CM Revanth Reddy : మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ - సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
CM Revanth Reddy News: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శనివారం మండలిలో మాట్లాడిన ఆయన.. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశిస్తామని చెప్పారు.
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై విచారణ జరిపిస్తామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శనివారం శాసనమండలిలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి... ఈ అంశాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందర్ని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పర్యటనకు తీసుకువెళ్తామని చెప్పారు. ఎందుకు కుంగిపోయింది, ఏం జరిగిందనే దాని గురించి తెలుకునే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. కాంట్రాక్టులు ఎవరు ఇచ్చారు..? వారి వెనుక ఉన్నవారెవరు..? ఎవరు? కాంట్రాక్టులు చేసిన తప్పులెంటి..? వంటి అంశాలను నిగ్గు తేల్చేందుకు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పారు. అప్పుడు అన్ని విషయాలు విచారణలో బయటకు వస్తాయని కామెంట్స్ చేశారు.
ఇప్పటికే తమ పార్టీ తరపున ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారని... ప్రభుత్వంలోని మంత్రులతో కూడా మాట్లాడి.. విచారణపై ప్రకటన చేస్తామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
స్వేచ్ఛకోసమే ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉక్కు కంచెలు వేసుకుని ఇన్ని రోజులు ప్రజలకు దూరమయ్యారని... ఇప్పుడు ప్రజావాణిని వింటున్నాం.. ప్రజావాణితో మార్పును తెచ్చామని చెప్పారు. గత ప్రభుత్వంలో పేదలకు ఆరోగ్య శ్రీ అందలేదని విమర్శించారు. పాతబస్తీకి మెట్రో రైలు తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని... మురికి మూసీని ప్రక్షాళన చేసి జీవనదిగా మారుస్తామని ప్రకటన చేశారు. ఈ ప్రభుత్వానికి ఎవరైనా.. ఎప్పుడైనా సూచనలు ఇవ్వొచ్చని.. ప్రభుత్వం అంటే పాలకపక్షం, ప్రతిపక్షం అని చెప్పుకొచ్చారు.
సంబంధిత కథనం