మేడిగడ్డ బ్యారేజీకి మూడేళ్లలోనే వ్యయం రెట్టింపు.. కాగ్ నివేదికలో చేదు నిజాలు.. 2019లోనే భారీ నష్టం-medigadda barrage cost doubles in 3 years where did the money go asks cag report ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  మేడిగడ్డ బ్యారేజీకి మూడేళ్లలోనే వ్యయం రెట్టింపు.. కాగ్ నివేదికలో చేదు నిజాలు.. 2019లోనే భారీ నష్టం

మేడిగడ్డ బ్యారేజీకి మూడేళ్లలోనే వ్యయం రెట్టింపు.. కాగ్ నివేదికలో చేదు నిజాలు.. 2019లోనే భారీ నష్టం

HT Telugu Desk HT Telugu
Feb 15, 2024 11:58 AM IST

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదికన తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం కుంగిపోయి చర్చనీయాంశమైన మేడిగడ్డ బ్యారేజీకి మూడేళ్లలోనే రెట్టింపు వ్యయం చేశారని వెల్లడించింది.

మేడిగడ్డ బ్యారేజీ
మేడిగడ్డ బ్యారేజీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ  కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చర్చనీయాంశమైంది. ఈ ప్రాజెక్టులో ప్రధానమైనది మేడిగడ్డ బ్యారేజి. ఈ బ్యారేజీ నిర్మాణానికి ఖర్చు మూడేళ్లలోనే రెట్టింపైనట్టు కాగ్ నివేదిక వెల్లడించింది. కాగ్ నివేదికను గురువారం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మేడిగడ్డ బ్యారేజీ అంచనా వ్యయం, అలాగే మొదట్లో చేసుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా మధ్య మధ్య పనులలో సర్దుబాట్లు చేయటం వల్ల అదనంగా రూ.  2472 కోట్ల భారం పడినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

భారీగా పెరిగిన అంచనా వ్యయం

తెలంగాణ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజి నిర్మాణాన్ని ఆగస్టు 2016న  ఒక కాంట్రాక్టర్‌కు అప్పగించింది. ఈ కాంట్రాక్టు ఒప్పందం విలువ రూ. 1849.31 కోట్లు. ఈ ఒప్పందం ప్రకారం బ్యారేజి నిర్మాణం 24 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

కానీ మార్పులు చేర్పుల పేరిట ఒప్పందంలో పేర్కొన్న ధరను రూ. 4321.44 కోట్లకు పెంచారు. అంటే ఏకంగా 2472.13 కోట్లు పెంచారు. అంటే మొదటి ఒప్పందం కంటే కూడా పెంచిన ధరే 135 శాతం ఉంది.

మేడిగడ్డకు 2019లోనే భారీ నష్టం

ప్రాజెక్ట్ లింక్ -1లో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో మూడు కొత్త బ్యారేజీలు నిర్మించారు. ఆగస్టు 2016లో పనులు మొదలవగా, జూన్ 2019 నాటికి ఈ మూడు బ్యారేజీల పనులు పూర్తయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీని 80,000 క్యూసెక్కుల వరద డిశ్చార్జ్ చేసే సామర్ధ్యంతో నిర్మించారు. అన్నారం బ్యారేజీని 65,000 క్యూసెక్కులు, సుందిళ్ల బ్యారేజీని 57,000 క్యూసెక్కుల డిశ్చార్జ్ సామర్థ్యంతో నిర్మించారు. బ్యారేజీల డిజైన్లు, వాటికి సంబంధించిన ఇతర నిర్మాణాలు ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్(ఐ అండ్ క్యాడ్) డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ ఆమోదించారు. 

అయితే నిర్మాణం పూర్తయిన కొన్ని నెలలకే  2019 నవంబరులో వరదలు రాగా బ్యారేజీల గేట్లు తెరిచి నీటిని కిందకు వదిలారు. గేట్లు మూసిన తరువాత బ్యారేజీల్లో కొన్ని నిర్మాణాలు కొట్టుకుపోయాయి. ఆర్సీసీ వేరింగ్ కోట్, సీసీ కర్టెన్ వాల్స్‌లో కొంత భాగం, బ్యారేజీ దిగువ భాగంలో నిర్మించిన సీసీ బ్లాక్స్ వరదలో కొట్టుకుపోయాయి. దీనివల్ల వాటిల్లిన నష్టం రూ. 180.39 కోట్లు. 

