Coconut Water | స్పోర్ట్స్ డ్రింక్స్ కంటే కొబ్బరి నీళ్లు మేలు!
బాగా అలిసిపోయి శక్తిని కోల్పోతే స్పోర్ట్స్ డ్రింక్స్ తో సత్వర శక్తి లభిస్తుంది. అయితే కొబ్బరి నీరులో కూడా కావాల్సిన పోషకాలు ఉంటాయట. రెండింటిలో ఏది బెటర్? తెలుసుకోండి...
ఎండాకాలంలో మన శరీరానికి నీటి అవసరం ఎక్కువ ఉంటుంది, దాహం ఎక్కువగా వేస్తుంది. వేడికి మన శరీరంలోని నీరు, ఎలక్ట్రోలైట్స్ చెమట రూపంలో బయటకు వెళ్లిపోతాయి. దీంతో శక్తి కోల్పోయినట్లుగా నీరసంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వేసవికాలంలో మైదానంలో క్రీడలు ఆడినపుడు గానీ, జిమ్‌లో వ్యాయామాలు చేసినపుడు గానీ మన శరీరం ఇంకాస్త ఎక్కువ నీటిని కోల్పోతుంది.
మరి ఇలాంటి పరిస్థితుల్లో మన శరీరానికి కేవలం నీరు మాత్రమే సరిపోదు, ఎలక్ట్రోలైట్స్ కూడా కావాలి. ఇందుకోసం ఎలాంటి పానీయం తీసుకోవాలని అడిగితే కొబ్బరి నీళ్లు తాగాలని సూచిస్తున్నారు నిపుణులు. కొబ్బరి నీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెప్తున్నారు.
ఇతర స్పోర్ట్స్ డ్రింక్స్ లేదా ఎలక్ట్రోలైట్ పానీయాలతో పోలిస్తే కొబ్బరి నీటిలో ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రోలైట్లు, పొటాషియం, మెగ్నీషియం, సోడియం లాంటి మరెన్నో ఖనిజ లవణాలు ఉంటాయి.
వ్యాయామం తర్వాత కండరాల సంకోచంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. చెమట ద్వారా కోల్పోయిన నీటిని, ఎలక్ట్రోలైట్‌లను కొబ్బరి నీళ్లు భర్తీచేస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించగలదు. అంతేకాదు కొబ్బరి నీరు సహజమైనది, ఆరోగ్యకరమైనది. నేరుగా చెట్టు నుంచి లభిస్తుంది కాబట్టి ఇందులో ఎలాంటి చక్కెరలు, కృత్రిమ రుచులు లేదా ప్రిజర్వేటివ్స్ ఉండవు. వ్యాయామం తర్వాత హైడ్రేటెడ్‌గా ఉండటానికి కొబ్బరి నీళ్లు బెస్ట్ ఛాయిస్ అని నిపుణులు పేర్కొన్నారు.
ప్రతిరోజూ ఉదయం ఉదయాన్నే పరిగడుపున కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జీవక్రియ రేటు మెరుగుపడుతుంది, బరువు నియంత్రణలో ఉంటుంది. వ్యాయామానికి ముందు, వ్యాయామం తర్వాత ఎప్పుడైనా కొబ్బరి నీళ్లు మంచి రిఫ్రెష్‌మెంట్‌గా పనిచేస్తుంది. కాబట్టి అలసటగా, దాహంగా ఉన్నా కొబ్బరి నీళ్లు తాగాలని సిఫారసు చేస్తున్నారు.
సంబంధిత కథనం