Eating Curd in Summer । వేసవిలో రోజూ పెరుగు తినండి.. ఈ 6 ప్రయోజనాలు పొందండి!
Eating Curd in Summer: వేసవిలో ప్రతిరోజూ పెరుగు తినాలని నూట్రిషనిస్టులు సిఫారసు చేస్తున్నారు. శరీరాన్ని చల్లగా ఉంచడం నుంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడవరకు పెరుగు తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో వివరించారు, అవి ఇక్కడ తెలుసుకోండి.
Curd or Yogurt Health Benefits: పెరుగు ఎల్లప్పుడూ మన ఆహారంలో అంతర్భాగంగా ఉంది. మనం అనేక విధాలుగా పెరుగును ఆహారంలో చేర్చుకుంటాం. నేరుగా పెరుగును అన్నంలో కలుపుకొని తినడం కావచ్చు, ఒక గ్లాసు మజ్జిగ రూపంలో కావచ్చు, లస్సీగా కావచ్చు, రైతా కావచ్చు, మజ్జిగ చారుగా కావచ్చు ఎలా అయినా తినవచ్చు. పెరుగుతో చేసే అనేక రెసిపీలు మనకు అందుబాటులో ఉన్నాయి. పాలను పులియబెట్టడం ద్వారా తయారు చేసే ఈ పదార్థం నిజంగా మన ఆరోగ్యానికి చాలా గొప్పది. ఇందులో కాల్షియం, ప్రోటీన్, ప్రోబయోటిక్స్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జుట్టు పెరుగుదలకు, చర్మానికి ఆరోగ్యానికి కూడా పెరుగు మేలు చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే పెరుగు మీ అందానికి, ఆరోగ్యానికి రెండింటికీ అవసరం. కాబట్టి పెరుగును తరచుగా తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా ఈ వేసవి సీజన్‌లో పెరుగును ఉత్తమమైన సూపర్‌ఫుడ్‌లలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ ఎండాకాలంలో మీరు ప్రతిరోజూ పెరుగును తినడం చాలా మంచిది. ఇది మీ ఆహారానికి రుచిని పెంచడమే కాకుండా, మిమ్మల్ని చల్లగా, ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.
వేసవిలో ప్రతిరోజూ పెరుగు తినడం వల్ల కలిగే కొన్ని ఆకట్టుకునే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.
Eating Curd in Summer, Benefits- వేసవిలో పెరుగు తింటే కలిగే ప్రయోజనాలు
వేసవి వేడిలో మీరు పునరుజ్జీవనం పొందేందుకు మీ శరీరానికి అందించాల్సిన ఇంధనం పెరుగు అని చెన్నైలోమి మదర్‌హుడ్ హాస్పిటల్స్ లో కన్సల్టెంట్ - డైటీషియన్ హరి లక్ష్మి అన్నారు. పెరుగు తినడం వలన కలిగి ఆరోగ్య ప్రయోజనాలను వారు వివరించారు.
1. మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది
వేసవికాలం మీ శక్తి స్థాయిలను పరీక్షిస్తుంది, నిరంతరం చెమటలు పడుతున్నప్పుడు డీహైడ్రేట్ అవుతారు. కాబట్టి వేడి వాతావరణంలో మిమ్మల్ని మీరు చల్లగా, హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం ముఖ్యం. రోజూ ఒక గిన్నె పెరుగు తీసుకోవడం వల్ల అది మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా మీ ఎనర్జీ లెవెల్స్‌ను కూడా పెంచుతుంది.
2. జీర్ణక్రియ ఆరోగ్యంగా సాగుతుంది
వేడి పెరిగేకొద్దీ జీర్ణక్రియ నెమ్మదిస్తుంది, జీర్ణవ్యవస్థ బలహీనంగా మారుతుంది, ఇది వివిధ జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీరు అజీర్ణం లేదా కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటే, పెరుగు మీకు సరైన ఔషధం.
3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది
పెరుగులో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ యాంటీబాడీస్ ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా శరీరంలో మంటను, వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
4. రక్తపోటును తగ్గిస్తుంది
పెరుగులో పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే ముఖ్యమైన ఖనిజం. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
5. బరువు తగ్గడానికి
పెరుగు అనేది తక్కువ కేలరీలు కలిగిన ఆహారం, ఇది బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది. ఇందులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి, ఇది మీకు ఎక్కువసేపు కడుపు నిండుగా అనిపించేలా చేస్తుంది. మీ ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను తగ్గించడంలో కూడా పెరుగు సహాయపడుతుంది. కార్టిసాల్ అనేది ఒత్తిడి, ఆందోళనకు కారణమయ్యే ఒక హార్మోన్. ఇది కూడా బరువు పెరగటానికి ఒక కారణం. అయితే పెరుగు తినడం వలన అది మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ విధంగా ఒత్తిడి నియంత్రించడంలో, బరువు తగ్గడంలో పెరుగు మీకు మంచి మేలు చేకూరుస్తుంది.
6. ఎముకల ఆరోగ్యానికి
పెరుగు తినడం ద్వారా కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటి ఏమిటంటే, ఇది బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పెరుగులో కాల్షియం సమృద్దిగా ఉంటుంది, ఇది ఎముకలు, దంతాలకు అవసరం. ఇందులో విటమిన్ డి కూడా ఉంటుంది, ఇది శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. పెరుగులోని యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి, శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.
అందువల్ల, ఈ వేసవిలో మీ రోజువారీ ఆహారంలో పెరుగును చేర్చుకోండి. ఇది మీ శ్రేయస్సును మెరుగుపరచడానికి గొప్ప మార్గం. మీకు పెరుగు తినడం వలన ఏవైనా సమస్యలు ఉంటే వైద్యుల సలహా తీసుకోండి.
సంబంధిత కథనం