Coconut Milk | కొబ్బరి పాలు ఎలా వస్తాయి? కొబ్బరి నీళ్లకు, పాలకు మధ్య తేడా ఇదే!
కొబ్బరి అనేది ఒక రకమైన పామ్ వృక్షం. దీనికి కాసే కొబ్బరికాయల ద్వారా కొబ్బరినీరు లభిస్తుంది, కొబ్బరి పాలు, కొబ్బరి నూనె, కొబ్బరి క్రీమ్ ఇలా రకరకాల ఆహార ఉత్పత్తులు లభిస్తాయి. అయినప్పటికీ ఇందులో కొబ్బరి నీరు తప్ప మిగతావి సహజమైనవా? కృత్రిమమైనవా అని మీకు అనిపించవచ్చు. ఈ స్టోరీ చదివితే మీ సందేహాలు తీరతాయి.
కొబ్బరిచెట్టు శాస్త్రీయనామం కోకోస్ న్యూసిఫెరా ఎల్. ఇది ఉష్ణమండలాలలో పెరిగే ఒక పామ్ వృక్షం. ఈ వృక్షం మనదేశంలో కూడా పెరగటం అంటే నిజంగా ప్రకృతి మనకు అందించిన ఒక వర ప్రసాదం. ఈ కొబ్బరిచెట్టుతో మనం ఎన్నో రకాలుగా ప్రయోజనాలను పొందుతున్నాం.
మనందరికీ కొబ్బరి నీళ్ల గురించి తెలుసు. కొబ్బరికాయల్లో, కొబ్బరి బోండాలలో లభించే సహజమైన కొబ్బరి నీరు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనం చాలాసార్లు విన్నాం. అలాగే మీరు కొబ్బరి పాల గురించి కూడా వినే ఉంటారు. కిరాణ స్టోర్లలో, సూపర్ మార్కెట్లలో కొబ్బరి పాలు లభిస్తాయి. మరి ఈ పాలు ఎలా వస్తాయనేది మీకు తెలుసా? కొబ్బరి నీళ్లకి, పాలకి మధ్య అసలు తేడా ఏంటి? ఈ రెండింటిలో ఏది ఉత్తమం? ఇలాంటి సందేహాలకు సమాధానం ఇప్పుడు తెలుసుకోండి.
కొబ్బరి పాలు అంటే ఏమిటి?
మనం దేనినైతే కొబ్బరికాయ అని పిలుస్తామో నిజానికి అది కొబ్బరి చెట్టుకు కాసే ఒక పండు. ఈ పండు 38% షెల్, 10% నీరు అలాగే 52% కొబ్బరిగుజ్జుతో తయారవుతుంది. ఈ కొబ్బరి గుజ్జును కొబ్బరి మాంసం అని కూడా అంటారు. మీరు కొబ్బరి బొండాంలో నీరు తాగాక ఆ బొండాంను విరిచిచూస్తే అందులో లేత కొబ్బరి పొర ఉంటుంది. దానిని కూడా మనం తినేయవచ్చు. లేత కొబ్బరిలో నీరు ఎక్కువగా లభిస్తుంది. అయితే కొబ్బరి మరింత ముదిరి గోధుమ రంగులోకి మారిన తర్వాత దాని లోపల నీరు తగ్గిపోయి గుజ్జు (కుడక) మరింత పెరుగుతుంది. ఇలాంటి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి వేడినీటిలో మరిగిస్తే అది తెల్లని ద్రవరూపంలో మారుతుంది. వీటినే కొబ్బరిపాలు అంటారు. ఈ కొబ్బరిపాలను వంటల్లోకి ఉపయోగిస్తారు. ఏదైనా వంటకం చిక్కగా తయారవ్వాలంటే అందులో కొబ్బరిపాలను కలపాలి. అలాగే ఈ కొబ్బరి పాలను ఆవు పాలకు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగిస్తారు.
కొబ్బరి పాలు లేదా కొబ్బరి నీరు- వీటిలో ఏది మంచిది
ఇది చాలా సులభంగా అర్థం చేసుకునే విషయం. కొబ్బరినీళ్లు సహజసిద్ధంగా లభించేవి ఇందులో 94 శాతం నీరు ఉంటుంది. మిగతా కొద్దిశాతం కొవ్వు, ఇతర మినరల్స్ ఉంటాయి. ఇక కొబ్బరి పాల విషయానికి వస్తే ఇది నేరుగా చెట్టుకే లభించేది కాదు. వేడి నీటిని ఉపయోగించి కృత్రిమంగా తయారు చేయాల్సి ఉంటుంది. కొబ్బరిపాలలో 50 శాతం నీరు ఉంటే కొవ్వు పదార్థాలు, క్యాలరీలు అధికశాతం ఉంటాయి. కాబట్టి కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిది.
సంబంధిత కథనం