Mint Rice Recipe । మండే ఎండలో చలువ చేసే భోజనం.. పుదీనా రైస్ ఇలా చేయండి!
Mint Rice Recipe: వేసవిలో వేడిగా ఏది తినాలనిపించదు. అయితే మీ కడుపును చల్లబరిచి, మీ ఆకలిని తీర్చే పుదీనా రైస్ మంచి ఆప్షన్. రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.
Mint Leaves Health Benefits: ఈ వేసవిలో పుదీనాను (Mint in summer) వివిధ రూపాలలో మీ ఆహారంగా తీసుకోవడం చాలా ప్రయోజనకరం. ఇది మీ ఆహారానికి రుచిని, సువాసనను అందించడమే కాదు, మీ ఆరోగ్యాన్ని చాలా విధాల మేలు చేస్తుంది. పుదీనా చలువ గుణాలను (Cooling Properties) కలిగి ఉంటుంది. ఎండాకాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి మీ శరీరాన్ని రక్షిస్తుంది. పుదీనాలోని సమ్మేళనాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచి జీర్ణక్రియను (Digestion) పెంచుతాయి. ఎటువంటి జీర్ణ సమస్యలు తలెత్తవు, ఇది బరువు తగ్గడంలోనూ పాత్ర వహిస్తుంది. పుదీనాలో మెంథాల్ ఉంటుంది, ఇది కఫం, శ్లేష్మాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. దగ్గు, జలుబు వంటి సీజనల్ అనారోగ్యాలను దూరం చేస్తుంది. పుదీనాలోని మెంథాల్ (Menthol) సమ్మేళనం ఆకస్మిక రక్తపోటును నివారిస్తుంది. పుదీనా ఆకులలో ఉండే సాలిసిలిక్ యాసిడ్, విటమిన్ ఎ చర్మంలోని సెబమ్ ఆయిల్ స్రావాలను నియంత్రిస్తాయి. ఇంకా పుదీనాలోని యాంటీఆక్సిడెంట్ రోస్మరినిక్ యాసిడ్ చర్మ ఆరోగ్యాన్ని(Healthy Skin) మెరుగుపరుస్తుంది. ఇది మీ చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో, వృద్దాప్య సంకేతాలను ఆలస్యం చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. పుదీనా మీ రక్తంలో కార్టిసాల్ స్థాయిలను నియంత్రించి ఒత్తిడిని (stress relief) తగ్గిస్తుంది. మిమ్మల్ని శారీరకంగా మానసికంగా రిఫ్రెష్ (Refreshing food) చేస్తుంది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు, పుదీనాను ఎందుకు తినకుండా ఉండాలి? మీకోసం ఇక్కడ పుదీనాతో చేసే ఒక రెసిపీని అందిస్తున్నాం. మీరు ఈ ఎండాకాలం మధ్యాహ్న భోజనంగా పుదీనా రైస్ (Pudina Rice) తినవచ్చు. ఇది మీ కడుపును చల్లగా ఉంచుతుంది. పుదీనా రైస్ రెసిపీని ఈ కింద చూడండి.
Mint Rice Recipe కోసం కావలసినవి
- 1 కప్పు బియ్యం
- 1 కప్పు పుదీనా ఆకులు
- 1 రెమ్మ కరివేపాకు
- 1/2 స్పూన్ ఆవాలు
- 1/4 టీస్పూన్ పసుపు
- 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం
- 1 ఎర్ర మిరపకాయ
- 2 పచ్చి మిరపకాయలు
- 1/2 టీస్పూన్ తురిమిన అల్లం
- 1/4 టేబుల్ స్పూన్ శనగపప్పు (ఐచ్ఛికం)
- 1/4 టేబుల్ స్పూన్ మినపపప్పు (ఐచ్ఛికం)
- 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ లేదా జీడిపప్పు (ఐచ్ఛికం)
- 2 టేబుల్ స్పూన్లు నూనె
పుదీనా రైస్ ఎలా చేయాలి?
- ముందుగా బియ్యం కడిగి, కనీసం 15 నుండి 20 నిమిషాలు నానబెట్టండి.
- ఆపైన ఒక బ్లెండర్ జార్‌లో పుదీనా ఆకులు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు లేదా కొబ్బరిని మెత్తని పేస్ట్ చేయండి.
- ఇప్పుడు ప్రెజర్ కుక్కర్‌లో నూనె పోసి వేడి చేయండి. ఇందులో కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, పసుపు మొదలైన మసాలా దినుసులు వేసి వేయించండి. మీరు కావాలనుకుంటే ఇప్పుడే పప్పులు కూడా వేయించవచ్చు.
- ఇప్పుడు పుదీనా పేస్ట్ కూడా వేసి కొద్దిగా వేయించండి, బాగా కలపండి.
- ఆ తర్వాత బియ్యం ఉడికించేందుకు అవసరం మేరకు నీరు పోయండి, కొద్దిగా ఉప్పువేసి మరిగించండి.
- ఒక మరుగు తీసుకున్న తర్వాత నానబెట్టిన బియ్యం వేసి కలపండి. నీరు ఆవిరయ్యేంత వరకు ఉడికించండి.
- నీరు కొద్దిగా ఉన్నప్పుడు కుక్కర్ మూతపెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి.
అంతే, ఇప్పుడు మూత తీసి చూస్తే పుదీనా అన్నం రెడీ. కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ రైతా లేదా బంగాళదుంప కుర్మా లేదా గుడ్డు మసాలా కూరతో సర్వ్ చేసుకోవచ్చు.
టాపిక్