Hanuman Jayanthi Special | హనుమంతుడు సంజీవని తెస్తుంటే కొండగట్టులో విరిగిపడిందా?-hanuman jayanthi 2022 history of kondagattu anjanna temple ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hanuman Jayanthi Special | హనుమంతుడు సంజీవని తెస్తుంటే కొండగట్టులో విరిగిపడిందా?

Hanuman Jayanthi Special | హనుమంతుడు సంజీవని తెస్తుంటే కొండగట్టులో విరిగిపడిందా?

HT Telugu Desk HT Telugu
Published May 25, 2022 06:15 PM IST

హనుమాన్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా.. అంజనీపుత్రుడి నామస్మరణే. ఇక కొండగట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకు కొండగట్టుకు భక్తులు ఎక్కువగా వస్తారు? దాని వెనక ఉన్న చరిత్రేంటి?

<p>ప్రతీకాత్మక చిత్రం</p>
ప్రతీకాత్మక చిత్రం

నమ్మినబంటు హనుమంతుడు.. పరాక్రమానికి ప్రతీక ఆయన. అనేకమంది భక్తులు హనుమాన్ దీక్షలు తీసుకుంటారు. దీక్ష విరమణ కోసం ఎక్కువగా తెలంగాణలోని కొండగట్టుకు వస్తుంటారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి దగ్గరలో ఈ ప్రాంతం ఉంది. వందల ఏళ్ల నుంచి.. ఇక్కడ హనుమంతుడిని కొలుస్తుంటారు. కొండగట్టు అంజన్నగా ఇక్కడ దేవాలయం ప్రసిద్ధి. స్వయంభుగా హనుమంతుడు వెలిశాడని చెబుతుంటారు. దీని వెనక అనేక కథలు ఉన్నాయి.

పూర్వం రామ రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడు మూర్చపోతాడు. అయితే ఆయనను స్పృహలోకి తెచ్చేందుకు సంజీవని కోసం హనుమంతుడు బయలుదేరుతాడు. అంజనీపుత్రుడు సంజీవని పర్వతం చేతుల్లో పట్టుకుని గాల్లో వస్తుంటే.. ముత్యంపేట దగ్గరలో ఓ ముక్క పడిందని ఇక్కడ ఓ కథ ప్రసిద్ధి. ఆ భాగాన్నే కొండగట్టుగా పర్వత భాగంగా చెబుతుంటారు. ఇక్కడి కొండల్లో ఎన్నో ఔషధ మెుక్కలు కూడా ఉన్నాయి. కోతులు దండు కూడా ఎక్కువగానే ఉంటుంది.

ఆ తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత.. ముత్యంపేట గ్రామానికి చెందిన సింగం సంజీవుడు అనే పశువుల కాపరి అదే అడవిలోకి ఓ రోజు వెళ్తాడు. ఆవులను మేపుతుండగా.. ఒక ఆవు కనిపించకుడా పోతుంది. ఇక సంజీవుడు ఆ ఆవును వెతుక్కుంటూ.. ఇప్పటి కొండగట్టు ప్రదేశానికి వస్తాడు. ఎండ విపరీతంగా ఉండటం కారణంగా అలసిపోయి ఓ చెట్టుకిందకు చేరుతాడు. నిద్రపోతుండగా.. కలలో ఆంజనేయుడు కనిపిస్తాడు. 

నేను తంబోర పొదలో ఉన్నాను. నాకు గుడి కట్టించు. తప్పిపోయిన ఆవు ఏ ప్రదేశంలో  ఉందో అని  చెప్పాడని కథ చెబుతుంటారు. మెలకువ వచ్చాక సంజీవుడు వెళ్లి.. కలలో కనిపించిన స్వామి చెప్పిన పొదల దగ్గరకు వెళ్లి చూస్తాడు. వెలిగిపోతున్న హనుమంతుడి విగ్రహం కనిపిస్తుందట. ఆ తర్వాత కొండగట్టులో హనుమంతుడి గుడి కట్టించాడని చరిత్ర చెబుతోంది.

ఆంజనేయుడి గుడిలో 40 రోజులు పూజ చేస్తే మానసికంగా ఎదగని వాళ్ల ఆరోగ్యం బాగుపడుతుందని, పిల్లలు లేనివాళ్లకు సంతానం కలుగుతుందని నమ్ముతంటారు భక్తులు. అక్కడకు వెళ్తే కూడా మీకు అర్థఅవుతుంది. అలాంటి వాళ్లు చాలామంది కనిపిస్తుంటారు. హనుమాన్ దీక్ష తీసుకున్న చాలామంది భక్తులు కొండగట్టులో దీక్ష విరమిస్తారు.

అయితే కొండగట్టులో హనుమంతుడికి ప్రత్యేకత ఉంటుంది. ఎక్కడా లేని విధంగా రెండు ముఖాల (నరసింహస్వామి, ఆంజనేయుడు)తో ఉంటాడు. ఛాతి మీద సీతారాముల విగ్రహాలు సైతం ఉంటాయి. పక్కనే ఉన్న సీతమ్మ బావిలోని నీళ్లతో స్వామివారికి అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తుంది. గర్భాలయానికి కుడివైపు వెంకటేశ్వర స్వామి, ఆండాల్ ఎడమవైపు శివపంచాయతన ఆలయం ఉంటాయి. గుడి ప్రధాన గోపురానికి రెండు వైపులా ఏనుగు బొమ్మలు, గోపురం మీద ఆంజనేయుడి విగ్రహాలు ఉంటాయి. గుడికి దగ్గరలో ఉన్న బేతాళ స్వామికి కోళ్లు, మేకలు కోసి, కల్లు సాక పోసి మొక్కులు చెల్లించుకుంటారు.

Whats_app_banner

సంబంధిత కథనం