Coconut Water Disadvantages । కొబ్బరి నీళ్లు రోజూ తాగితే అంతే.. ఇలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి!
Coconut Water Disadvantages: కొబ్బరినీళ్లు తాగితే ఆరోగ్యకరమే కానీ మోతాదు మించితే దుష్ప్రభవాలు ఉంటాయి. రోజులో ఎంతకు మించి కొబ్బరినీరు తాగకూడదో చూడండి.
కొబ్బరినీళ్లు సహజ సిద్ధంగా లభించే ఒక అద్భుతమైన పానీయం. ఈ నీరు ఎంతో స్వచ్ఛమైనది, రుచికరమైనది, ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. ఎప్పుడైనా నీరసంగా, అలసటగా అనిపించినపుడు ఒక కొబ్బరిబొండాం తాగితే తక్షణమే శక్తి లభిస్తుంది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్లను పెంచడంతో పాటు, రోగ నిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది. మెరిసే చర్మం కోసం, శరీరాన్ని డిటాక్సిఫై చేయడానికి కూడా కొబ్బరినీరు తాగవచ్చు.
అయితే కొబ్బరినీరు తాగడం ఆరోగ్యానికి ఎంత మంచిదో, అతిగా తాగితే దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. కొబ్బరి నీరు తాగడం వలన కలిగే ప్రయోజనాల దృష్ట్యా కొంతమంది ప్రతిరోజూ కొబ్బరి నీరు తాగడం అలవాటు చేసుకుంటున్నారు. దాహం వేసినపుడు తాగే మంచి నీటి కంటే కూడా కొబ్బరి నీరు తాగడమే చేస్తున్నారు. ఇలా తాగడం వలన శరీరంలో హానికరమైన కొన్ని మూలకాలు పెరుగుతాయి. ఇందులో పొటాషియం స్థాయిలు పెరగడం వల్ల కడుపులో ఇబ్బంది, ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.
Coconut Water Disadvantages- కొబ్బరి నీళ్లు దుష్ప్రభావాలు
మోతాదుకు మించి కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇక్కడ తెలుసుకోండి.
అతిసారం
కొబ్బరి నీరు లూజ్ మోషన్‌కు కారణమవుతుంది. ఇది పులియబెట్టగల ఒలిగోశాకరైడ్‌లు, డైసాకరైడ్‌లు, మోనోశాకరైడ్‌లు, పాలియోల్స్ లను కలిగి ఉంటుంది, ఇవి పేగుల నుండి నీటిని తీసుకునే షార్ట్-చైన్ కార్బోహైడ్రేట్‌లు. దీని వల్ల మనుషుల్లో విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
అల్ప రక్తపోటు
కొబ్బరి నీరు అధిక రక్తపోటును నియంత్రిస్తుంది అదే సమయంలో ఇది తక్కువ రక్తపోటును (Low BP) కూడా కలిగిస్తుంది. కొబ్బరి నీళ్లలో మంచి మొత్తంలో పొటాషియంను ఉంటుంది, ప్రతిరోజూ కొబ్బరినీళ్లు తాగడం వల్ల మీ రక్తపోటును అకస్మాత్తుగా తగ్గించేస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. అయితే పొటాషియం లోపం సమస్యలు ఉన్నవారు, ఆహారంలో పొటాషియం తగ్గించిన సందర్భంలో సమతుల్యం అవుతుంది.
ఎలక్ట్రోలైట్ అసమతుల్యత
కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, మాంగనీస్ వంటి ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. మనకు లభించే వివిధ కొబ్బరిబొండాలు అన్నీ ఒకే సైజులో, ఒకే తాజాదనంతో లభించవు. కాబట్టి రోజువారీగా ఇలా కొబ్బరి నీళ్లు తాగడం వలన శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతింటుంది, ఇది మీ ఆరోగ్యానికి చాలా హానికరం కావచ్చు. ఉదాహరణకు, పొటాషియం పెరుగుదల పక్షవాతం ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి మోతాదు మించకూడదు.
మధుమేహానికి మంచిది కాదు
మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొబ్బరి నీరు పెద్దగా ప్రయోజనం చేకూర్చలేదు. వాస్తవానికి, ఈ నీటిలోని అధిక కేలరీలు , చక్కెర స్థాయిలు మధుమేహం సమస్యను అసమతుల్యం చేస్తుంది, దీని కారణంగా రక్తంలో చక్కెర స్పైక్ వేగంగా జరుగుతుంది. మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే, వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే కొద్దిగా కొబ్బరి నీరు తాగడం చేయాలి.
అలెర్జీకి కారకం
కొందరికి ఫుడ్ అలర్జీలు ఉంటాయి, కొబ్బరి సంబంధిత ఆహార పదార్థాలు తినడం ద్వారా అలెర్జీ కలుగుతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వలన కూడా అలర్జీలను ప్రేరేపించవచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి దేనిని మోతాదుకు మించి తీసుకోవద్దు. రోజుకి 2-3 గ్లాసులకు మించి కొబ్బరినీరు తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
సంబంధిత కథనం