Hydrating Drinks । ఈ వేసవిలో నీరు కాకుండా మీరు తాగాల్సిన మరిన్ని పానీయాలు ఇవే!-5 best hydrating drinks besides water to take in this summer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hydrating Drinks । ఈ వేసవిలో నీరు కాకుండా మీరు తాగాల్సిన మరిన్ని పానీయాలు ఇవే!

Hydrating Drinks । ఈ వేసవిలో నీరు కాకుండా మీరు తాగాల్సిన మరిన్ని పానీయాలు ఇవే!

HT Telugu Desk HT Telugu
Apr 11, 2023 05:34 PM IST

Hydrating Drinks: ఈ వేసవిలో మిమ్మల్ని మీరు హైడ్రేటింగ్ గా, చల్లగా ఉంచుకోవడానికి ఇలాంటి ఆరోగ్యకరమైన పానీయాలు తాగండి.

Hydrating Drinks:
Hydrating Drinks: (Unsplash)

Hydrating Drinks: ప్రతిరోజూ సమృద్ధిగా నీరు త్రాగాలని మనందరికీ తెలుసు. ఈ ఎండాకాలంలో (summer) మీరు ఆరోగ్యంగా ఉండాలంటే నీరు (Drinking water)తప్పనిసరి. కానీ దాహం వేయనపుడు నీరు త్రాగాలని గుర్తుకురాదు, పదేపదే నీరు త్రాగాలి అని అనిపించదు కూడా. అయితే మిమ్మల్ని మీరు హైడ్రేటింగ్ గా ఉంచుకోవడానికి కేవలం నీరు మాత్రమే తాగవలసిన అవసరం లేదు. రుచికరమైన, ఆరోగ్యకరమైన పండ్లు, పండ్ల రసాలు, ఇతర పానీయాలు కూడా తాగవచ్చు.

సీజనల్ కూరగాయలైన దోసకాయ, క్యారెట్, క్యాలీఫ్లవర్, బ్రోకలీ, పాలకూరలను ఆహారంగా తీసుకోవడం. పుచ్చకాయ, సీతాఫలం, మామిడి, లిచీలు, ద్రాక్ష వంటి పండ్లు (Water-rich Fruits) తినడం చేయాలి. వీటిలో నీటిశాతం ఎక్కువ ఉంటుంది, పోషకాలు దండిగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అదే సమయంలో అల్కాహాల్, కెఫీన్ వంటి పానీయాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మరింత డీహైడ్రేషన్ (Dehydration) కలిగిస్తాయి. మీరు ఈ ఎండాకాలంలో చురుకుగా, ఆరోగ్యంగా ఉండేందుకు నీరు కాకుండా ఇంకా ఎలాంటి పానీయాలు తాగవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

Coconut Water- కొబ్బరి నీరు

వేసవికి కొబ్బరి నీరు సరైన పానీయం. ఇది తక్షణమే మిమ్మల్ని హైడ్రేట్ చేస్తుంది, శరీరాన్ని చల్లబరిచే సహజ శీతలకరణిగా పనిచేస్తుంది. కొబ్బరినీళ్లలో మీకు తక్షణ శక్తిని అందించగల ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. రోజుకు 1 గ్లాసు కొబ్బరి నీరు మీ వేసవి బాధలను దూరం చేస్తుంది.

Lemonade- నిమ్మకాయ షర్బత్

వేసవిలో కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ కు బదులు నిమ్మకాయ షర్బత్ తాగండి. ఇది ఈ వేసవిలో తాగాల్సిన ఉత్తమ పానీయాలలో ఒకటి.ఒక గ్లాసు నిమ్మరసం కలిపిన నీటిలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇందులో కొన్ని పుదీనా ఆకులు, జీలకర్ర పొడి, కొద్దిగా రాళ్ల ఉప్పు, కొన్ని నానబెట్టిన చియా గింజలు మొదలైన పదార్థాలను కలిపి మరింత రుచికరమైన, ఆహ్లాదకరమైన పానీయంగా మార్చవచ్చు.

Buttermilk - మజ్జిగ

వేసవిలో పెరుగు, మజ్జిగలు తప్పకుండా తీసుకోవాలి. మజ్జిగను అనేక రకాలుగా రుచికరమైన పానీయం చేయవచ్చు. పెరుగులో 1 భాగం తీసుకుని దానికి 4 భాగాలు నీరు కలిపి బాగా చిలకాలి. ఆ తరవాత అందులో కొత్తిమీర, చిటికెడు ఉప్పు, జీలకర్ర పొడి వేసుకొని తాగితే మీ కడుపు చల్లగా ఉంటుంది.

Mango Jal Jeera- మామిడి జల్జీరా

పుల్లని మామిడికాయను నీటిలో ఉడికించి, ఆపైన అది చల్లబడ్డాక దాని గుజ్జును తీసుకొని అందులో 2 టీస్పూన్ల జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, కొద్దిగా కారం, కొన్ని పుదీనా ఆకులు, రుచికోసం బెల్లం పొడి, కొన్ని నీళ్లు కూడా కలిపి అన్నింటినీ మిక్సీ గ్రైండర్‌లో వేసి పానీయం చేసుకొని తాగితే అద్బుతంగా ఉంటుంది.

Sattu Drink- సత్తు పానీయం

వేయించిన శనగపప్పు, కొన్ని ఎండుద్రాక్షలు, బెల్లం కలిపి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీస్పూన్ గ్లాసు నీళ్లలో కలిపి తాగితే మీకు మంచి శక్తి లభిస్తుంది. ఈ ఎండాకాలంలో మీకు అలసట అనేదే ఉండదు.

Whats_app_banner

సంబంధిత కథనం