Lord hanuman: మహిళలు ఆంజనేయ స్వామి విగ్రహం పాదాలు తాకకూడదు.. ఎందుకో తెలుసా?-why women does not touch lord hanuman idol feet what is the reason ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Hanuman: మహిళలు ఆంజనేయ స్వామి విగ్రహం పాదాలు తాకకూడదు.. ఎందుకో తెలుసా?

Lord hanuman: మహిళలు ఆంజనేయ స్వామి విగ్రహం పాదాలు తాకకూడదు.. ఎందుకో తెలుసా?

Gunti Soundarya HT Telugu
Mar 14, 2024 05:30 PM IST

Lord hanuman: ప్రతి ఒక్కరూ పూజ చేసిన తర్వాత దేవుళ్ళ పాదాలు తాకుతారు. ఆశీర్వాదం తీసుకుంటారు. కానీ మహిళలు మాత్రం అంజనేయుడిని పూజించిన తర్వాత విగ్రహం పాదాలు తాకకూడదు. అది ఎందుకో తెలుసా?

ఆంజనేయ స్వామి పాదాలు మహిళలు తాకకూడదు
ఆంజనేయ స్వామి పాదాలు మహిళలు తాకకూడదు (pixabay)

Lord hanuman: ధైర్యం, అపారమైన శక్తిని ఇవ్వమని కోరుకుంటూ ప్రతీ ఒక్కరూ హనుమంతుడిని పూజిస్తారు. ఆంజనేయ స్వామి చిరంజీవి. కలియుగంలో కూడా బతికే ఉన్నాడని కొందరు నమ్ముతారు. అటువంటి అంజనేయుడిని పూజించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజిస్తారు. ఆయన పూజించడం వల్ల జీవితంలోని అన్ని బాధలు, కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుందని అంటారు.

కొంతమంది ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ ఆయన ఆరాధించేందుకు వ్రతాలు, పూజలు చేస్తారు. ఆంజనేయ మాల ధరిస్తారు. ఈ దీక్ష చేపట్టిన తర్వాత పురుషులు ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉంటారు. నిత్యం ధ్యానం చేస్తూ మంత్రాలు జపిస్తారు. అయితే హనుమంతుడిని పూజించే విషయంలో మహిళలకు మాత్రం కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. పూజ చేసే సమయంలో హనుమంతుడి విగ్రహం పాదాలు మహిళలు తాకకూడదు. దీని వెనక ఒక కారణం కూడా ఉంది.

హనుమంతుని విగ్రహాన్ని మహిళలు ఎందుకు తాకకూడదు

ఈ ఆచారం వెనక ఒక మతపరమైన కథ దాగి ఉంది. మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి. అయితే కొన్ని గ్రంథాల ప్రకారం హనుమంతుడికి వివాహం జరిగిందని, పుత్రుడు కూడా ఉన్నాడని చెబుతారు. అయితే హనుమంతుడి వివాహం చేసుకున్నాడు కానీ అతను వైవాహిక ఆనందం కోసం పెళ్లి చేసుకోలేదు. ఆధ్యాత్మికంగా బలపడేందుకు చేసుకున్నాడు. నాలుగు ప్రధాన జ్ఞానాలు సంపాదించుకోవడం కోసం వివాహం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే వివాహితులు మాత్రమే ఈ జ్ఞానాన్ని పొందగలరు.

సూర్య భగవానుడు హనుమంతుడికి తొమ్మిది ప్రధాన విద్యలలో ఐదు నేర్పించారు. మిగిలిన నాలుగు విద్యల గురించి అడిగితే అవి కేవలం పెళ్లయిన వ్యక్తులకు మాత్రమే నేర్పించాలని సూర్య దేవుడు చెప్తాడు. అయితే హనుమంతుడు బ్రహ్మచారి కావడం వల్ల ఆలోచనలో పడతాడు. విద్యలు నేర్చుకునేందుకు తన గురువు ఆజ్ఞ పాటించి పెళ్లికి సిద్ధమవుతాడు.

సూర్యదేవుడు తన అందమైన కుమార్తె సువర్చలతో హనుమంతుడి వివాహాన్ని జరిపించాడు. సువర్చల గొప్ప తపస్వి. వివాహమైన వెంటనే ఆమె తపస్సులో మునిగిపోయింది. వివాహం జరగడంతో హనుమంతుడు సూర్యుడు దగ్గర నుంచి మిగతా నాలుగు విద్యలను నేర్చుకున్నాడు. అలా తన కోరిక నెరవేర్చుకున్నాడు. హనుమంతుడు పెళ్లి చేసుకున్నప్పటికీ అతని బ్రహ్మచర్యం విచ్ఛిన్నం కాలేదు. హనుమాన్ బ్రహ్మచారి అయినప్పటికీ ఒక కుమారుడుని కలిగి ఉన్నాడని అతని పేరు మకరద్వజుడు అని పురాణాలు చెబుతున్నాయి.

హనుమంతుడు ప్రతి స్త్రీని తన తల్లిగా భావిస్తాడు. ఆడవాళ్ళకి తల్లి హోదా కల్పించాడు. జీవితాంతం బ్రహ్మచర్యాన్ని అనుసరించాడు. ప్రతి స్త్రీలో తన తల్లిని చూసుకున్నాడు. తల్లిగా భావించే ఆడవాళ్ళు కొడుకు పాదాలు స్పురించరాదని అంటారు. అందుకే మహిళలు హనుమంతుని విగ్రహాన్ని తాకరు. ఆచారాల ప్రకారం మాత్రం పూజ చేయవచ్చు. దీపాలు వెలిగించవచ్చు. అలాగే హనుమాన్ చాలీసా పఠించవచ్చు కానీ పాదాలు మాత్రం మొక్కకూడదు.

హనుమంతుడిని ఆరాధిస్తే శనీశ్వరుడి అనుగ్రహం కూడా పొందుతారు. పురాణాల ప్రకారం శని పట్టని దేవుళ్ళలో ఆంజనేయ స్వామి ఒకరు. అందుకే అంజనేయుడిని పూజిస్తే శని అనుగ్రహం కూడా ఉంటుంది.

Whats_app_banner