ఆకుపచ్చని ఆకుకూరల్లో ఒకటైన పాలకూరలో పోషకాలు పుష్కలం. ఇది విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో మీ శరీరానికి సహజంగా పోషక శక్తిని అందిస్తుంది. పాలకూరను ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. చాలామంది పాలకూరను వండుకొని తినడానికే ఇష్టపడతారు. అయితే ఎక్కువగా వండటం లేదా ఉడికించటం వలన అందులోని పోషకాలు కోల్పోవచ్చు. బదులుగా స్మూతీలలో చేర్చుకోవడం లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం ఉత్తమం అని కొన్ని అధ్యయనాలు తెలిపాయి.
పాలకూరను మిక్సర్‌లో వేసి,కొన్ని నీళ్లు, నిమ్మకాయ రసం ఇతర సుగంధ ద్రవ్యాలను కలపడం వలన రుచికరమైన జ్యూస్ సిద్ధం అవుతుంది. ఈ జ్యూస్ తాగడం వలన కంటిచూపును మెరుగుపరచటం నుంచి రక్తహీనతను నివారించటం వరకు అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
పాలకూర జ్యూస్ క్రమంతప్పకుండా తాగడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చూడండి.
పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయని మీకు తెలుసు, అంటే ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడగలవు, తద్వారా మీ శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి, దీర్ఘకాలిక వ్యాధుల నుండి కాపాడుతుంది
పాకూర నీటిలో సహజంగా లభించే నైట్రేట్‌లు అధికంగా ఉంటాయి, ఇది మీ రక్తనాళాలను విస్తరించడంలో సహాయపడే ఒక రకమైన సమ్మేళనం. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది, రక్త ప్రసరణను పెంచుతుంది. గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.
క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో కూడా పాలకూర జ్యూస్ మేలు చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పాలకూరలోని పోషకాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా నాశనం చేస్తాయి. పచ్చని ఆకుకూరలు తినడం వల్ల ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
పాలకూర జ్యూస్ తాగడం ద్వారా లుటిన్, జియాక్సంతిన్ అనే రెండు ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి మీ కంటి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. ఇంకా పాలకూరలో విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. విటమిన్ ఎ లోపం ఉన్నట్లయితే కళ్లు పొడిబారడం, రేచీకటి వంటి దృష్టి లోపాలకు దారితీయవచ్చు.
పాలకూర జ్యూస్‌లో డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది, ఇది జీర్ణ సమస్యలను పరిష్కరించడంలో, మలబద్ధకాన్ని (Constipation) నివారించడంలో సహాయపడుతుంది. కడుపులో పుండ్లు, పేగుల్లో మంట,వాపులకు కూడా చికిత్స చేస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, మీ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది.
చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంచటానికి ప్రతిరోజూ ఒక గ్లాస్ పాలకూర జ్యూస్ తాగండి. ఇది ఒక యాంటీ ఏజింగ్ డ్రింక్‌గా (Anti-ageing Drink) పనిచేస్తుంది. ఇంకా ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది, రక్త ప్రసరణను మరింత మెరుగుపరుస్తుంది, చర్మాన్ని లోపలి నుండి ఆరోగ్యంగా ఉంచుతుంది. పాలకూరలోని విటమిన్ ఎ, విటమిన్ సి, కెరోటినాయిడ్లు, లుటిన్ వంటి పోషకాలు ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి అవసరం.
పాలకూరలో విటమిన్లు కె, ఎ, మాంగనీస్, ఐరన్, జింక్ , ఇతర ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ జుట్టు పెరుగుదలకు (Hair Growth) చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రతిరోజు పాలకూర జ్యూస్ త్రాగడం వల్ల జుట్టు డ్యామేజ్ కాకుండా, స్కాల్ప్ ఆరోగ్యాన్ని పెంచుతుంది, జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది.
సంబంధిత కథనం