Dry Eyes । కళ్లు తరచుగా మంటగా, దురదగా అనిపిస్తున్నాయా? పరిష్కార మార్గాలు చూడండి!
Dry Eyes: కళ్లు తరచుగా మంటగా, దురదగా అనిపిస్తున్నాయా? అయితే మీ కళ్లు పొడిబారయాని అర్థం. దీనికి కారణం, లక్షణాలు, పరిష్కార మార్గాలు చూడండి.
Dry Eyes: మీ కళ్లు తరచూ పొడిబారుతున్నాయా? దీనికి కారణం మీ కళ్లు తగినంత కన్నీళ్లను ఉత్పత్తి చేయలేకపోవడం. కన్నీళ్లు కళ్లను శుభ్రపరచడంతో పాటు, వాటిని తేమగా ఉంచడం ద్వారా కంటి ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. కళ్లలో కన్నీళ్లు చాలా త్వరగా ఆవిరైపోయే పరిస్థితిలో కళ్లు పొడిబారతాయి. కళ్లు పొడిబారినపుడు కళ్లలో మంట, కంటిలో అసౌకర్యం ఉంటుంది. కళ్లు పొడిబారడం వలన కంటి సమస్యలు సంభవించవచ్చు, ఇవన్నీ స్థూలంగా కంటిచూపును ప్రభావితం చేస్తాయి.
ట్రెండింగ్ వార్తలు
కళ్లు రెప్ప వేయడం వలన వాటిని తేమగా ఉంచవచ్చు. అయితే చాలా సేపు రెప్పవేయకుండా ఉండటం, తదేకంగా ఒకే దానిని చూస్తూ ఉండటం, తగినంత నిద్రలేకపోవడం వలన కళ్లు పొడిబారతాయి. ఎక్కువసేపు మొబైల్ స్క్రీన్ చూసే వారిలో, ఎక్కువ కాలం పాటు కంప్యూటర్‌ల ముందు పని చేసే వాళ్లలో కన్నీళ్లు తగ్గుతాయి. ఇలాంటి వారిలోనే కళ్లు పొడిబారిన సమస్యలు ఎక్కువ తలెత్తుతున్నాయని అధ్యయనాలు పేర్కొన్నాయి. పెరిగిన స్క్రీన్ టైమ్ (screen time) కారణంగా చాలా మంది పొడి కళ్లు, ఇతర కంటి జబ్బుల లక్షణాలతో బాధపడుతున్నారని పరిశోధనలో తేలింది.
Dry Eyes Symptoms- కళ్లు పొడిబారినపుడు లక్షణాలు
- కళ్ళలో దురద (Itchy eyes), ఇసుక రేణువులు చేరినట్లు అనిపించడం, గీతలు పడినట్లు అనుభూతి
- కళ్లు ఎర్రగా మారడం, కళ్లు పొడిబారడం వల్ల కళ్లలోని రక్తనాళాలు స్పష్టంగా కనిపిస్తాయి, ఫలితంగా ఎరుపు రంగు వస్తుంది.
- కాంతికి సున్నితత్వం ప్రదర్శిస్తాయి, పొడి కళ్ళతో ప్రకాశవంతమైన కాంతిని చూసినపుడు అసౌకర్యం (Light Sensitivity) లేదా నొప్పిని కలిగిస్తుంది.
- కళ్లు అలసిపోయినట్లుగా అనిపిస్తాయి, మూసుకుపోతున్నట్లుగా ఉంటుంది, అస్పష్టమైన దృష్టి ఉంటుంది, మీరు మొబైల్ లేదా కంప్యూటర్‌ను ఎక్కువ కాలం ఉపయోగిస్తున్నప్పుడు ఇది గమనించవచ్చు.
- పొడి కళ్ళు కళ్లలో అదనపు శ్లేష్మం పేరుకుపోవడానికి కారణమవుతాయి, ఫలితంగా కళ్లలో జిగట ఉత్సర్గ ఏర్పడుతుంది.
Dry Eyes Remedies - కంటి సంరక్షణ కోసం మార్గాలు
కళ్లు పొడిబారినపుడు మీ కళ్లను సంరక్షించడానికి ఈ కింది మార్గాలను అనుసరించండి.
స్క్రీన్ టైమ్ తగ్గించండి: ఎక్కువ సేపు స్క్రీన్‌ని చూడటం వలన కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని నివారించడానికి తరచుగా విరామం తీసుకోండి, 20-20-20 నియమం పాటించండి. ప్రతి 20 నిమిషాలకు విరామం తీసుకోవాలి, 20 అడుగుల దూరంలో ఉన్న దేనినైనా 20 సెకన్ల పాటు చూడాలి.
స్క్రీన్ ప్రకాశం తగ్గించండి: మీ మొబైల్ లేదా కంప్యూటర్ తెర ప్రకాశం, కాంట్రాస్ట్, ఫాంట్ సైజు అన్నీ కంటి ఒత్తిడిని కలిగిస్తాయి. కాబట్టి సెట్టింగ్స్ సర్దుబాటు చేసుకోండి. అలాగే, మీ పరికరం ద్వారా విడుదలయ్యే బ్లూ లైట్ మొత్తాన్ని తగ్గించడానికి బ్లూ లైట్ ఫిల్టర్ లేదా స్క్రీన్ ప్రొటెక్టర్‌ని ఉపయోగించండి.
తరచుగా కళ్లు బ్లింక్ చేయండి: రెప్పవేయడం వలన మీ కళ్లకు తేమను అందించడానికి, అవి ఎండిపోకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. స్క్రీన్‌ని ఉపయోగిస్తున్నప్పుడు లేదా ఎక్కువసేపు చదివేటప్పుడు మరింత తరచుగా రెప్పవేయడానికి ప్రయత్నం చేయండి.
కంటి పరీక్షలు చేయించుకోండి: కంటి ఒత్తిడికి దోహదపడే ఏవైనా దృష్టి సమస్యలను గుర్తించి సరిచేయడంలో రెగ్యులర్ కంటి పరీక్షలు సహాయపడతాయి. కంటి వైద్యుడు మీ పరిస్థితులకు తగిన కళ్లజోడు లేదా ఏవైనా చికిత్సలను సిఫారసు చేయవచ్చు.
సంబంధిత కథనం