Mixed Vegetable Soup । పోషకాలన్నింటిని మిక్స్ చేసుకొని తాగేయాలంటే.. మిక్స్‌డ్ వెజిటబుల్ సూప్!
కొన్ని కూరగాయలను మిక్స్ చేసి వేడివేడిగా సూప్ చేసుకొని తాగితే ఈ చలికాలంలో చాలా వెచ్చగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో ఇక్కడ Mixed Vegetable Soup Recipe ఉంది చూడండి.
చల్లని శీతాకాలంలో వెచ్చని సూప్ గిన్నె పట్టుకున్నప్పుడు కలిగే హాయి వేరు. ఆ సూప్‌ను కొద్దికొద్దిగా తాగుతూ, దాని రుచిని ఆస్వాదిస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. ఈ చలికాలంలో కూరగాయలు తాజాగా లభిస్తాయి. మనం తాగాలనుకుంటే మనం రోజుకో ఫ్లేవర్ కలిగిన సూప్ చేసుకొని తాగేయవచ్చు. ఇవి మీ కడుపు నింపుతాయి, ఈ సీజన్ లో మిమ్మల్ని వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
చాలా మందికి టొమాటో సూప్, మటన్ పాయా సూప్, చికెన్ సూప్ వంటివి చాలా ఇష్టం ఉంటుంది. మిగతా కూరగాయల సూప్‌లను రుచిగా ఉండవని తక్కువగా చేసుకుంటారు. అయితే అవి మాత్రమే కాకుండా పాలక్ సూప్ కూడా రుచిగానే ఉంటుంది. అన్ని కూరగాయలను కలగిలిపే మిక్స్‌డ్ వెజిటబుల్ సూప్ కూడా మహాద్భుతంగా ఉంటుంది. మీకు ఇందులో ఎలాంటి పోషకాల నష్టం జరగకుండా, చాలా రుచికరంగా చేసుకోగలిగే మిక్స్‌డ్ వెజిటబుల్ సూప్ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. మీరు ప్రయత్నించి చూడండి మరి.
Mixed Vegetable Soup Recipe కోసం కావలసినవి
- బ్రోకలీ - 1/2 కప్పు
- క్యారెట్ - 1
- క్యాబేజీ - 1/4 ముక్క
- అల్లం - 1 ముక్క
- క్యాప్సికమ్ (ఎరుపు, పసుపు, ఆకుపచ్చ) - 3 ముక్కలు
- ఫ్రెంచ్ బీన్స్ - 5 నుండి 6
- పచ్చిమిర్చి 2-3
- వెల్లుల్లి 10 రెబ్బలు
- స్వీట్ కార్న్ - 1/2 కప్పు
- కొత్తిమీర
- స్ప్రింగ్ ఆనియన్
- ఆలివ్ ఆయిల్ - 1 స్పూన్
- రుచి ప్రకారం ఉప్పు
- బ్లాక్ పెప్పర్ పౌడర్ - 1 tsp
- వెన్న - 1 tsp
- కార్న్ ఫ్లోర్ - 1 టేబుల్ స్పూన్
- చక్కెర - చిటికెడు
- సోయా సాస్ - 1/2 tsp
- 1 స్పూన్ నిమ్మరసం
మిక్స్‌డ్ వెజిటబుల్ సూప్ రెసిపీ- తయారీ విధానం
- ముందుగా కూరగాయలు, అల్లం, వెల్లుల్లి మొదలైన వాటిని వీలైనంత చిన్నగా తరిగి పెట్టుకోవాలి.
- కూరగాయలను తరుగగా మిగిలిన భాగాలను పారేయకుండా, వాటిని నీటిలో వేసి మిరియాలు, బిర్యానీ ఆకు, అల్లం లాంటివి వేసి బాగా మరిగించాలి, ఆపై ఈ నీటిని ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకుని సూప్ లో కలిపేందుకు ఉపయోగించవచ్చు.
- ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసి అందులో సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
- ఆపై సన్నగా తరిగిన కూరగాయలను వేయించాలి, మాడకుండా జాగ్రత్త పడాలి.
- ఇప్పుడు రుచికి తగినట్లుగా ఉప్పు, మిరియాల పౌడర్ వేసి కలుపుకోవాలి. స్మూత్ అవ్వడానికి ఒక టీస్పూన్ వెన్న కూడా వేసుకోవచ్చు.
- కూరగాయముక్కలు కొంచెం క్రిస్పీగా అయ్యాక, పైన కూరగాయల స్టాక్ నీటిని పోసుకోవాలి.
- చిక్కదనం కోసం కొద్దిగా మొక్కజొన్న పిండి స్లర్రీని నెమ్మదిగా వేసి కలపాలి.
- సూప్ ఉడికిన తర్వాత పైనుంచి పావు టీస్పూన్ సోయా సాస్, ఆపై కొంత నిమ్మరసం వేసి కలపాలి.
అంతే, మిక్స్‌డ్ వెజిటబుల్ సూప్ సిద్ధం అయినట్లే. ఒక కప్పులో సర్వ్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే ఆస్వాదించండి.