Mixed Vegetable Curd Curry । అన్ని కూరలను రీమిక్స్ చేయండి.. ఇదిగో రెసిపీ!
Mixed Vegetable Curd Curry Recipe: ఈ వేసవిలో వేడికి ఏం తినాలో తెలియడం లేదా? ఏం వండాలో తోచడం లేదా? అయితే కూరగాయలన్నీ కలిపి ఇలా వండేయండి. ఈ రెసిపీ చూడండి.
వేసవిలో ఏ కూర వండుకున్నా అంత రుచి అనిపించదు, రోజూ ఏ కూర చేయాలో తోచదు, ఒక్క పెరుగుతోనే తినేయాలనిపిస్తుంది చాలా మందికి. మీరు ఈ జాబితాలో ఉంటే మీ కోసం ఒక ప్రత్యేకమైన రెసిపీ ఇక్కడ అందిస్తున్నాం. మీరు పెరుగుతో మజ్జిగ చారు, ఆనియన్ రైతా, దోసకాయ రైతా వంటివి చేసుకొని ఉండవచ్చు. అయితే ఎప్పుడైనా పెరుగుతో కూరను చేసుకున్నారా? ఈ వేడి వాతావరణంలో ఏ కూర తినాలనిపించనపుడు, కూరగాయలు అన్నీ కలిపి మిక్డ్స్ వెజిటెబుల్ కర్రీ చేసుకోవచ్చు. మీరు చాలా సార్లు వివిధ కూరగాయలు కలగలిసిన మిక్డ్స్ వెజిటెబుల్ కర్రీ తిని ఉండవచ్చు, అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో పెరుగును కలిపి చేయడం.
పెరుగుతో చేసే మిక్డ్స్ వెజిటెబుల్ కర్రీ ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. ఈ వేసవి సీజన్ లో లంచ్ సమయాల్లో గానీ, డిన్నర్ సమయాల్లో గానీ అన్నం లేదా రోటీలో కలుపుకొని తినేందుకు మీకు ఇది రుచికరమైన వంటకంగా ఉంటుంది. మిక్డ్స్ వెజిటెబుల్ పెరుగు కూర రెసిపీ ఈ కింద ఉంది, మీరూ ఓ సారి ప్రయత్నించండి.
Mixed Vegetable Curd Curry Recipe కోసం కావలసినవి
- 1 కప్పు- పెరుగు
- 100 గ్రా - పొడవైన బీన్స్
- 150 గ్రా - పసుపు గుమ్మడికాయ ముక్కలు
- 150 గ్రా - బీరకాయ ముక్కలు
- 150 గ్రా - చిలగడదుంప ముక్కలు
- 1 కప్పు - పచ్చి కొబ్బరి తురుము
- 2 పచ్చిమిర్చి
- 3 ఎర్ర మిరపకాయలు
- 2 స్పూన్ మినపపప్పు
- 2 స్పూన్లు ధనియాలు
- 1 టేబుల్ స్పూన్ - నూనె
- ½ స్పూన్ - ఆవాలు
- రుచికి తగినంత ఉప్పు
- కరివేపాకు కొన్ని ఆకులు
- కొత్తిమీర గార్నిషింగ్ కోసం
మిక్డ్స్ వెజిటబుల్ పెరుగు కూర తయారీ విధానం
- ముందుగా ఒక బాణాలిలో కూరగాయ ముక్కలన్నీ వేసి, సరిపడా నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా ఉడికించాలి.
- మరోవైపు, మరొక పాన్ లో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మినపపప్పు, ధనియాలు వేయించాలి.
- ఇప్పుడు ఈ వేయించిన పదార్థాలను మిక్సర్ జార్ లో వేసి, ఇందులోనే పచ్చికొబ్బరి కూడా వేసి పేస్ట్‌లా రుబ్బుకోవాలి.
- పచ్చి మరియు ఎర్ర మిరపకాయలను 1 స్పూన్ నూనెతో కాల్చండి. ఉరద్ పప్పు మరియు కొత్తిమీర గింజలు జోడించండి.
- ఇప్పుడు ఉడికించిన కూరగాయలలో, ఇదివరకు రుబ్బుకున్న పేస్ట్ వేసి 2-3 నిమిషాలు ఉడికించండి.
- ఆపైన మంట నుంచి తీసేసి, అందులో పెరుగు వేసి బాగా కలపండి. రుచిని సర్దుబాటు చేసుకోండి.
- చివరగా కొంచెం నూనె వేడి చేసి, అందులో ఆవాలు, కరివేపాకు వేయించి, ఈ పోపును కూరలో కలుపుకోవాలి, పైనుంచి కొత్తిమీర చల్లుకోవాలి.
అంతే, రుచికరమైన మిక్డ్స్ వెజిటబుల్ పెరుగు కూర.. హాయిగా ఆరగించండి మరి.