Sunglasses Guide । సన్ గ్లాసెస్ ఎంచుకునేటపుడు ఈ టిప్స్ పాటించండి, అదరగొట్టండి!
Sunglasses Buying Guide: మీరి ఈ వేసవిలో సన్ గ్లాసెస్ కొనాలనుకుంటున్నారా? ఎటువంటివి ప్రయోజనకరమో తెలుసుకునేందుకు ఇక్కడ చిట్కాలు ఉన్నాయి చూడండి.
Summer Care Tips: ట్రెండీ ఫ్యాషన్‌లో సన్ గ్లాసెస్ ధరించడం కూడా ఇప్పుడు ఒక భాగం అయింది. చాలా మంది ప్రజలు సన్ గ్లాసెస్ ధరించడం వలన స్టైల్, ఫ్యాషన్ మరింత మెరుగుపరచగలదని భావిస్తారు. అందుకోసమే ఎక్కువగా సన్ గ్లాసెస్ కొనుగోలు చేస్తారు. అయితే సన్ గ్లాసెస్ ధరించడం కేవలం ఫ్యాషన్ కోసం మాత్రమే కాదు, అది మీ కళ్లకు రక్షణ కూడా. సన్ గ్లాసెస్ మీ కళ్ళను వయస్సు పెరిగే కొద్దీ వచ్చే కంటిశుక్లం సహా ఇతర కంటి వ్యాధుల నుండి రక్షించగలవు.
ముఖ్యంగా ఈ ఎండాకాలంలో మీ కళ్ల ఆరోగ్యానికి సన్ గ్లాసెస్ చాలా అవసరం. వేసవిలో సూర్యుని నుంచి వచ్చే కఠినమైన సూర్యకాంతి, హానికరమైన UV కిరణాలు, వాతావరణంలో దుమ్ము కణాలు కళ్లను దెబ్బతీస్తాయి. అయితే సన్ గ్లాసెస్ ధరించడం వలన వీటి నుంచి కళ్లకు రక్షణ లభిస్తుంది. మీరు సురక్షితంగా డ్రైవ్ చేయడంలో మీకు సహాయపడతాయి, మండే ఎండలో మీరు స్పష్టంగా చూడటానికి , తీవ్రమైన కాంతి నుండి కళ్ళను రక్షించడంలో మీకు సహాయపడతాయి. ఎండ నుంచి మీ కళ్లను చల్లగా, ప్రశాంతంగా ఉంచుతాయి.
మీరు ఈ వేసవిలో కొత్త షేడ్స్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇక్కడ కొన్ని చిట్కాలను అందిస్తున్నాం. వీటి సహాయంతో, మీరు మీ కోసం ఎలాంటి సన్ గ్లాసెస్‌ని కొనుగోలు చేయవచ్చో అవగాహన కలుగుతుంది.
Sunglasses Buying Guide- సన్ గ్లాసెస్ ఎంచుకోవడంలో చిట్కాలు
సన్ గ్లాసెస్ కొనుగోలు చేసేటపుడు వాటిలో ఉపయోగించిన గ్లాసెస్ ఎలాంటివి, ఫ్రేమ్ మెటీరియల్, లెన్స్ కలర్, లెన్స్ మెటీరియల్, లెన్స్ ఫీచర్లు, ఫ్రేమ్ సైజు, ఫ్రేమ్ స్టైల్ మొదలైనవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి.
UV రక్షిత సన్ గ్లాసెస్
సన్ గ్లాసెస్ కొనుగోలు చేసేటప్పుడు, మీరు గుర్తుంచుకోవలసిన మొదటి విషయం UV ప్రొటెక్షన్. ఇది అతి ముఖ్యమైన ఫీచర్. మీరు UV రక్షణ లేకుండా సన్ గ్లాసెస్ కొనుగోలు చేస్తే అది పూర్తిగా డబ్బు వృధా. UV కిరణాల నుండి మీ కళ్ళను రక్షించడానికి, భవిష్యత్తులో కంటిశుక్లం వంటి కంటి వ్యాధులను నివారించడానికి UV రక్షిత సన్ గ్లాసెస్ ఎంచుకోండి. పాలికార్బోనేట్ పదార్థంతో ఉన్న లెన్స్‌లు డిఫాల్ట్ UV రక్షణను కలిగి ఉంటాయి.
