Types of sons: కలియుగంలో కుటుంబ వ్యవస్థలలో అనేకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సంవత్సరాలుగా సుపుత్రుడు పున్నామ నరకం నుండి రక్షించువాడు కుమారుడు. కేవలం కుమారుడుంటే ఆ వంశానికి ఆ తండ్రికి వృద్దాప్యంలో కూడా అనుకూల విధముగా ఉంటుందనే భావన అనేక మందిలో సహజంగా ఉంటుంది. అయితే సనాతన ధర్మం ప్రకారం శాస్త్రాల ప్రకారం ఐదు రకాల పుత్రులు ఉంటారని ఏ ఇంటిలో అయినా ఒక తండ్రికి కుమారుడు ఉంటే ఈ ఐదు రకాలలోకే అటువంటి కుమారుడు వర్తిస్తాడని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
1. శత్రు పుత్రుడు :- ఇతడు చిన్నతనం నుంచి తండ్రి చేసే ప్రతి పనికి వ్యతిరేకిస్తూ ఏ పనితోను తండ్రికి ఆనందం కలిగించకపోవడమే కాక తండ్రి మరణించే వరకు ప్రతి పనితోను తండ్రిని బాధిస్తూనే ఉంటాడు. గత జన్మలలో ప్రబలమైన శత్రుత్వం కలవాడే ఈ జన్మలో శత్రు పుత్రుడిగా జన్మిస్తాడని అంటారు.
2. మిత్ర పుత్రుడు :- ఇతడు చిన్నతనం నుంచి తండ్రితో ఒక స్నేహితుని వలె సంబంధాన్ని కొనసాగిస్తాడు. కానీ ఈ పుత్రుడు తండ్రికి ఇచ్చే ఏ సంతోషాన్ని అతడు తండ్రికి ఇవ్వలేడు. గత జన్మలలో ఆప్త మిత్రుడు అయిన వాడే ఈ జన్మలో మిత్ర పుత్రుడుగా జన్మిస్తాడు.
3. సేవక పుత్రుడు :- ఇతడు అన్ని విషయాలలోనూ రాణించకపోయినా తండ్రి చెప్పిన మాటని తుచ తప్పకుండా పాటిస్తాడు. తండ్రి చేయవలసిన పనులను కూడా ఇతడు చేస్తూ ఉంటాడు. తండ్రికి కేవలం సేవ చేయడానికి మాత్రమే జన్మిస్తాడు. పూర్వ జన్మలో సేవకుడిగా ఉండి యజమాని నుండి పొందిన లబ్దికి కృతజ్ఞత పూర్వకంగా తన జీవితాంతం ఉండి ఈ జన్మలో సేవక పుత్రుడుగా జన్మిస్తాడు.
4. కర్మ పుత్రుడు :- ఇతడు కేవలం ఒక కొడుకుగా తండ్రికి చేయవలసిన కర్మ కొరకు మాత్రమే జన్మిస్తాడు. చిన్నతనం నుంచి తండ్రికి దూరంగానే ఉంటాడు. అప్పుడప్పుడు తప్ప మిగిలిన అన్ని సందర్భాలలో తండ్రికి దూరంగానే ఉంటాడు. కేవలం అంత్యేష్టి కొరకు మాత్రమే జన్మిస్తాడు. ఇతడిని కర్మ పుత్రుడు అంటారు.
5. నిజ పుత్రుడు :- ఇతడు పుట్టిన దగ్గర నుంచి తన ప్రతి పని తండ్రిని ఆనందింపచేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటాడు. ఇతడిని విడిచి తండ్రి క్షణ కాలం కూడా బ్రతుకలేడు. చివరికి తన అంత్య కాలమునందు కూడా తనకొడుకు చేతిలోనే సంతోషంగా ఏ బాధ లేకుండా అనాయాసమైన మరణాన్ని తన తనయుడి ఒడిలోనే పొందుతాడు. మర్చిపోకుండా మాసికం పెడతాడు. తప్పకుండా తద్దినం పెదతాడు. గయ లో శార్ధం పెడతాడు. తండ్రికి పుణ్యలోకాలు కలిగేలా చేస్తాడు.
ప్రతి క్షణం ప్రతి పనిలోనూ తన తండ్రినే స్మరిస్తాడు. అరమరికలు లేకుండా తండ్రి పోలికల తోటే ఉండి తండ్రిలాగే ప్రవర్తిస్తూ తండ్రి కోసమే బ్రతుకుతాడు. ఇతడిని మాత్రమే మన ధర్మ శాస్త్రాలు నిజ పుత్రుడు అన్నాయి. వారి కర్మలను బట్టి వారి పాపపుణ్యాలను బట్టి ఈ ఐదు రకాల నుండే ఏదో ఒక రూపంలో శాస్త్ర ప్రకారం పుత్రుడు కలుగుతాడని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.