Nasi Goreng। గరంగరంగా నాసి గోరెంగ్‌ బ్రేక్‌ఫాస్ట్.. మిగిలిన అన్నంతో వండేయొచ్చు!-feast yourself with tasty nasi goreng breakfast in the morning ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Feast Yourself With Tasty Nasi Goreng Breakfast In The Morning

Nasi Goreng। గరంగరంగా నాసి గోరెంగ్‌ బ్రేక్‌ఫాస్ట్.. మిగిలిన అన్నంతో వండేయొచ్చు!

Nasi Goreng
Nasi Goreng (Unsplash)

రాత్రి మిగిలిన అన్నం ఉంటే దానినే లెమన్ రైస్, గార్లిక్ రైస్ చేసుకొని అల్పాహారంగా తింటారు. ఇంకాస్త వెరైటీగా నాసి గోరెంగ్ చేసుకొని తినిచూడండి. ఇది కూడా చిటికెలోనే తయారు చేసుకోవచ్చు. Nasi Goreng రెసిపీ ఇక్కడ చూడండి.

చాలా మంది ఇళ్లల్లో ఉదయాన్నే హడావిడిగా ఉంటుంది. అల్పాహారం సిద్ధం చేయడం దగ్గర్నించి పిల్లలను స్కూలుకు పంపడం లేదా ఆఫీసులకు వెళ్లడం. ఇలాంటి బిజీ మార్నింగ్ సమయాల్లో త్వరత్వరగా ఏదైనా సిద్ధం చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ కానిస్తారు. అప్పుడప్పుడు రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటే ఉదయాన్నే దాని పోపు పెట్టి లెమన్ రైస్, టొమాటో రైస్ లాంటిది ఏదైనా చేసేస్తారు. అయితే ఎప్పుడూ ఒకేరకంగా కాకుండా ఇంకాస్త కొత్తగా, ఏదైనా రుచిగా తినాలనుకుంటే మీరు నాసి గోరెంగ్‌ని తయారు చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

ఏమిటేమిటి.. నాసి గోరేంగా? ఇది నిజంగా తినే పదార్థమేనా? ఎప్పుడూ.. ఎక్కడా వినలేదే అని మీరు అనుకోవచ్చు. అవును ఇది ఇక్కడి వంటకం కాదు, సాంప్రదాయ ఇండోనేషియా వంటకం. ముందురోజు మిగిలిపోయిన అన్నాన్ని పాడేయకుండా నాసి గోరెంగ్‌ని తయారు చేస్తారు. ఇది కూడా ఒక ఫ్రైడ్ రైస్ అయితే ఇందులో గుడ్లు, రొయ్యల పేస్ట్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కెకాప్ మానిస్ ఉంటాయి. కెకాప్ మానిస్ అనేది తియ్యటి సోయా సాస్. ఇది ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కలిగి ఉండే ఒక శక్తివంతమైన అల్పాహారం. చికెన్, మటన్ కలిపి కూడా చేసుకోవచ్చు.

అయితే మనకు అందుబాటులో లభించే పదార్థాలతో ఇంట్లోనే నాసి గోరెంగ్‌ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ రెసిపీ ఇచ్చాం. మీరు ట్రై చేసేయండి మరి.

Nasi Goreng కోసం కావలసిన పదార్థాలు

  • మిగిలిపోయిన అన్నం
  • 1 తరిగిన క్యారెట్
  • కొన్ని బీన్స్
  • 1 తరిగిన ఉల్లిపాయ
  • 4-5 గుడ్లు
  • 2 పిండిచేసిన వెల్లుల్లి
  • 1 టేబుల్ స్పూన్ కెకాప్ మానిస్
  • 2-3 టీస్పూన్ నూనె

తయారీ విధానం

  • కడాయిలో నూనె వేడిచేసి అందులో ముందుగా క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేయించండి.
  • అనంతరం వెల్లులి పేస్ట్ వేసి, బీన్స్ కూడా వేసి దోరగా వేయించండి.
  • ఇప్పుడు అన్నం వేసి కలపండి. ఆపై కెకాప్ మానిస్‌ వేసి అన్నానికి పట్టేలా బాగా కలపండి.
  • ఇప్పుడు మరొక కడాయిలో గుడ్లను ఒక్కొక్కటిగా పగలగొట్టి పచ్చసొన ఉడికే వరకు వేయించాలి, కలపవద్దు.

అంతే నాసి గోరెంగ్‌ సిద్ధమైనట్లే. సర్వింగ్ ప్లేటులోకి ఫ్రైచేసిన అన్నం తీసుకొని దానిపైన ఆమ్లెట్ వేసి, దోసకాయ ముక్కలు, నిమ్మకాయతో గార్నిష్ చేసుకొని వడ్డించుకోవాలి. గరంగరంగా నాసి గోరెంగ్‌ తింటే ఎంతో గమ్మత్తుగా అనిపిస్తుంది.

సంబంధిత కథనం

టాపిక్