పోలరైజ్డ్ లెన్స్
మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గ్లేర్‌తో సమస్యను ఎదుర్కొంటున్నారా? చమక్కున మెరిసే నీరు, ప్రకాశవంతంగా మెరిసే బీచ్‌లను చూడటం కష్టంగా ఉందా? అయితే అప్పుడు పోలరైజ్డ్ లెన్స్ కలిగిన సన్ గ్లాసెస్ ఎంచుకోవాలి. మీరు కొనుగోలు చేసే గ్లాసెస్ ఫీచర్లలో పోలరైజేషన్ ఫీచర్ ఉందేమో చూడండి. పోలరైజ్డ్ లెన్స్ కలిగిన సన్ గ్లాసెస్ ధరలు సుమారు, రూ. 600 నుండి మొదలవుతుంది. బ్రాండెడ్ పోలరైజ్డ్ సన్ గ్లాసెస్ ధరలు 5,000 రూపాయల నుండి ప్రారంభమవుతాయి.
ఫోటోక్రోమిక్ లెన్స్
ఇటువంటి లెన్స్ లు కలిగిన సన్ గ్లాసెస్ చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న కాంతిని బట్టి వీటి లెన్స్ రంగు, షేడ్ మారుతుంది. బయట చాలా ప్రకాశవంతంగా ఉన్నప్పుడు లెన్స్ రంగు ముదురు రంగులోకి మారుతుంది, బయట కాంతి తక్కువ ఉన్నప్పుడు లెన్స్ రంగు స్పష్టంగా లేదా రంగు లేకుండా మారుతుంది, తద్వారా మీరు స్పష్టంగా చూడగలరు.
మిర్రర్ లెన్స్
మిర్రర్డ్ సన్ గ్లాసెస్ చాలా కూల్ గా, స్టైలిష్ గా కనిపిస్తాయి. ఇవి పరిమిత కాంతిని మాత్రమే కంటిలోకి అనుమతిస్తాయి, ఇది కళ్ళకు కూడా సురక్షితం. మరొక ప్రయోజనం ఏమిటంటే.. మీరు ఈ సన్ గ్లాసెస్ ధరిస్తే, మీ చుట్టూ పరిసరాలను స్పష్టంగా చూడగలరు. అయితే మీరు ఎటు చూస్తున్నారు అనేది ఎదుటివారు కనిపెట్టలేరు. మీ కళ్లను, మీ భావోద్వేగాలను దాచడానికి, మిమ్మల్ని స్టైలిష్‌గా మార్చడానికి మిర్రర్ లెన్స్ గ్లాసెస్ ఉత్తమమైనవి.
యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్
యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్‌ను యాంటీ గ్లేర్ కోటింగ్ లేదా AR కోటింగ్ అని కూడా అంటారు. ఇది కాంతిని తగ్గించడానికి లెన్స్ వెలుపల, లోపల పూసిన అదనపు పూత. రాత్రిపూట డ్రైవింగ్ చేయడానికి, కంప్యూటర్ ముందు పని చేయడానికి ఇవి చాలా అనువైనవి. AR కోటింగ్ గ్లాసెస్ బ్లూలైట్ నుంచి మీ కళ్ళకు మంచి రక్షణ కల్పిస్తాయి.
స్క్రాచ్ రెసిస్టెంట్ కోటింగ్
పేరుకు తగినట్లుగా స్క్రాచ్ రెసిస్టెంట్ కోటింగ్ ఉంటే ఆది మీ లెన్స్ లపై గీతలు పడకుండా రక్షిస్తుంది. కానీ ఇవి చాలా ఖరీదైనవి. వీటిలో పైన పేర్కొన్న అన్ని ఫీచర్లు లభిస్తాయి.
సింపుల్ టిప్స్
భారీ సన్ గ్లాసెస్ కొనుగోలు చేస్తే, మీకు చెమట ఎక్కువగా పట్టవచ్చు, కాబట్టి గ్లాసెస్ లెన్స్ మరీ పెద్దగా కాకుండా, చిన్నగా కాకుండా మీడియం సైజ్ ఎంచుకోవాలి. దీర్ఘచతురస్రాకార, చదరపు షేడ్స్ గుండ్రని ముఖానికి సరిపోతాయి. మీ ముఖం ఓవల్ ఆకారంలో ఉంటే ఏవియేటర్‌లను ఎంచుకుంటే మంచి లుక్ వస్తుంది.
స్టీల్ ఫ్రేములు ఎండలో మీ చర్మాన్ని కాల్చవచ్చు కాబట్టి మీరు పాలికార్బోనేట్, ప్లాస్టిక్ లేదా నైలాన్ టైటానియం ఫ్రేమ్‌ని ఎంచుకుంటే మంచిది. సన్ గ్లాసెస్ కొనేటపుడు ఎప్పుడైనా వాటిని ధరించి చెక్ చేసుకోండి. అవి పడిపోతున్నాయా లేదా అని చూడటానికి వంగి చూడండి. ఈ చిట్కాలు పాటించి సన్ గ్లాసెస్ ఎంచుకోండి, అదరగొట్టండి.
సంబంధిత కథనం