Vegetable Fried Rice । గరంగరంగా, రుచికరంగా వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకోండిలా త్వరత్వరగా!
Vegetable Fried Rice Recipe: అన్నం తినాలనిపించకపోతే, మిగిలిన అన్నం ఉంటే, వేడివేడిగా త్వరత్వరగా ఏదైనా తినాలనిపిస్తే ఫ్రైడ్ రైస్ చేసుకోండి. రుచికరమైన వెజ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఇక్కడ ఉంది.
బ్రంచ్ చేయాలన్నా, లంచ్ చేయాలన్నా, డిన్నర్‌లో అయినా చాలామంది అన్నం తినడానికే ఎక్కువ ఇష్టపడతారు. అలాగే ఒకసారి వండుకున్నాక అన్ని పూటలు మళ్లీ అవే కూరలు, అదే అన్నం రిపీట్ చేయడం చాలా ఇళ్ళలో జరిగేదే. అయితే ఇలా తిన్నదే మళ్లీ మళ్లీ తినడం ఇష్టం లేకపోతే అన్నంతో చటుక్కున ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చు. కేవలం నిమిషాల్లోనే ఈ వంటకం రెడీ అవుతుంది.
ఫ్రైడ్ రైస్ అనేది చైనీస్ స్టైల్‌లో తయారు చేసే భోజనం. దీనిని కూరగాయలు కలిపి వెజిటెబుల్ ఫ్రైడ్ రైస్‌గా, గుడ్లను ఆమ్లెట్ రూపంలో వేయించి ఎగ్ ఫ్రైడ్ రైస్‌గా, చికెన్ ముక్కలతో చికెన్ ఫ్రైడ్ రైస్ గా ఇలా రకరకాలుగా ఈ వంటకాన్ని సిద్ధం చేసుకోవచ్చు. మీకు ఎప్పుడూ తినే భోజనంలో కాస్త వెరైటీని కోరుకుంటే మిగిలిన అన్నంతో ఫ్రైడ్ రైస్ చేసేసుకోండి. ఇక్కడ వెజిటెబుల్ ఫ్రైడ్ రైస్ రెసిపీ అందిస్తున్నాం. ఈ కింద ఇచ్చిన సూచనలు అనుసరించి కేవలం 10 నిమిషాల్లోనే రుచికరంగా ఫ్రైడ్ రైస్ సిద్దం చేసుకోండి.
Vegetable Fried Rice Recipe కోసం కావలసినవి
- 1 కప్పు అన్నం
- 2 టేబుల్ స్పూన్ ఆయిల్
- 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- 1/2 కప్పు తరిగిన స్ప్రింగ్ ఆనియన్
- 1/2 కప్పు క్యారెట్ ముక్కలు
- 1/2 కప్పు తరిగిన క్యాబేజీ
- 1 క్యాప్సికమ్ ముక్కలు
- 1 టేబుల్ స్పూన్లు సోయా సాస్
- 1 టేబుల్ స్పూన్ వెనిగర్
- 1/2 టీస్పూన్ కారం
- ఉప్పు రుచికి తగినంత
- 1 టీస్పూన్ నిమ్మకాయ
- తాజా కొత్తిమీర కొద్దిగా
వెజిటెబుల్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం
- ముందుగా బాణలిలో నూనె వేసి, వేడి చేయండి.
- ఆపైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగించండి.
- ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ ముక్కలు వేయండి, బాగా కలుపుతూ అవి కొద్దిగా ఉడికేంత వరకు వేయించండి.
- అనంతరం సోయా సాస్, వెనిగర్ తో పాటు రుచికి తగినట్లుగా ఉప్పు, కారం వేయండి.
- ఇప్పుడు వండిన అన్నం వేసి, అన్నింటినీ బాగా కలపండి.
- చివరగా కొత్తిమీర ఆకులు చల్లి కలపండి. కొద్దిగా నిమ్మరసం పిండండి.
అంతే, రుచికరమైన వెజిటెబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ. వేడివేడిగా తింటూ రుచిని ఆస్వాదించండి.
మీరు ఇదే తరహాలో ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంకా అన్ని రకాల ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. కూరగాయలు వేయించేటపుడు గుడ్లు పగలకొట్టి, లేదా మాంసం ముక్కలు వేసి నాన్-వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్