హనుమంతుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? ఏ శ్లోకం చదవాలి?
ఆంజనేయ స్వామి ఆలయంలో ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలన్న సందేహం వస్తుంటుంది. ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వర రావు పలు మార్లు తన ప్రవచనంలో దీనిని నివృతి చేశారు.
భక్తులు ఆంజనేయ స్వామిని మంగళ వారం, శనివారం రోజుల్లో ఆలయానికి వెళ్లి ప్రార్థిస్తుంటారు. అయితే చాలా మంది హనుమాన్ మందిరంలో ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలన్న సందేహం వ్యక్తం చేస్తుంటారు. ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వర రావు పలు మార్లు తన ప్రవచనంలో దీనిని నివృతి చేశారు.
ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయాలని సంకల్పిస్తే తాను ఆలయానికి వస్తున్నానని స్వామి వారికి నివేదించుకోవాలి. ప్రదక్షిణలు దోషం లేకుండా పూర్తిచేసేలా దీవించమని మనసులో కోరుకోవాలి.
హనుమంతుడికి 108 ప్రదక్షిణలు చేయాలి. ఒక్కో ప్రదక్షిణను పువ్వులు లేదా వక్కలతో లెక్కించాలి. అంతేగానీ ఏది పడితే దానితో లెక్కించకూడదు. వక్కలైతే ఒక డబ్బాలో వాటిని ఉంచి ఖాళీ డబ్బాలో వేస్తూ ఉండాలి. పూవులైతే ఒక్కొక్కటి ధ్వజస్తంభం వద్ద పెడితే సరిపోతుంది.
108 ప్రదక్షిణలు చేయలేకపోతే..
ఒకవేళ 108 ప్రదక్షిణలు చేసేందుకు మీ శరీరం సహకరించని పక్షంలో 54 ప్రదక్షిణలు చేయాలి. అందుకు కూడా వీలు కాకపోతే అందులో సగం.. అంటే 27 ప్రదక్షిణలు చేయాలి. అది కూడా వీలు కాని వారు 11 ప్రదక్షిణలు చేయాలి. అవి కూడా చేయలేని వారు 5 ప్రదక్షిణలు చేయాలి.
అందుకు కూడా శరీరం సహకరించలేని వారు 3 ప్రదక్షిణలు లేదా 1 ప్రదక్షిణ చేయాలి. చేయలేననుకుంటే ప్రార్థనా శ్లోకం చెప్పాలి. ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజున తప్పకుండా ఆలయానికి వెళ్లి ఈ 108 ప్రదక్షిణలు చేయాలని చాగంటి సూచించారు.
స్వామి వారికి ప్రదక్షిణలు చేసేటప్పుడు చదవాల్సిన మంత్రం
ఆంజనేయం మహావీరం
బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్కం ప్రభం శాంతం
ఆంజనేయం నమామ్యహం
అనే శ్లోకం చదువుతూ 108 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఒక ప్రదక్షిణ పూర్తయ్యాక ఈ శ్లోకం చదవాలి. అలా ప్రతి ప్రదక్షిణ పూర్తయ్యాక స్వామి వారి ముందుకు వచ్చినప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలి.
ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేస్తే ఆయన అనుగ్రహంతో ఎటువంటి కోర్కెలనైనా తీర్చుతాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రదక్షిణలు చేయడాన్ని హనుమంతుడు ఇష్టపడుతారని, ఎలాంటి రోగాలనైనా హరిస్తాడని ప్రతీతి.
ధర్మబద్ధమైన, ధార్మిక కోరికలను హనుమంతుడు తీర్చుతాడని పెద్దలు చెబుతారు. రామనామాన్ని రాయడం అలవాటు చేసుకున్నా, రామనామాన్ని కీర్తించినా, రామనామాన్ని పలికినా హనుమంతుడు ప్రసన్నుడు అవుతాడని చాగంటి కోటేశ్వర రావు ప్రవచించారు.