపు మేడిగడ్డ పిల్లర్ల కింద భారీ బుంగ ఏర్పడటం కలకలం రేపుతోంది. దీంతో అసలు అక్కడ ఏం జరుగుతోందనే చర్చ జరుగుతోంది.

మేడిగడ్డ బ్యారేజీ
మేడిగడ్డ బ్యారేజీ

Medigadda Barrage Damage : కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాక్ లోని 20, 21వ పిల్లర్ల వద్ద తాజాగా భారీ బుంగ బయటపడింది. ఓ వైపు రిపేర్లు చేస్తున్న క్రమంలోనే దాదాపుగా రెండు మీటర్ల పొడవు, వెడల్పుతో పిల్లర్లకు అతి సమీపంలోనే ఈ బుంగ ఏర్పడింది.

బ్యారేజీలో నిల్వ ఉన్న నీటి ఒత్తిడితోనే కింది నుంచి ఇసుక, మట్టి కొట్టుకుపోయి భారీ బుంగ ఏర్పడినట్లు అధికారులు అభిప్రాయ పడుతున్నారు. మేడిగడ్డ పిల్లర్ల కింద ఈ బుంగ వ్యవహారం కలకలం రేపుతుండగా, మరమ్మతు పనులు చేపట్టిన ఎల్ అండ్ టీ సంస్థ మేడిగడ్డ వద్ద అనుమతి లేనిదే రాకపోకలకు వీలు లేదంటూ అక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేసింది. దీంతో మేడిగడ్డ వద్ద అసలు ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది.

కుంగిన పియర్ల పక్కనే బుంగ…!

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి దాదాపు రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. ఇందులో మేడిగడ్డ బ్యారేజీ కీలకమైంది కాగా ఇక్కడ మొత్తం ఎనిమిది బ్లాకులు, 85 గేట్లు ఏర్పాటు చేశారు. ఇదిలాఉంటే ఈ బ్యారేజీని ప్రారంభించిన నాలుగున్నర సంవత్సరాలకు గత ఏడాది అక్టోబర్ 21న లో పిల్లర్లు భూమిలోకి కుంగాయి. అక్కడ ఏడో బ్లాక్ లో ఉన్న 19, 20, 21వ పియర్స్(పిల్లర్స్) దెబ్బతినగా ఆ తరువాత మిగిలిన గేట్లను ఎత్తి బ్యారేజీలో ఉన్న నీటిని మొత్తం కిందికి వదిలేశారు.

ఏడో బ్లాక్ కుంగిపోయి ఉండటంతో ఆ బ్లాక్ లోని 15వ గేటు నుంచి 22వ గేట్ వరకు మొరాయించాయి. ఇదిలా ఉంటే ఏడో బ్లాక్ లోని 16వ గేటును తాజాగా పైకి ఎత్తేందుకు ఇరిగేషన్ అధికారులు ఇటీవల ప్రయత్నం చేయగా, బ్యారేజీ కింద భూభాగం నుంచి పెద్ద ఎత్తున శబ్ధాలు వినిపించాయి. దీంతో పనులు నిలిపి వేసిన అధికారులు గందరగోళంలో పడ్డారు. రిపేర్లు చేస్తున్న క్రమంలో భారీ బుంగ బయటపడటంతో బ్యారేజీ నిర్మాణ సమయంలో చేసిన పునాది సక్రమంగా వేయకపోవడం, సిమెంట్ కాంక్రీట్ పనులు నాసిరకంగా చేపట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ దాదాపు 12 వేల నుంచి 15 వేల క్యూబిక్ మీటర్ల మేర బొరియ ఏర్పడిందని అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలిసింది.

పూడ్చిన తరువాతే పనులు!

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎల్ అండ్ టీ కాంట్రాక్ట్ సంస్థ రెండు రోజుల కిందటే మరమ్మతు పనులు చేపట్టింది. ఇప్పటికే బ్యారేజ్ లోని 85 గేట్లలో 79 గేట్లను ఎత్తి ఉంచగా, కుంగిన ఏడో బ్లాక్ లో ఉన్న గేట్లు పెండింగ్ ఉన్నాయి. కానీ అక్కడి పరిస్థితుల దృష్ట్యా వాటిని ఒకేసారి ఎత్తలేని పరిస్థితి నెలకొంది. దీంతోనే ఇటీవల 15వ గేటును పైకెత్తి, మిగతా వాటిని ఎత్తేందుకూ ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే 16వ గేటు ఎత్తుతున్న క్రమంలోనే ఈ భారీ బుంగ వ్యవహారం బయటకు వచ్చింది. కాగా టన్నుల కొద్ది బరువున్న గేట్లను ఎత్తితే పియర్లు మరింత కుంగిపోయి పెను ప్రమాదమే సంభవించే అవకాశం ఉంది. ఓ వైపు భారీ శబ్ధాలు, మరో వైపు బుంగ పెద్దగా అవుతున్న నేపథ్యంలో దానిని పూడ్చిన తరువాతే పనులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులు కూడా నిర్ణయించారు.

మేడిగడ్డ గేట్లు క్లోజ్….

మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితుల నేపథ్యంలో సంబంధిత కాంట్రాక్ట్ సంస్థ ఎల్ అండ్ టీ అక్కడ రిస్ట్రిక్షన్స్ విధించింది. ఈ మేరకు మేడిగడ్డ గేట్లు క్లోజ్ చేసి, అక్కడికి ఎవరూ వెళ్లకుండా నిషేధాజ్ఞలు విధించింది.

అనుమతి లేని వ్యక్తులకు ఎవరికీ ప్రవేశం లేదంటూ క్లోజ్ చేసిన గేట్ల వద్ద బోర్డును కూడా ఏర్పాటు చేసింది. కాగా రిపేర్లు చేస్తున్న క్రమంలోనే భారీ బుంగ వ్యవహారం బయటపడటం, దాంతో మరమ్మతులు చేయాల్సిన సంస్థ గేట్లు క్లోజ్ చేసి ఎవరినీ అనుమతించకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దీంతో ప్రాజెక్టు భవిష్యత్తుపై నిపుణులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో తరచూ లోపాలు బయటపడటం, చిన్నపాటి వరద తాకిడికి కూడా భారీ బుంగలు ఏర్పడటం, పియర్లు కుంగడం తదితర లోపాల నేపథ్యంలో అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. కాగా ఇప్పటికే రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై వివిధ రకాల వాదనలు వినిపిస్తుండగా, లోపాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner

సంబంధిత కథనం