Rotten Coconut Water | కొబ్బరి నీళ్లు తాగి వ్యక్తి మృతి.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!-a danish man who drank rotten coconut water suffered from organ damage and is brain dead ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rotten Coconut Water | కొబ్బరి నీళ్లు తాగి వ్యక్తి మృతి.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!

Rotten Coconut Water | కొబ్బరి నీళ్లు తాగి వ్యక్తి మృతి.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!

HT Telugu Desk HT Telugu
Dec 18, 2022 12:47 PM IST

Rotten Coconut Water: కుళ్లిపోయిన కొబ్బరి నీళ్లు తాగి ఒక వ్యక్తి మృత్యువాత పడ్డాడు. కొబ్బరినీళ్లను అలా కలిపి తాగితే అది విషతుల్యం కావొచ్చు, ప్రాణాలకు ప్రమాదం కూడా. ఈ స్టోరీ చదవండి.

Rotten Coconut Water Killed a Man
Rotten Coconut Water Killed a Man (Unsplash)

కొబ్బరి నీళ్లు చాలా పరిశుద్ధమైనవి, ఏ సీజన్‌లో అయినా స్టోర్ల‌లో లభించే స్పోర్ట్స్ డ్రింక్స్ తాగే బదులు సహజంగా లభించే కొబ్బరి నీళ్లు తాగాలంటారు. ఇది అక్షరాల నిజమే, ఇందులో ఎలాంటి అవాస్తవం లేదు. కానీ ఒక వ్యక్తి కొబ్బరి నీళ్లు తాగడంతో అది విషతుల్యం అయింది. దీంతో కొన్ని గంటల్లోనే బ్రెయిన్ డెడ్ అయి మరణించాడు. అసలు ఏం జరిగింది, కొబ్బరి నీళ్లు అతడి మరణానికి ఎలా కారణం అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.

డెన్మార్ దేశానికి చెందిన 69 ఏళ్ల ఏసీ అనే వ్యక్తి తన ఇంట్లో ఉన్న కొబ్బరి నీళ్లను తాగాడు, కొంతసేపటికే అతడు అస్వస్థతకు గురయ్యాడు. ఏసీ కొన్ని రోజుల క్రితం సూపర్ మార్కెట్ నుంచి ప్యాకేజ్డ్ కొబ్బరి నీళ్లు తెచ్చుకున్నాడు. ఈ కొబ్బరి నీళ్లను కూడా బోడాంలోనే ఇచ్చారు. అయితే దీనిని రీఫ్రిజరేటర్‌లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయం ఈ వ్యక్తికి తెలియక దీనిని మామూలు కొబ్బరిబోండాం లాగే వంటగదిలో ఒక మూలన పెట్టేశాడు.

రెండు మూడు వారాలు గడిచాయి, ఇటీవల మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొబ్బరినీళ్లు తాగుదామనిపించింది. వెంటనే అతడు దాచుకున్న కొబ్బరిబోండాం తీసి స్ట్రా వేసి తాగాడు. అయితే ఆ నీళ్లు చాలా చెడుగా, కుళ్లిపోయిన రుచిని కలిగి ఉన్నాయి. వెంటనే నోటిని పుక్కిలించి శుభ్రం చేసుకున్నప్పటికీ కొంత నీరు (Rotten Coconut Water) అప్పటికే అతడి కడుపులోకి వెళ్లిపోయింది. అతడు ఆ కొబ్బరిబోండాంను తొలచి చూడగా అది పూర్తి కుళ్లిపోయి పురుగులు పట్టి ఉంది. అవే నీటిని తెలియకుండా ఈ వ్యక్తి కొంత తాగేశాడు. వెంటనే ఏసీ తన భార్యను పిలిపించి తాను తాగిన కొబ్బరిబోండాంను విప్పి చూపించాడు. ఆ కొబ్బరిబోండాంను రిఫ్రిజిరేటర్‌లో 4°C-5°C నిల్వ చేయాలని ఉంది. బయట పెట్టడంతో అది కుళ్లిపోయింది.

ఈ కొబ్బరి నీళ్లు తాగిన మూడు గంటల తర్వాత ఏసీలో వింత లక్షణాలు కనిపించాయి. అతడికి తీవ్రంగా చెమటలు పట్టడం, వికారం, వాంతులు మొదలయ్యాయి. కొద్ది క్షణాల్లోనే అతడు స్పృహ కోల్పోయి నేలపై పడిపోయాడు. దీంతో అతడి భార్య వెంటనే అతణ్ని ఆసుపత్రికి తరలించింది. అయినప్పటికీ రెండు గంటల తర్వాత పరిస్థితి విషమించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కి తరలించారు. ఆ తర్వాత అతడు కోమాలోకి వెళ్లిపోయాడు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అవయవాలన్నీ దెబ్బతిన్నాయి, చివరకు బ్రెయిన్ డెడ్ అయి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

మృతికి కారణం ఇదే

యూఎస్ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (ఎన్‌సిబిఐ) నివేదిక ప్రకారం, ఏసి అనే వ్యక్తి కుళ్లిపోయిన కొబ్బరి నీళ్లు తాగారు. సాధారణంగా మురుగు నీటిలో వృద్ధి చెందే ఆర్థ్రినియం సచ్చరికోలా (Arthrinium saccharicola) అనే ఫంగస్ ఆ కొబ్బరి నీళ్లలో వృద్ధి చెందింది. అలాగే కుళ్లిపోయిన ఆహారంలో 3-నైట్రోప్రొపియోనిక్ యాసిడ్ అనే టాక్సిన్ తయారవుతుంది. ఇలాంటి నీరు తాగడం వల్లనే అతడి శరీరం పూర్తిగా విష ప్రభావానికి గురయింది. మెదడులో రక్తస్రావం జరిగి చనిపోయినట్లు పోస్ట్ మార్టమ్ నివేదికలు తెలిపాయి.

చివరగా చెప్పేది ఏమిటంటే.. కొబ్బరిబోండాం స్వచ్ఛంగా ఎలా లభిస్తుందో అలాగే తాగాలి. ప్యాకేజ్డ్ కొబ్బరినీళ్లు, నిల్వ చేసిన కొబ్బరి నీళ్లు తాగకూడదు. కొంతమంది కొబ్బరినీళ్లలో ఇతర పండ్లరసాలు, పానీయాలు కలిపి దాని శుద్ధతను చెడగొడతారు. ఇది కూడా శరీరానికి హానికారమే. కాబట్టి ఎల్లప్పుడూ తాజా కొబ్బరి నీళ్లను తాగటమే ఆరోగ్యానికి మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం