Sri rama navami 2024: శ్రీరామనవమికి అయోధ్యలో అద్భుత దృశ్యం.. శ్రీరాముడికి సూర్య తిలకం
Sri rama navami 2024: ఈ ఏడాది శ్రీరామనవమికి అయోధ్యలో అద్భుతమైన దృశ్యం కనువిందు చేయబోతుంది. ప్రత్యేకమైన టెక్నాలజీతో బాలరాముడి నుదిటిపై సూర్య తిలకం పడేలా ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని పనులు పూర్తి చేశారు.

Sri rama navami 2024: రామ జన్మభూమి అయోధ్యలోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు జరిపించేందుకు సర్వం సిద్ధం చేశారు. అయోధ్యలోని రామాలయంలో ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా అరుదైన దృశ్యం భక్తులకు కనువిందు చేయబోతుంది.
శ్రీరామనవమి రోజు ఆలయాన్ని దర్శించే భక్తులు ఈ అరుదైన ఘట్టాన్ని వీక్షించే అవకాశం లభిస్తుంది. నవమి రోజు శ్రీరాముడికి సూర్య తిలకం పడేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించి సోమవారం ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. శ్రీరామనవమి రోజు సూర్యుడి కిరణాలు నేరుగా రామ్ లల్లా విగ్రహం నుదుటి మీద పడేలాగా ఏర్పాటు చేశారు. లెన్స్ ప్రత్యేక అద్దాల సహాయంతో ఈ ప్రత్యేక వ్యవస్థ రూపొందించి సూర్య తిలకం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ట్రస్ట్ అధికారులు వెల్లడించారు. శ్రీరామనవమి రోజు మాత్రమే ఈ అద్భుతం జరుగుతుంది.
ఎన్ని గంటలకు చూడొచ్చు?
శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్రక్రియ మొదలు కాబోతుంది. సుమారు నాలుగు నిమిషాల పాటు గర్భగుడిలోని శ్రీరాముని విగ్రహం నుదుటి మీద సూర్యకిరణాలు పడేలాగా ఏర్పాట్లు చేశారు. ఈ టెక్నాలజీని సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలో సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూపొందించింది. సోమవారం దీనికి సంబంధించి ట్రయల్ రన్ నిర్వహించారు. పరిశోధకుల కృషి ఫలించి సరిగా శ్రీరాముడి నుదుటి మీద సూర్యకిరణాలు పడ్డాయి. ఈ విషయాన్ని పరిశోధకుల బృందం, ఆలయ ట్రస్ట్ అధికారులు మంగళవారం ధ్రువీకరించారు.
సూర్య కిరణాలు బాలరాముడి నుదుటిపై ప్రసరించే విధంగా ప్రత్యేక కటకాలు అద్దాలు, గేర్ బాక్సులు, గొట్టాలు ఏర్పాటు చేశారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలోనే శ్రీరాముడు జన్మస్థలంలో శ్రీరామనవమి వేడుకలు కనుల పండుగగా జరగబోతున్నాయి. బాల రాముడికి సూర్య తిలకం పడేలా చేయడం కోసం రెండు పెద్ద అద్దాలు, మూడు పెద్ద లెన్స్ లు వేరువేరు చోట్ల ప్రత్యేక కోణాల్లో ఏర్పాటు చేశారు.
సూర్యకిరణాలు ప్రసరించేలా చేసేందుకు అద్దాలను ఉపయోగించారు. సూర్య తిలకం కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక వ్యవస్థలో ఎటువంటి ఉక్కు, ఇనుము, బ్యాటరీలు, విద్యుత్తు వాడలేదు. మూడో అంతస్తు నుంచి సూర్యకిరణాలు గర్భగుడిలోనే విగ్రహం వరకు ప్రసరించేలా ఈ పరికరాలు అమర్చారు. మధ్యాహ్నం 12 గంటలకు సూర్య కిరణాలు మూడో అంతస్తు పై భాగంలో ఏర్పాటు చేసిన కటకాల ద్వారా ప్రసరించి ఆలయం గర్భగుడిలోని బాలరాముడు నుదుటి మీద తిలకంగా వృత్తాకారంలో ప్రతిబింబిస్తుంది. ఇందుకోసం రామాలయంలోనే మూడో అంతస్తులు నుంచి గర్భగుడి విగ్రహం వరకు పైపింగ్, ఆప్టికల్ మెకానికల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఎలా వీక్షించాలి?
ఈ అరుదైన దృశ్యం చూడలేకపోతున్నామని బాధపడాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇంట్లో ఉండే ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చు. అయోధ్యలో బాల రాముడు సూర్య తిలకం చూసేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆలయం వెలుపల సుమారు 100 ఎల్ఈడీలతో ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాటు చేసింది. ప్రాణ ప్రతిష్ట తరహాలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ దృశ్యాన్ని దూరదర్శన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. ఇక నుంచి ప్రతీ సంవత్సరం శ్రీరామనవమి రోజున రాములల్లా విగ్రహానికి సూర్యకిరణాలతో తిలకం వేయనన్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.