డ్యామేజీ పూడ్చడానికి రూ. 476 కోట్లు

వరద ఉధృతికి ఈ నిర్మాణాలు కొట్టుకుపోయాయని, ఆ ఉధృతిని తట్టుకునే సామర్ధ్యంతో వాటిని నిర్మించలేదని డిపార్ట్మెంట్ పరిశీలనలో తేలింది. జరిగిన నష్టాన్ని పూడ్చాలని నిర్మాణ ఏజెన్సీలను డిపార్ట్మెంట్ సంప్రదించింది. కానీ కాంట్రాక్టు ఏజెన్సీలు అందుకు తిరస్కరించాయి. 

డిపార్ట్మెంట్ ఆమోదించిన డిజైన్ల ప్రకారమే తాము వాటిని నిర్మించామని ఏజెన్సీలు పేర్కొన్నాయి. పైగా వాటికి క్వాలిటీ సెర్టిఫికెట్లు కూడా ఇచ్చారని చెప్పాయి. తరువాత మరికొన్ని పరిశీలనలు, అధ్యయనాలు జరిపిన తరువాత వీటి పునరుద్ధరణ కోసం డిపార్ట్మెంట్ రూ. 476.03 కోట్ల తో అంచనాలు రూపొందించింది.  

లాంచింగ్ ఆప్రాన్, సిమెంట్ కాంక్రీట్ బ్లాక్స్‌ను లోపభూయిష్టమైన డిజైన్లతో నిర్మించటం వల్లనే అవి వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. దానివల్ల వాటిల్లిన నష్టం 180.39 కోట్లు, దానికి అదనంగా మరమ్మతు ఖర్చు 476.03 కోట్లు. 

ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్ నిబంధనల ప్రకారం హెడ్ వర్క్స్ ఖర్చు‌లో ఒక శాతం మెయింటెనెన్స్‌కు ఖర్చు పెట్టాలి. ఇది ఒక ఏడాదికి అయ్యే ఖర్చు. ఏడాదికి అయ్యే ఖర్చును తగ్గించటానికి డిపార్ట్మెంట్ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఒప్పందాల విలువల ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఖర్చు రూ. 4550.40 కోట్లు. ఇది పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఏడాదికి ఈ మూడు బ్యారేజీల హెడ్ వర్క్స్ నిర్వహణ వ్యయం మొత్తం రూ. 45 కోట్లు మాత్రమే. 

సీనరేజి, రాయల్టీ చార్జీలలోను అధిక చెల్లింపులు 

నిర్మాణ సామాగ్రి కొనుగోలులో కాంట్రాక్టర్ చెల్లించిన సీనరేజి చార్జీలను అగ్రిమెంట్ ప్రకారం ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. ఆ ప్రకారం మర్చి 2020న కాంట్రాక్టరుకు రూ. 73.23 కోట్లు ప్రభుతం చెల్లించింది. 

బ్యారేజీ నిర్మాణంలో కొంత భాగం మహారాష్ట్రలో ఉంది. అక్కడ చేపట్టిన నిర్మాణంలో వాడిన 4.71 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకకు ప్రభుత్వం చెల్లించిన రాయల్టీ చార్జీలు రూ. 14.63 కోట్లు కూడా ఈమొత్తంలో కలిసి ఉంది.

ఆ ఇసుకకు డిపార్ట్మెంట్ రూ. 880 / brass రేటు చొప్పున రీయింబర్సు చేసింది. దీనికి అదనంగా 10 శాతం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కూడా చెల్లించింది. కానీ మర్చి 2015 న మహారాష్ట్ర రెవిన్యూ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇసుక మీద రాయల్టీ చార్జీలు రూ 400 / brass మాత్రమే. 

ఎటువంటి ధ్రువీకరణ లేకుండా మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా కలెక్టర్ పంపిన డిమాండ్ నోటీసు ఆధారంగా ప్రభుత్వం ఇసుక రాయల్టీ చెల్లించింది. అయితే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ధరల ప్రకారం ఆ జిల్లా కలెక్టర్ ఈ డిమాండ్ నోటీసు తయారు చేశారు. దీనివల్ల రాయల్టీ చార్జీలలో ప్రభుత్వం పై పడిన అదనపు భారం 7.32 కోట్లు.

WhatsApp channel